పవన్ కళ్యాణ్‌కు బెదిరింపు కాల్స్: మెగా బ్రదర్ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ చేసి సంచలనం రేపారు.

Pawan Kalyan, threatening calls, Naga babu
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఆయన పేషీకీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయనను వదిలేది లేదంటూ ఓ అపరిచితుడు డిప్యూటీ సీఎం పేషీకీ అసభ్యకరమైన మెసేజ్ లు పంపటం అంతటా చర్చగా మారింది.
ఈ విషయాన్ని కార్యాలయ సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ ఘటనపై ఏపీ హోమ్ మినిస్టర్ అనిత కూడా స్పందించారు.
ఇదే విషయమై ఏపీ డీజీపీతో మాట్లాడిన ఆమె.. ఫోన్ కాల్, మెసేజ్ లు వచ్చిన నంబర్ ను ట్రేస్ చేసి నిందితుడుని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులపై ఇలాంటి చర్యలకు ఉపక్రమించే వారిని వదిలిపెట్టేది లేదంటూ అనిత హెచ్చరించారు.
సోషల్ మీడియాలోనూ ప్రజా ప్రతినిధులపై అసభ్యకరమైన పోస్టులు చేసినా, కామెంట్లు పెట్టినా ఉపేక్షించేది లేదన్నారు. మరోవైపు ఈ తాజా పరిణామంతో డిప్యూటీ సీఎం భద్రతపై జనసేన నేతల్లో, ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఈ క్రమంలో పవన్ పేషీకి రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు డీజీపీ నిర్థారించారు. త్వరలోనే వాళ్లను పట్టుకుంటామన్నారు. అయితే ఈ కాల్స్ చేసింది ఎవరు అనే విషయమై రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే ఫోన్ కాల్ కేసులో ఓ క్లూ దొరికినట్లు తెలుస్తోంది. పవన్‌ను చంపేస్తామని వచ్చిన బెదిరింపు కాల్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. అగంతకుడిని కృష్ణలంక పోలీసులు గుర్తించారు.
నిందితుడు లబ్బీపేటలో ఉన్నట్లు సెల్‌ఫోన్ ట్రాక్ చేసి పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే లబ్బీపేటకు వెళ్లే సరికి ఆ అగంతకుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ప్రస్తుతం పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు.
పవన్‌కు బెదిరింపుల వేళ మెగా బ్రదర్ నాగబాబు సంచలన ట్వీట్ చేశారు. ‘‘ఈ ప్రపంచంలోనే అత్యంత సులభమైన పని.. పవన్‌తో స్నేహం చేయడం, అతనితో జట్టు కట్టడం, అతనికి సన్నిహితుడిగా ఉండడం, కానీ అతని శత్రువుగా అవ్వాలంటే మాత్రం చాలా అర్హతలు ఉండాలి’’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
ఇక ఈమధ్య కాలంలో పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కాస్త ఎగ్రెసివ్ గా వెళ్ళటం అందుకు కారణం కావచ్చు అంటున్నారు. రీసెంట్ గా ఓ షిప్ ను సీజ్ చేస్తామంటూ హెచ్చరించారు. అలాగే బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. వీటిన్నటి వైపు చూస్తే చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా ఈ విషయమై స్పందించలేదు.
read more:మోహన్ బాబు కుటుంబ వివాదం: మంచు మనోజ్ సంచలన ఆరోపణలు, పవన్, చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలకు లేఖ
also read: 2024 టాప్ హారర్ సినిమాలు: ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే?