ఐబొమ్మ రవిని రాబిన్‌హుడ్‌ని చేసిన లోకంలో ఉన్నాం.. నిర్మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు
వందల, వేల సినిమాలను పైరసీ చేసిన ఐబొమ్మ రవి పోలీసు విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా దీనిపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాబిన్‌హుడ్‌గా ఐబొమ్మ రవి
ఐబొమ్మ రవి వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. వందల వేల సినిమాలను ఆయన పైరసీ చేసి ఐబొమ్మ సైట్‌లో అప్‌లోట్ చేసి వేల కోట్ల నష్టానికి కారణమయ్యాడు. చిత్ర పరిశ్రమకి తీవ్ర నష్టం కలిగించిన ఐబొమ్మ రవిని ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ఐబొమ్మ రవిని జనం మంచి వాడుగా కొనియాడుతున్నారు. తమ కోసం ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నారంటూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఐబొమ్మ రవికి సపోర్ట్ గా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఓ రకంగా ఈ తరం రాబిన్ హుడ్ అయిపోయాడు ఐబొమ్మ రవి. వందల్లో టికెట్ రేట్లు ఉన్న నేపథ్యంలో థియేటర్‌కి వెళ్లి సినిమా చూడని వారందరికీ ఐబొమ్మ రవి రాబిన్‌హుడ్ అని అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై నిర్మాత నాగవంశీ స్పందించారు. సెటైర్లు పేల్చారు.
ఎపిక్ మూవీ గ్లింప్స్
ప్రస్తుతం నాగవంశీ.. `ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్` అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ టైటిల్ ని ప్రకటిస్తూ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇందులో `బేబీ` జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా నటించారు. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. తాజాగా విడులైన ఈ టీజర్ ఆకట్టుకుంది. యూత్‌పుల్‌గా ఉంది. `90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్`కి సీక్వెల్‌గా దీన్ని రూపొందించినట్టుగా ఉంది. విదేశాల్లో డిగ్రీ పట్టా పొందిన వైష్ణవీ.. తనకు పెళ్లి అంటే ఇష్టం లేదని చెబుతుంది. కానీ పెద్ద వాళ్ల కోసం చేసుకోవాలని చెప్పగా, ఎలాంటి అబ్బాయి కావాలని ఫ్రెండ్స్ అడుగుతారు. దానికి ఆమె చెప్పిన క్వాలిటీస్‌కి `90 మిడిల్ క్లాస్ బయోపిక్` సిరీస్ సీన్లు చూపించడం అదిరిపోయింది. గద్దర్ లుక్‌లో ఆనంద్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు. వెనకాల గోరంటి వెంకన్న పాడిన `ఎలమంద` పాట రావడం ఆద్యంతం క్రేజీగా ఉంది. చివరగా `ఇది శేఖర్ కమ్ముల సినిమాలోని హీరోలాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి సినిమాలోని హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ` అని ఆనంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
ఐబొమ్మ రవిని రాబిన్‌హుడ్‌గా చేసిన లోకంలో ఉన్నాం
ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 90 నాటి మ్యాజిక్ ఏం మిస్ అవుతున్నాం ఇప్పుడు అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా, `ఐబొమ్మ రవిని రాబిన్‌హుడ్ చేసిన లోకంలో ఉన్నాం. 90కి, దీనికి ఏం పోలిక. రూ.50 టికెట్ రేట్లు పెంచితే మేమేదో తప్పు చేసినోళ్లం అయ్యాం. ఆ అబ్బాయి హీరో అయిపోయాడు. అలాంటి సొసైటీలో ఉంటూ తప్పేం జరిగిందని అంటారేంటండి` అని ప్రశ్నించారు నాగవంశీ. అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడా సోషల్ మీడియానే అని, అదే ఇప్పుడు ఇబ్బందిగా మారిందనేది నిర్మాత నాగవంశీ తెలిపారు. ఈ మూవీ నుంచి సీక్వెల్స్ వస్తాయని తెలిపారు.
ఆ లోటుని భర్తీ చేసే మూవీ
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, ఈ సినిమా అవకాశం రావడానికి ముందే ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన `90s` వెబ్ సిరీస్ చూశాను. సిరీస్ నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా ఆదిత్య పాత్రలో నన్ను నేను చూసుకున్నాను. గ్లింప్స్ లో ఆదిత్య ఎలాగైతే అమ్మాయితో మాట్లాడాడో, నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు అలాగే తడబడుతూ మాట్లాడేవాడిని. అలాంటి ఆదిత్య పెద్దయ్యాక తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల లండన్ కి వెళ్తే.. అక్కడ ఏం జరిగింది? ప్రేమ కథ ఏంటి? వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ఇందులో ప్రతి అంశం, ప్రతి సన్నివేశం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. తెలుగులో పూర్తిస్థాయిలో రొమాంటిక్ కామెడీ సినిమాలు పెద్దగా రావడం లేదు. ఆ లోటుని భర్తీ చేసేలా ఎపిక్ సినిమా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీ గారికి ధన్యవాదాలు. ఆదిత్య హాసన్ రాసిన ఇంతమంచి కథలో భాగం కావడం సంతోషంగా ఉంది. వైష్ణవి అద్భుతంగా నటించింది. లండన్ లో జరిగే కథ అయినా.. ఇది మన ఇంట్లో జరిగే కథలా ఉంటుంది` అని తెలిపారు.
అందమైన ప్రేమ కథ
కథానాయిక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. `ఇది యువతకు నచ్చే అందమైన ప్రేమ కథ. హీరో పాత్రకు చాలామంది అబ్బాయిలు కనెక్ట్ అవుతారు. హీరోయిన్ పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆదిత్య హాసన్ మనలాంటోడు, మనలో ఒకడిగా కనిపిస్తారు. అందుకే ఆయన కథలు అందరికీ కనెక్ట్ అవుతాయి. జీవితంలో మనం దాటి వచ్చిన చిన్న చిన్న అందమైన జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది` అని అన్నారు.

