- Home
- Entertainment
- త్రివిక్రమ్ కారణంగానే పవన్ మార్కెట్ పడిపోతుంది.. మాటల మాంత్రికుడిపై పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఫైర్.. నానా రచ్చ
త్రివిక్రమ్ కారణంగానే పవన్ మార్కెట్ పడిపోతుంది.. మాటల మాంత్రికుడిపై పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఫైర్.. నానా రచ్చ
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై గుర్రుగా ఉన్నారు, ఆయన పవన్ కళ్యాణ్ కెరీర్ ని చెడగొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

Pawan Kalyan- Trivikram
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్. త్రివిక్రమ్ మాట అయితే పవన్ తూటా లాంటి వారు. సినిమాలకు అతీతమైన స్నేహం వారిది. మంచి పుస్తక ప్రియులు కూడా. చాలా ఏళ్లుగా వీరి స్నేహం కొనసాగుతుంది. సినిమాలకు సంబంధించిన పవన్‌కి ఏం చెప్పాలనుకున్నా, ముందు త్రివిక్రమ్ వద్దకు వెళ్లాకే, తర్వాత పవన్ కి చేరుతుందనే టాక్ కూడా ఉంది. పవన్ ఏం చేయాలనే డెసీషన్ మేకర్‌గా త్రివిక్రమ్ నిలుస్తున్నారనే కామెంట్లు తరచూ వినిపిస్తుంటాయి. ఇటీవల పవన్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే అదే భావన కలుగుతుంది.
`భీమ్లా నాయక్` సినిమా సెట్ చేయడంలో త్రివిక్రమ్ కీలకంగా ఉన్నారని అంటున్నారు. అంతేకాదు ఆ సినిమాకి స్క్రీన్‌ప్లే డైలాగులు అందించారు. ఆ తర్వాత ఇప్పుడు `బ్రో` చిత్రాన్ని కూడా త్రివిక్రమే సెట్ చేశారట. సముద్రఖని అనేక సందర్భాల్లో చెప్పారు. దీంతోపాటు `ఓజీ` సెట్ అయ్యింది కూడా త్రివిక్రమ్ వల్లే అని టాక్. మరోవైపు `ఉస్తాద్ భగత్ సింగ్`లోనూ ఆయన ఇన్‌వాల్వ్ మెంట్ ఉందని పూకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో పవన్ కి సినిమాల విషయాల్లో త్రివిక్రమ్ అన్నీ తానై చూసుకుంటున్నారని టాక్. ఓ రకంగా ఇది పవన్‌కి హెల్ప్ అవుతుంటే, మరోవైపు మైనస్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. `బ్రో` రిజల్ట్ కారణంగా వారంతా మండిపోతున్నారు.
పవన్, త్రివిక్రమ్ ల మధ్య ఉన్న స్నేహం గురించి పవన్ ఫ్యాన్స్ కి కూడా తెలుసు. వాళ్లు కూడా మాటల మాంత్రికుడిని `గురూజీ` అని పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ త్రివిక్రమ్‌పై ఫైర్ అవుతున్నారు. త్రివిక్రమ్ కారణంగానే పవన్ కెరీర్ డ్యామేజ్ అవుతుందని, ఆయన మార్కెట్ పడిపోతుందంటున్నారు. `అజ్ఞాతవాసి`కి ముందు పవన్ మార్కెట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అని కంపేర్ చేస్తూ సినిమా సినిమాకి పడిపోతుంది తప్పితే పెరగడం లేదని, దీనికి కారణం త్రివిక్రమే అని వారు వాదిస్తున్నారు. ఆయన ఇలాంటి ముష్టి రీమేక్ లు చేయించి పవన్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నారని, మార్కెట్ పడిపోవడానికి కారణమవుతున్నారని వాపోతున్నారు. త్రివిక్రమ్ ని పక్కన పెట్టాల్సిందే అని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా `ట్విట్టర్ స్పేస్`లో పవన్ ఫ్యాన్స్ `బ్రో` రిజల్ట్ పై చర్చించుకున్నారు. తమ అభిప్రాయాలను పంచుకున్నారు. `బ్రో` కలెక్షన్లు పడిపోవడం, అనుకున్నంతగా ఓపెనింగ్స్ రాకపోవడంతో, మూడు రోజుల్లో కూడా ఆశించిన షేర్ దక్కకపోవడంతో వారంతా అసంతృప్తి చెందుతున్నారు. తమ అభిమాన హీరోకి ఇలాంటి పరిస్థితేంటి అని వారంతా ఆవేదన చెందుతున్నారు. త్రివిక్రమ్ తెచ్చే రీమేక్ లు కాకుండా స్ట్రెయిల్ చిత్రాలు చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదంటున్నారు. చెత్త రీమేక్‌లు సెట్ చేసి పరువు తీస్తున్నారని, మిగిలిన హీరోలు సినిమా సినిమాకి గ్రాఫ్ పెంచుకుంటూ పోతుంటే పవన్ సినిమాలన్నీ డౌన్ అవుతున్నాయని, కలెక్షన్లు చూస్తుంటే బాధగా ఉందంటున్నారు.
మరోవైపు సక్సెస్ ఉంటేనే రాజకీయంగానూ ఏదైనా చేయడానికైనా, ధైర్యంగా ముందుకెళ్లడానికైనా ఉంటుందని, సక్సెస్ ఉన్నప్పుడే ఎవరైనా గౌరవిస్తారని, లేదంటే ఎవరూ పట్టించుకోరని అంటున్నారు. ఇలా మార్కెట్ పడిపోతే నెక్ట్స్ పవన్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రారని, అది చాలా ప్రభావం పడుతుందని ఆవేదన చెందుతున్నారు కొందరు పవన్ అభిమానులు.
ఇంకోవైపు ఈ వాదనని పూర్తిగా ఖండిస్తున్నారు మరికొందరు అభిమానులు. పవన్.. సక్సెస్, మార్కెట్ కోసం సినిమాలు చేయడం లేదని, ఆయన తన ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం సినిమాలు చేస్తున్నారని, అందుకే త్వరగా పూర్తయ్యే సినిమాలు చేస్తున్నారని అంటున్నారు. టైమ్‌ని దృష్టిలో పెట్టుకుని తక్కువ టైమ్‌లో పూర్తయ్యే సినిమాలు చేస్తున్నారని తెలిపారు. త్రివిక్రమ్ చెబితే పవన్ చేస్తాడా? ఆయనకంటూ సొంత అవగాహన లేదా? ఆయనకు తెలియదా ఏ సినిమా ఎలా వస్తుందో అని ప్రశ్నిస్తున్నారు. కేవలం త్రివిక్రమ్‌ని నమ్ముకునే పవన్ సినిమాలు చేస్తున్నాడా? తనకంటూ ఏం తెలియదా? అని మరో వాదన తెరపైకి తీసుకొస్తున్నారు.
అయితే `బ్రో` సినిమా ప్రస్తావన తెస్తూ, దీనికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. కానీ సినిమాలో డైలాగులు ఏం బాగున్నాయని, రీమేక్ పరంగా సినిమాలో ఆయన చేసిన మార్పులేంటి? అంటున్నారు. ఒక్కటైనా బాగుందని చెప్పే డైలాగులున్నాయా? సెకండాఫ్‌ని అలా గాలికొదిలేశారేం అంటూ మండిపడుతున్నారు. తన స్వలాభం కోసం పవన్‌ని వాడుకుంటున్నారని, త్రివిక్రమే పవన్ మార్కెట్‌ని డ్యామేజ్ చేస్తున్నారని అంటున్నారు, ఇకపై ఆయన ఇన్‌వాల్వ్ మెంట్‌ని తాము కోరుకోవడం లేదని, ఆయనకు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అంటున్నారు. మరోవైపు త్రివిక్రమ్, పవన్ ఏం చేయాలనేది వాళ్ల నిర్ణయమని, మీరు చెబితే వాళ్లు చేయరని, వాళ్లకు నచ్చింది చేస్తారు? కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా పవన్ మెజారిటీ అభిమానులు త్రివిక్రమ్‌పై మండిపడుతుండటం గమనార్హం.
ఇక `బ్రో` కలెక్షన్లు చూస్తే.. ఈ చిత్రం నాలుగు రోజుల్లో దాదాపు రూ.100కోట్ల గ్రాస్, 55కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా బిజినెస్ దాదాపు రూ.95కోట్ల వరకు జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా నాలభై కోట్లు రావాలి. కానీ సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. దాన్ని నిలబెట్టేందుకు టీమ్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఖని థియేటర్ టూర్ కి వెళ్లారు. ఇక పవన్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం బిజినెస్ పరంగా నిర్మాత సేఫ్‌లోనే ఉన్నారని టాక్, కానీ బయ్యర్లకే రికవరీ కావాల్సింది. చూడబోతుంటే ఇది నష్టాలను మిగిల్చేలా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.