Pawan Kalyan: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువతకు పిలుపునిచ్చారు. మన సంప్రదాయాన్ని కాపాడుతూ చేనేత రంగాన్ని పునరుజ్జీవింపజేయడానికి వారానికి కనీసం ఒక్కరోజు చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు.

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాష్ట్ర యువతకు ప్రత్యేక పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత రంగం పునరుజ్జీవింప చేయాలని తెలిపారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు, స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీక అని గుర్తుచేశారు. యువత వారానికి కనీసం ఒక్కరోజు అయినా చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు.

గురువారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, చేనేత రంగం పతనం చెందకుండా దాన్ని ప్రోత్సహించడం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కేబినెట్ చేనేత రంగానికి ఊతమిచ్చే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నదని తెలిపారు. అందులో భాగంగా చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. 

జీఎస్టీ మినహాయింపు

చేనేత రంగం పునరుజ్జీవింప చేయాలని చేనేత సొసైటీల నుంచి ఆప్కో కొనుగోలు చేసే వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల చేనేత కార్మికుల ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గనున్నదని తెలిపారు.

కార్మికుల ఆర్థిక భద్రత కోసం త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. చేనేత వస్త్రాల వాడకాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. చేనేత కళ మన దేశ సంస్కృతికి, స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీక. అసంఘటిత రంగంలో కీలకమైన చేనేతను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని అని పేర్కొన్నారు.

యువతకు ప్రత్యేక పిలుపు

"రాష్ట్రంలోని యువత వారానికి ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరిస్తే, వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి" అని పవన్ కళ్యాణ్ అన్నారు. చేనేత కళ మన వారసత్వమని, దాన్ని కాపాడటం ప్రభుత్వంతో పాటు ప్రజల బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చేనేత వస్త్రాల వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు.