- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్.. ఈ సినిమాలు చేసి ఉంటే..?
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్.. ఈ సినిమాలు చేసి ఉంటే..?
Pawan Kalyan Rejected Movies: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్రెండ్‌సెట్టర్. అయితే, అనివార్య కారణాల వల్ల కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ను ఆయన వదులుకోవాల్సి వచ్చింది. పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ ఆసక్తికర సినిమాలేంటో చూసేయండి.

పవన్ వదులుకున్న బ్లాక్ బస్టర్లు
Pawan Kalyan Rejected Movies: సినీ ఇండస్ట్రీలో ఏ నటుడికి హిట్స్, ఫ్లాప్స్ సర్వ సాధారణం. తమ దగ్గరకి వచ్చిన కథలను కొన్నిసార్లు సరిగ్గా అంచనా లేకపోవడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా మరొక హీరో చేతికి వెళ్ళి బ్లాక్‌బస్టర్‌గా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి ఉదాహరణల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ముందుంటుంది. ఆయన చేజార్చుకున్న కొన్ని సినిమాలు వేరే హీరోల కెరీర్‌ను మలుపుతిప్పాయి. ఇంతకీ పవర్ స్టార్ తన కెరీర్‌లో వదులుకున్న ఆ బ్లాక్ బస్టర్ సినిమాలేంటో తెలుసుకుందాం.
ఆ సినిమాలు చేస్తే మరోలా..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటూ దేశ రాజకీయాల్లో కీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా రాజకీయ నాయకుడిగా, నటుడిగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా గతంలో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు.
గత నెలలో హర హర వీర మల్లుతో ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ఇక ఈ నెల చివరిలో OG సినిమాతో అభిమానుల్లో జోష్ నింపనున్నారు. అలాగే.. ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా లైన్ లో పెట్టారు. అయితే.. పవన్ కళ్యాణ్ వదులుకున్న కొన్ని సినిమాలు, తర్వాతి కొందరికి హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారాయి. ఆ సినిమాలే వారికి స్టార్‌డమ్ ను తెచ్చిపెట్టాయి. పవన్ తిరస్కరించిన చిత్రాలు ఇవే..
ఇడియట్ (2002)
ఇడియట్ సినిమా కోసం దర్శకుడు పూరీ జగన్నాథ్ మొదట హీరో సుమంత్‌ను సంప్రదించాడు. కానీ ఆ కాంబినేషన్ కుదరలేదు. తర్వాత పవన్ కళ్యాణ్‌కి కథ వినిపించాడు. కథ నచ్చినా, కొన్ని సన్నివేశాలు మార్చాలని పవన్ సూచించాడు. పూరీ కూడా మార్పులు చేశాడు. కానీ, అవి పవన్‌కి సెట్ కాలేదు. దీంతో పవన్ ఈ ప్రాజెక్ట్‌ను వదిలేశాడు. ఆ తర్వాత ఆ అవకాశం రవితేజకు దక్కింది. 2002లో విడుదలైన ఇడియట్ భారీ విజయాన్ని సాధించి, రవితేజను మాస్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా రవితేజ కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి కథను కూడా పవన్ కళ్యాణ్ కోసమే రాశాడు పూరీ. కిక్‌బాక్సింగ్ నేపథ్యంతో సాగిన ఈ కథ పవన్‌కీ నచ్చింది. అయితే అప్పట్లో ఆయనకు డేట్స్ కుదరకపోవడంతో ప్రాజెక్ట్ వదిలేశారు. ఆ తర్వాత ఈ ఛాన్స్ రవితేజకు దక్కింది. కట్ చేస్తే.. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ఎలాంటి విజయం సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో రవితేజకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టడమే కాదు.. ఆయన కెరీర్ మరో మలుపు తిరిగింది.
ఒక్కడు (2003)
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ మొదట పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చింది. సీనియర్ రైటర్ తోట ప్రసాద్ ప్రకారం, గుణశేఖర్ కథను పవన్‌కు వినిపించారు. అదేసమయంలో ఈ కథను నిర్మాత ఎమ్మెస్ రాజు.. మహేష్‌బాబుకు చెప్పడం, ప్రిన్స్ వెంటనే ఓకే చెప్పడంతో ఒక్కడు సినిమా మహేష్ చేతికి వెళ్లింది. చివరికి ఒక్కడు మహేష్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారి, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
అతడు (2005)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇష్టపడి రాసుకున్న కథ ఇది. ఈ సినిమాలో పార్ధు పాత్రకు ముందుగా పవన్ కళ్యాణ్ అనుకున్నాడు. కానీ ఆ కథ పవన్‌కు కనెక్ట్ కాలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ మహేష్ బాబు చేతికి వెళ్లింది. ఫలితంగా అతడు బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, మహేష్ కెరీర్‌లో మైలురాయిగా మారింది. త్రివిక్రమ్ – మహేష్ కాంబోకూ ఇదే మొదటి విజయం.
పోకిరి (2006)
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ మొదట పవన్ కళ్యాణ్‌కి ఆఫర్ చేశారు. కానీ డేట్స్ కుదరక ఆయన వదులుకోవాల్సి వచ్చింది. “ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు” అనే డైలాగ్ అసలు పవన్ నోటి నుంచి రావాల్సింది. డేట్స్ సెట్ అవ్వక మహేష్ బాబు బుల్లెట్ దించేశారు. కట్ చేస్తే.. పోకిరి మూవీ మహేష్ బాబు కెరీర్‌లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
మిరపకాయ్ (2011)
అండర్‌కవర్ పోలీస్ పాత్రలో రవితేజ నటించిన ఈ హిట్ మూవీ మొదట పవన్ కళ్యాణ్ కోసం రాశారు డైరెక్టర్ హరీశ్ శంకర్. పవన్ కోసం ప్రత్యేకంగా కథ సిద్ధం చేసినా, ఆయనకు స్క్రిప్ట్ నచ్చినా.. పాత్ర తనకు సరిపోదని భావించి పవన్ ఆ కథను కూడా తిరస్కరించారు. ఆ తర్వాత రవితేజ చేసిన మిరపకాయ్ మంచి హిట్‌గా నిలిచి ఆయన కెరీర్‌లో మరో మాస్ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు తెచ్చింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వెంకటేష్‌తో కలిసి నటించేందుకు చిన్నోడు పాత్రను మొదట పవన్ కళ్యాణ్‌కి ఆఫర్ చేశారు. కానీ ఆయనకి కథ నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తర్వాత ఆ పాత్ర మహేష్ బాబు చేతికి వెళ్లింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి ఫ్యామిలీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా మహేష్ కెరీర్‌లో ఓ సాఫ్ట్ ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ను క్రియేట్ చేసింది.