Pellikuturu Party Review : ‘పెళ్లి కూతురు పార్టీ ’ మూవీ రివ్యూ..
ప్రస్తుతం భారీ చిత్రాల ఫ్లో తగ్గడంతో చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో లేడీ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రం ‘పెళ్లి కూతురు పార్టీ’ తాజాగా విడుదలైంది. ఈ మూవీ రివ్యూ చూద్దాం..

ఇప్పటి దాకా పెళ్లికి ముందు అబ్బాయిలే చేసుకునే బ్యాచిలర్ పార్టీలను.. అమ్మాయిలు కూడా చేసుకుంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో లేడీ డైరెక్టర్ మల్లాది అపర్ణ ‘పెళ్లి కూతురు పార్టీ’ (Pelli Kuturu Party)మూవీని తెరకెక్కింంది. ఈ చిత్రంలో యంగ్ యాక్టర్ ప్రిన్స్, అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా, సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఏవీఆర్ స్వామి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ట్రైలర్, మ్యూజిక్ తో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ రివ్యూ చూద్దాం..
కథ : ఆర్కిటెక్చర్ నందిని (డెబ్యూ హీరోయిన్ భావన)... Airforce పైలట్ అయిన క్రిష్ (వికాస్ దర్శన్) ని అరెంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది. అదే సమయంలో పెళ్లి కూతురు నందిని చెల్లి ముద్దుల రాణి (అనీషా ధామా) క్రిష్ ని ముద్దు పెట్టుకుంటుంది. తరువాత అది తప్పు అని తెలుసుకొని.. అక్క పెళ్లిని తాను ముద్దు పెట్టిన వ్యక్తితో తప్పించి, వేరే వ్యక్తితో చేయాలనుకుంటుంది. ముద్దుల రాణి. ఇక పెళ్ళికొడుకుని వెతికే క్రమంలో పెళ్లి కూతురు పార్టీ (బ్యాచ్ లర్ పార్టీ)ని చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. ఇంట్లో తల్లిదండ్రులని అడుగుతారు.
అయితే తల్లిదండ్రులు బామ్మని(అన్నపూర్ణ) వెంట తీసుకొని తిరుపతికి వెళ్ళండని సూచిస్తారు. కానీ వీరంతా తిరుపతికి వెళ్లకుండా హైదరాబాద్ కి వెళ్ళాలని, అక్కడైతే తన అక్కకు మంచి కుర్రాన్ని సెట్ చేసి పెళ్లి చేయాలని ముద్దుల రాణి ఫిక్స్ అవుతుంది. అలా తిరుపతికి వెళ్లాల్సిన వారు హైదరాబాద్ కి వచ్చే క్రమంలో ఎలాంటి ట్విస్ట్ లు ఎదురయ్యాయి? అండర్ కవర్ కాప్ అయిన విక్రమ్ (ప్రిన్స్)ని... నందినికి సెట్ చేయడానికి వాళ్ళు ఎదుర్కొన్న అడ్డంకులు? వాటిని అధిగమించడానికి వేసిన ప్లాన్స్... ఆ ప్లాన్ ని అమలుచేసే క్రమంలో తమ బామ్మ (అన్నపూర్ణ)తో వచ్చే కామెడీ.. ఆ తరువాత ట్విస్ట్ లే ఈ చిత్రం ప్రధాన కథ.
కథనం విశ్లేషణ: పెళ్లికి ముందు ఇప్పటి వరకు అబ్బాయిలే బ్యాచ్ లర్ పార్టీలు చేసుకోవడం చూశాం. అదే అమ్మాయిలు కూడా బ్యాచ్ లర్ పార్టీ చేసుకుంటే ఆ కిక్కే వేరు. పురుషులతో పాటు మహిళలకి కూడా సమాన హక్కులు, హోదాలు, స్వేచ్చ ఉండాలనుకునే నేటి సమాజంలో ఇప్పటికీ కొన్ని సంప్రదాయాల విషయంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు వుండలేక పోతున్నారు. అందులో పెళ్లికి ముందు అబ్బాయిలు చేసుకునే బ్యాచ్ లర్ పార్టీ ఒకటి. ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా ఇలాంటి పార్టీలు చేసుకుంటే వాళ్ల ఆనందానికి హద్దులు ఉండవు. మహిళ దర్శకురాలు మల్లాది అపర్ణ... బ్యాచ్ లర్ అమ్మాయిల కోణంలో వారి మనోభావాలను చక్కగా పెళ్ళికూతురు పార్టీలో ఆవిష్కరించారు.
నటీనటుల పనితీరు : యూత్ ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమా ఆద్యంతం సరదగా సాగిపోతుంది. కొన్ని చోట్ల సన్నివేశాలు లాగ్ గా అనిపిస్తాయి. అయినా తర్వాతి సీన్లు కథలోకి లాక్కెళ్లాయి. ఇటీవల విడుదలైన DJ టిల్లు సినిమాతో మంచి కామెడీని పండించిన నటుడు ప్రిన్స్ ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. గీతా గోవిందం చిత్రంలో బోల్డ్ సీన్ తో యూత్ ని ఆకట్టుకున్న అనీషా ధామా లీడ్ రోల్ పోషించింది. బామ్మగా నటించిన అన్నపూర్ణమ్మ తన మార్క్ కామెడీతో అలరించింది. రోడ్ జర్నీలో... మిగతా అమ్మాయిలతో కలిసి చేసే కామెడీ, ఆమె ఫన్నీ సంభాషణలు అన్నీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
టెక్నీషియన్స్ వర్క్ : శ్రీకర్ అగస్తీ అందించిన సంగీతం బాగుంది. కథకు తగ్గట్టుగా ఇంకాస్తా బెస్ట్ మ్యూజిక్ అందించే అవకాశం ఉంది. సినిమాటోగ్రఫి రీచ్ గా వుంది. గోవా అందాలను చక్కగా చిత్రీకరించారు. ఎడిటింగ్ పర్లేదు. నిర్మాత ఎ.వి.ఆర్.స్వామి సినిమాను క్వాలిటీగా తీసే ప్రయత్నం చేశారు. నిర్మాణ విలువలు పర్లేదు అనిపిస్తున్నాయి.
Rating-2.75