- Home
- Entertainment
- Balayya-Pawan: బాలయ్యని ఫాలో అవుతున్న పవన్.. `అఖండ` విషయంలో జరిగింది `భీమ్లా నాయక్`కి వర్కౌట్ అవుతుందా?
Balayya-Pawan: బాలయ్యని ఫాలో అవుతున్న పవన్.. `అఖండ` విషయంలో జరిగింది `భీమ్లా నాయక్`కి వర్కౌట్ అవుతుందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ట్రెండ్ సెట్టర్. ఆయన ఎవరినీ ఫాలో అవ్వరు, ఆయన్ని అభిమానులు, ఇతర హీరోలు ఫాలో అవుతుంటారు. కానీ ఇప్పుడు బాలయ్యని పవన్ ఫాలో అవుతుండటం హాట్ టాపిక్ అవుతుంది.

బాలకృష్ణ ఇటీవల `అఖండ` చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 2న విడుదలై 130కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. బాలయ్య రెండు పాత్రల్లో నటన, ప్రగ్యా అందాలు, సంగీత దర్శకుడు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి కలిసొచ్చాయి. దీనికి తోడు బాలయ్య రెట్టింపు ఎనర్జీతో చూపించిన నట విశ్వరూపం, బోయపాటి మార్క్ ఎలివేషన్లు, మ్యాజిక్‌లు సినిమాకి అఖండ విజయాన్ని అందించాయి.
అయితే కరోనా ప్రభావం, ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం, స్టూడెంట్స్ కి ఎలాంటి హాలీడేస్ లేకపోవడం, ఈ క్రమంలో జనాలు థియేటర్లకి వస్తారా? రారా అనే సందేహాల నడుమ బాలయ్య డేరింగ్ డెషీషన్ తీసుకున్నారు. ఏదేమైనా అంటూ ఎదురీదారు. థియేటర్లోకి వచ్చిన `అఖండ` ఫస్డ్ షో నుంచే మోత మోగించింది. అన్ని అడ్డంకులను అధిగమించి `అఖండ` చిత్రం ఏకంగా 130కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది.
అయితే ఏపీలో టికెట్ల రేట్ల సమస్యని పరిష్కారం కోసం `అఖండ` సినిమా విడుదల సమయంలో ఏపీ సీఎం జగన్‌తో మాట్లాడాలని చిత్ర నిర్మాత బాలయ్యపై ఎంతో ఒత్తిడి తెచ్చారట. కానీ బాలయ్య వినలేదు. ఏం జరిగినా ఫర్వాలేదు, తాను మాత్రం తగ్గేదెలే(సీఎంతో మాట్లాడేది లేద)ని స్పష్టం చేశారు. అనేక సందిగ్ధాల మధ్య విడుదలైన `అఖండ` మంచి విజయం సాధించడంతో బాలయ్యకి నమ్మకం పెరిగింది. దీంతో టికెట్ రేట్ల విషయంలో ఇటీవల మరోసారి సినీ పెద్దలు సీఎం జగన్‌తో భేటీ నిర్వహించిన నేపథ్యంలో అందులో పాల్గొనాలని, తమతో కలిసి రావాలని చిరు కోరినా బాలయ్య వెళ్లలేదు. తన పారితోషికం పెంచనని, తన సినిమా బడ్జెట్ పెంచనని, ప్రతికూలంలోనే తన సినిమా బాగా ఆడిందని, దీంతో జగన్‌ని కలిసేది, తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నారు. ఓ రకంగా `భీమ్లా నాయక్` విషయంలో `అఖండ`నే ఫాలో అవుతున్నారు పవన్. తన సినిమాని అత్యంత ప్రతికూల సమయం అయిన ఫిబ్రవరి 25నే విడుదల చేయాలని నిర్ణయించారు. ఏపీ టికెట్ రేట్ల ఇష్యూ ఇంకా క్లోజ్ కాలేదు. రేపు(ఫిబ్రవరి 17) మరోసారి సినిమా కమిటీతో ఏపీ ప్రభుత్వం చర్చించబోతుంది. ఇందులో టికెట్ రేట్ల ఇష్యూపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అదే సమయంలో థియేటర్ సమస్యలు, టికెట్ రేట్ల సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టేలా ఏపీ ప్రభుత్వం జీవోని విడుదల చేయాల్సి ఉంది. కానీ దాన్ని లెక్క చేయకుండా పవన్ బరిలోకి దిగబోతున్నారు. జీవోతో తనకు సంబంధం లేదని, రేట్లు ఎలా ఉన్నా ఆడియెన్స్ తోనే తేల్చుకుంటానని తన సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ కూడా పవన్‌పై ఉన్న కోపంతోనే, ఆయన సినిమాని తొక్కేయాలనే ఉద్దేశంతోనే టికెట్ రేట్లకి సంబంధించిన జీవోని ఆలస్యం చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే `భీమ్లా నాయక్` ఇప్పుడు రిలీజ్ కాకపోతే ఏప్రిల్ 1న రావాల్సి. అంటే `ఆర్‌ఆర్‌ఆర్`(మార్చి 25) విడుదలైన వారం రోజుల గ్యాప్‌తోనే విడుదల కాబోతుంది. దీంతో ఇది అటు `ఆర్‌ఆర్‌ఆర్`కి, ఇటు `భీమ్లా నాయక్`కి కలెక్షన్ల పరంగా గట్టి దెబ్బ పడుతుంది. ఆ డేట్ కాదంటే మే నెల వరకు డేట్స్ లేవు. జూన్‌లో రావాల్సి ఉంటుంది. అది సినిమా రిలీజ్‌లకు కరెక్ట్ టైమ్ కాదు. అందుకే ఏదేమైనా థియేటర్‌లోనే తేల్చుకోవాలని బరిలోకి దిగుతున్నారు పవన్.
అంతేకాదు టికెట్ల రేట్ల విషయంలో జగన్‌తో తాడోపేడో తేల్చుకోవాలనే ధోరణితో ఉన్నారు పవన్. అందుకే సమయం వచ్చినప్పుడల్లా తన పార్టీ మీటింగ్‌లలో ఏపీ ప్రభుత్వంపై విరుచుపడుతున్నారు. చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి వంటి పెద్దలు వెళ్లి సమస్యని విన్నవిస్తూ చేతులెత్తి వేడుకోవడం లాంటివి పవన్‌కి నచ్చదు. గతంలోనూ ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. బతిమాలుకోవడం కాదు, అది మన హక్కు అని, పోరాడి సాధించాలని తెలిపారు. ఇప్పుడూ అదే వైఖరితో ఉన్నారు పవన్. అందుకే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు కదా.. `తగ్గేదెలే` అంటున్నారు.
అయితే `అఖండ` సినిమా ప్రతికూలంలోనే సంచలన విజయంసాధించి భారీ విజయాన్ని సాధించింది. ఆడియెన్స్ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. మరి `భీమ్లా నాయక్` విషయంలో అది జరుగుతుందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రస్తుతానికి సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సినిమా కూడా బాగా వచ్చిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. పైగా ఇప్పటికే వంద కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ కరోనా థర్డ్ వేవ్ తర్వాత వస్తోన్న భారీ సినిమా `భీమ్లా నాయక్`. `అఖండ`ని ఆదరించినట్టుగానే `భీమ్లానాయక్`ని జనం ఆదరిస్తారా? అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇప్పుడిది టాలీవుడ్‌లో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. మరి ఏం జరగబోతుందనేది తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 25 వరకు వేచి చూడాల్సిందే.
పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న `భీమ్లా నాయక్` చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, కథనం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో పవన్‌కి జోడీగా నిత్యా మీనన్, రానాకి జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన `అయ్యప్పనుమ్ కోషియుమ్`కిది రీమేక్. ఇందులో పవన్.. భీమ్లానాయక్ అనే పోలీస్ అధికారిగా, రానా.. డానియెల్ శేఖర్ అనే మాజీ ఆర్మీ అధికారిగా కనిపించబోతున్నారు.