- Home
- Entertainment
- ప్రేమాభిషేకం రివ్యూ, 18 ఏళ్ల శ్రీదేవి తో 57 ఏళ్ల వయసులో అక్కినేని నాగేశ్వరరావు రొమాన్స్ , సాహసం చేసి సక్సెస్ అయిన దాసరి
ప్రేమాభిషేకం రివ్యూ, 18 ఏళ్ల శ్రీదేవి తో 57 ఏళ్ల వయసులో అక్కినేని నాగేశ్వరరావు రొమాన్స్ , సాహసం చేసి సక్సెస్ అయిన దాసరి
అక్కినేని నాగేశ్వరావు ఆల్ టైమ్ హిట్ మూవీస్ లో ప్రేమాభిషేకం ఒకటి. దాసరి నారాయణరావు డైరెక్షన లో తెరకెక్కిన ఈసినిమా 57 ఏళ్ల వయస్సులో అక్కినేనికి అదిరిపోయే హిట్ ను అందించింది. మరి ఈసినిమా విశేషాలు రివ్యూ రూపంలో చూద్దాం.

ప్రేమాభిషేకం రివ్యూ
అక్కినేని నాగేశ్వరావుకు వీరాభిమాని దాసరి నారాయణరావు. ఏఎన్నార్ తో హిట్ మూవీ చేయాలన్న తపనతో అప్పటి వరకూ ఇచ్చిన రెండు ప్లాప్ సినిమాలను మరో సినిమాతో చెరిపేయాలన్న పట్టుదలతో రాసిన కథ ప్రేమాభిషేకం. నిజానికి ఈసినిమాలో కొత్తకథేమి చూపించలేదు దాసరి. దేవదాసులో దేవద,పారు, చంద్రముఖిలను పోలిన పాత్రలతో, ప్రేమనగర్ లోని లవ్ స్టోరీని కలగలిపి చేసిన కథ ప్రేమాభిషేకం. కాని దర్శకరత్న దాసరి మ్యాజికల్ స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అయ్యింది. ఆయన రాసిన కథ, పాటలు, చక్రవర్తి సంగీతానికి ఏఎన్నార్, జయసుధ, శ్రీదేవిల అభినయం తోడై ప్రేమాభిషేకం ప్రేక్షకాభిమానానం పొందింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు ఏఎన్నార్ ను కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడేసింది. అంతే కాదు 57 ఏళ్ల వయస్సులో అక్కినేనికి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించి రికార్డ్ క్రియట్ చేసింది. అంతే కాదు 18 ఏళ్ల వయస్సు ఉన్న శ్రీదేవితో తనకంటే దాదాపు 40 ఏళ్లు పెద్దవాడైన అక్కినేనితో డ్యూయోట్లు, రొమాంటిక్ సీన్స్ చేయించడం ఈసినిమాకే హైలెట్.
ప్రేమాభిషేకం కథ
రాజేష్ ( అక్కినేని నాగేశ్వరావు) ఎంతో సరదాగా ఉండే కుర్రాడు. స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మందు, సిగరెట్ లాంటి అలవాట్లు కూడా ఉంటాయి. ఈక్రమంలో ఆయన దేవి( శ్రీదేవి) తో ప్రేమలో పడతాడు. గొడవలతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారుతుంది. ఆతరువాత చిన్న చిన్న తగవులు,గొడవలు వచ్చినా..అది వారి ప్రేమను బలపరుస్తుంది. ఈక్రమంలో రాజేష్ కంటే ముందు దేవిని తమ బంధువు ప్రసాద్ ( మురళీ మోహన్) కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు దేవి అన్న డాక్టర్ చక్రవర్తి( మోహన్ బాబు). కానీ రాజేష్ తో దేవి ప్రేమలో పడిందని తెలుసుకుంటాడు. కానీ ఈలోపే రాజేష్ కు కాన్సర్ అని చక్రవర్తికి తెలుస్తుంది. ఈ విషయం రాజేష్ కు కూడా చెప్పకుండా వారి పెళ్లిని ఆపాలని ప్రయత్నాలు చేస్తాడు. ఈలోపు అసలు నిజం రాజేష్ కు కూడా తెలుస్తుంది. దాంతో తాను మరణిస్తాడని తెలిసి దేవి జీవితం కాపాడాలని అనుకుంటాడు. ఈలోపు ప్రసాద్ కూడా దేవిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని, ఎలాగైనా వారి పెళ్లి చేయాలని, తనపై దేవికి అసహ్యం కలిగేలా ప్రవర్తిస్తాడు. ఈలోపు వేశ్య అయిన జయంతి( జయసుధ)తో క్లోజ్ గా మూవ్ అవుతుంటాడు. దాంతో దేవికి రాజేష్ పై అస్యం పెరిగిపోతుంది. ప్రసాద్ తో పెళ్ళికి సిద్దం అవుతుంది. మరో వైపు రాజేష్ పరిస్థితి చూసి ఆయనను ప్రేమిస్తుంది జయంతి. ఫైనల్ గా ప్రసాద్ తో దేవి పెళ్లి జరుగుతుంది. ఈలోపు జయంతి రాజేష్ చావుబ్రతుకుల్లో ఉండగా అతడితో తాళి కట్టించుకుంటుంది. అసలు నిజం తెలుసుకున్న దేవి రాజేష్ ను వెతుకుంటూ వస్తుంది. క్లైమాక్స్ లో సన్నీవేశం ప్రతీ ఒక్కరి మనసుని పిండేసేలా ఉంటుంది.
ప్రేమాభిషేకం విశ్లేషణ
ప్రేమాభిషేకం సినిమా దేవదాసు సినిమాన పోలి ఉంటుంది. విషాదాంత ప్రేమ కథలను మన ఆడియన్స్ ఆదరిస్తారో లేదో అనే డౌట్ తోనే ఈసినిమాను తెరకెక్కించారు. కానీ అనుకున్నదానికంటే ఎక్కువగా స్పందన రాబట్టింది ప్రేమాభిషేకం. రాజేష్ పాత్రలో ప్రేమ, త్యాగం కనిపించేలా దాసరి అద్భుతమైన స్క్రీన్ ప్లేను రాశారు. అప్పటి యూత్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించేలా లవ్ స్టోరీతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ కళ్లలో నీళ్లు తిరిగేలా సెంటిమెంట్ ను కూడా అద్భుతంగా చూపించారీ కథలో. ప్రేమ, పెళ్లి, అపార్దాలు, మానసిక సంఘర్షణలు, వేదన, త్యాగం ఇలా ప్రేమాభిషేకం సినిమాలో చూపించిన ఎలిమెంట్స్ ఈతరం ప్రేక్షకులకు కూడా సినిమాను కనెక్ట్ చేస్తుంటుంది. అసలు హీరో చనిపోవడం ఏంటి అన్నవారు ఉన్నారు. సినిమాకు క్లైమాక్స్ ఇలానే ఉండాలి అని లేదు. ఎలాగైనా ఉండొచ్చు, కాని అది ఆడియన్స్ ను కన్విన్స్ చేసే విధంగా ఉండాలి. ప్రేమాభిషేకం సినిమాలో క్లైమాక్స్ తో ప్రేక్షకులను సంతృప్తి చెందేలా చేశాడు దాసరి. తన ప్రతిభతో హీరో మరణాన్ని కూడా పాజిటీవ్ గా తీసుకునేలా కథను మలిచాడు. అసలు అక్కినేని ఫ్యాన్స్ ఈ విషయాన్ని ఆక్సప్ట్ చేసారంటే, సినిమా ప్రభావం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఎవరు ఎలా నటించారంటే?
ప్రేమాభిషేకం సక్సెస్ లో కథతో పాటు నటీనటుల పాత్రలు, వారి నటన కారణం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రేమాభిషేకం కథకు రాజేష్ పాత్రలో ఏఎన్నార్ ప్రాణం పోశారు. 57 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోలా ఆయన నటన అద్భుతం అని చెప్పాలి. అసలు ఆయన అలా ఎలా మెయింటేన్ చేయగలిగారు అనేది నిజంగా ఫ్యాన్స్ కు పెద్ద ప్రశ్న. ఈసినిమాలో ఏఎన్నార్ తండ్రిగా నటించిన ప్రభాకర్ రెడ్డి తనకంటే ఓ పదేళ్లు చిన్నవాడు. కానీ ఆ వయసు తేడా ఎక్కడా కనిపింలేదు. ఏఎన్నార్ అలవాట్లు,డైట్ ఆయన్ను ఎప్పటికీ యువకుడిలా ఉండేలా చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం నాగార్జున కూడా అదే పద్దతిని ఫాలో అవుతున్నారు. ఇక ఏఎన్నార్ నటన, తాగుబోతుగా మరోసారి దేవదాసును గుర్తు చేశారు. డాన్స్ లతో యువతను ఉర్రూతలూగించారు. పాటలు, రొమాన్స్ తో గలిగింతలు పెట్టారు. సెకండ్ ఆఫ్ నుంచి సెంటిమెంట్ తో మనసును పిండేశారు.
చిన్న వయసులో శ్రీదేవి అద్భుతం
ఏఎన్నార్ తో పాటు దేవి పాత్రలో శ్రీదేవి అద్భుతంగా నటించింది. ఏజ్ గ్యాప్ పక్కన పెట్టి మెచ్చూర్డ్ యాక్టింగ్ చూపించింది. ఇక వేశ్య పాత్రలో జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సహజ నటనతో ఆమె అద్భుతం చేసింది. ఇక డాక్టర్ చక్రవర్తిగా మోహన్ బాబు తన పాత్రను పరిది మేరకు పండించారు. గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, పద్మనాభం, హరీష్ ఇలా ఎవరికి వారు తమ నటనతో సినిమాను సక్సెస్ వైపు మళ్లించారు.
దాసరి చేసిన మాయాజాలం
ప్రేమాభిషేకం సినిమాకు తెర ముందే కాదు, తెర వెనుక కూడా అద్భుతాలు చేసినవారు ఉన్నారు. మరీ ముఖ్యంగా దాసరి నారాయణ రావు ఈసినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. సినిమా మధ్యలో దాసరి, అక్కినేని మధ్య ఓసీన్ విషయంలో విభేదాలు వచ్చాయి. ఇద్దరు పట్టుపట్టుకుని కూర్చుున్నారు. షూటింగ్ కూడా ఆగిపోయింది. దాంతో అన్నపూర్ణమ్మ కల్పించుకుని వివాదం ముగించారట. నిస్సందేహంగా దాసరి నారాయణరావు కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రంగా ప్రేమాభిషేకాన్ని పేర్కొనవచ్చు, ఎందుకంటే అతను ANR సరిగ్గా సరిపోయే కథను చాలా జాగ్రత్తగా రూపొందించాడు. ప్రేక్షకుల పల్స్ ఎలా ఉంటుందో, ఏఎన్ఆర్‌ని తెరపై ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో ఆయనకు తెలుసు. ఏఎన్‌ఆర్‌కి ఎలాంటి డైలాగ్‌లు సరిపోతాయో, ఏ రకమైన సెంటిమెంట్ సన్నివేశాలు మహిళా ప్రేక్షకులను ఆకర్షిస్తాయో అతనికి పూర్తిగా తెలుసు. కమర్షియల్‌గా విజయవంతమైన సినిమా చేయడానికి దాసరి ఈ అంశాలన్నింటినీ సరైన నిష్పత్తిలో జోడించి ఎటర్నల్ ఫిల్మ్ రెసిపీని ఆడియన్స్ కు టేస్ట్ చూపించాడు.
57 ఏళ్ల వయసులో రొమాన్స్
ఏఎన్‌ఆర్‌కి 57 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతను యువకుడిగా చూపించడం చాలా పెద్ద టాస్క్. అది కూడా 18 ఏళ్ల వయస్సులో ఉన్న శ్రీదేవి వంటి యంగ్ హీరోయిన్ ను తీసుకుని ప్రయోగం చేయడం, అది సక్సెస్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందగలిగాడు. 1971లో దసరా బుల్లోడు , ప్రేమ్ నగర్ చిత్రాలతో కమర్షియల్‌గా అద్భుతమైన విజయం సాధించిన తర్వాత, పదేళ్ల తర్వాత ఏఎన్‌ఆర్‌కి ఇంత పెద్ద హిట్ ఇవ్వడంలో దాసరి పాత్ర ఉంది. అంతకు ముందు ఏఎన్నార్ తో దేవదాసు మళ్లీ పుట్టాడు, రావణఉడే రాముడైతే లాంటి ప్లాప్ ల తరువాత మరింత పట్టుదలతో, ప్రేమాభిషేకం సినిమా మేకింగ్‌లో ఎలాంటి పొరపాటు చేయకుండా తెరకెక్కించి విజయం సాధించాడు దాసరి.
పాటల పాత్ర ఎక్కువ
ఈసినిమాలో దాసరి రాసిన పాటలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి. ఆ పాటలకు చక్రవర్తి అందించిన వాణిజ్య బాణీలు ప్రేమాభిషేకం సినిమాను మరో మెట్టు ఎక్కించాయి అని చెప్పవచ్చు. చక్రవర్తి సంగీతంలో ప్రేమాభిషేకం పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అన్ని పాటుల ఎవర్ గ్రీన్ గా నలిచాయి. 'దేవీ మౌనమా శ్రీదేవి మౌనమా. ' 'కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్న..', 'తారలు దిగివచ్చిన వేళ', 'నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని, ', ‘'వందనం అభివందనం నీ అందమే..' , 'ఆగదూ... ఆగదూ.. ఆతితే సాగదు'- ఇలా దాసరి రాసిన అన్ని పాటలుఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. బాలు గళం నుంచి జాలువారిన పాటలకు యువత పూనకాలతో ఊగిపోయారు. అంతే కాదు ఎస్పీబీకి ఈ పాటలకు గాను నందీ అవార్డు కూడా లభించింది. 57వ ఏట 'ప్రేమాభిషేకం'తో అంత పెద్ద సక్సెస్ రావడం అక్కినేనికి అన్ని విధాలా తృప్తినిచ్చింది. “ఈ క్రెడిట్ అంతా దాసరిదే. చక్రవర్తి సంగీతానిదీ మేజర్ కంట్రిబ్యూషన్" అని అక్కినేని తరచూ చెబుతుండేవారు.
ప్రేమాభిషేకం అరుదైన రికార్డులు
ప్రేమాభిషేకం తెలుగు సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేసింది. కలెక్షన్లతో చరిత్రలో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు మంచి రేటుకు కొనడానికి చాలామంది ముందుకు వచ్చారు. కానీ దాసరి సలహా మేరకు అక్కినేని ఈసినిమా హక్కులను ఎవరికీ అమ్మలేదు . నెల్లూరు, సీడెడ్ ప్రాంతాల హక్కులు మాత్రం అమ్మి, మిగతాచోట్ల సొంతంగా తమ అన్నపూర్ణా ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేశారు. 31 కేంద్రాలలో రిలీజైన ప్రేమాభిషేకం సినిమా మొత్తం 30 కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం , 24 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. తెలుగులో మొదటిసారిగా గుంటూరు విజయా టాకీస్లో నేరుగా 365 రోజులు ప్రదర్శించబడి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది ప్రేమాభిషేకం. తర్వాత విజయవాడ, హైదరాబాద్ లలో షిఫ్టులు, నూన్లతో కలిపి, ఏకంగా 527 రోజులు ప్రదర్శితమై, అప్పటి ఉమ్మడి ‘ఆంధ్రప్రదేశ్ ప్లాటినమ్ జూబ్లీ (75 వీక్స్) ఆడిన తొలిచిత్రం'గా రికార్డు సృష్టించింది.
బాక్సాఫీస్ పై దండయాత్ర
మొత్తానికి ప్రేమనే త్యాగం చేసే క్యాన్సర్ పేషెంట్ కథకు జనం నీరాజనం పలికారు. అంతే కాదు ఏఎన్నార్ కు దాసరి ముందు మాట ఇచ్చారట. నన్ను నమ్మండి. మీకు మాట ఇస్తున్నా.ఈ సినిమా కోటి రూపాయలు వసూలు చేస్తుంది అన్నారట. కాని ప్రేమాభిషేకం అంతకు మించి సాధించింది. ఫైనల్ రన్ లో ప్రేమాభిషేకం కోటీ 30 లక్షలు వసూలు చేసింది. ఈ విషయాన్ని మద్రాసులో జరిగిన ప్రేమాభిషేకం గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో అక్కినేని సభాముఖంగా చెప్పారు. ఆతరువాత కూడా 75 వారాల ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు చేసుకున్న ప్రేమాభిషేకం సినిమా థియేటర్ల నుంచి మాయం అయ్యేసరికి కోటిన్నర దాకా వసూలు చేసింది. అక్కినేని కెరీర్లో తొలి కోటి వసూలు చిత్రం ఇదే. అంతే కాదు అప్పుడు కొత్తగా ప్రారంభించిన అన్నపూర్ణా స్టూడియోను ఆర్దిక కష్టాల నుంచి ఈసినిమా బయటపడేసింది. మరి ఈసినిమాను ఎవరు నిర్మించారో తెలుసా.. అక్కినేని నాగేశ్వరావు ను హీరోగా పెట్టి ఆయన తనయులు అక్కినేని వెంకట్,నాగార్జున ప్రేమాభిషేకం సినిమాను నిర్మించారు.