అల్లు అర్జున్, అరవింద్ కు పవన్ కళ్యాణ్ పరామర్శ, ఆలస్యానికి కారణం ఏంటంటే?
దివంగత అల్లు రామలింగయ్య భార్య, అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నమ్మ మరణించగా. పవన్ కళ్యాణ్ అల్లు ఫ్యామిలీని పరామర్శించారు. కొన్ని కారణాల వల్ల అత్యక్రియలకు హాజరుకాలేకపోయిన పవర్ స్టార్, రాత్రి అరవింద్ ఇంటికి వచ్చారు.

అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ నిన్న(30 ఆగష్ట్) ఉదయం మృతి చెందారు. ఆమె మృతితో మెగా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిరంజీవికి అత్తయ్య కావడంతో మెగా ఫ్యామిలీ అంతా అల్లు వారింటికి వెళ్లి కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాదులో కనకరత్నమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. చిరంజీవి కార్యక్రమాలు పర్యావేక్షించారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ సహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా అల్లు అర్జున్ – తన ఇంట్లో నుంచే అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ తండ్రి అల్లు అరవింద్‌కు అండగా నిలిచారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు, రాజకీయ నేతలు అరవింద్ ఇంటికి వచ్చి అల్లు కనకరత్నమ్మకు నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించారు.
అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదే రోజున అంటే శనివారం విశాఖపట్నంలో పార్టీ బహిరంగ సభలో పాల్గొనాల్సి రావడంతో, అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. సభ ముగిసిన వెంటనే హైదరాబాదు చేరుకున్న పవన్ కళ్యాణ్, రాత్రివేళ అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అల్లు అరవింద్, బన్నీని పరామర్శించారు. అల్లు కనకరత్నమ్మ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ కలిసి మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బన్నీని పవన్ ఓదార్చుతున్న ఫోటోలను ఫ్యాన్స్ మరింతగా వైరల్ చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో నుంచి పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ మధ్య విభేదాలు అంటూ హడావిడి జరగడం తెలిసిందే. మొన్నటి వరకూ రెండు కుటుంబాల మధ్య కాస్త గంభీరమైన వాతావరణం కనిపించింది. అల్లు అర్జున్ ఓ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో జనసేన ఫ్యాన్స్ ఆయనపై విమర్శలు చేశారు. దీంతో పవన్ – బన్నీ మధ్య దూరం పెరిగిందనే వాదనలు వినిపించాయి. అయితే తాజా ఘటనతో ఈ దూరాలు తొలగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఫ్యామిలీ బంధాలు రాజకీయాలకు మించి ఉంటాయని ఈ ఘటన మరోసారి రుజువు చేసినట్టుగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ – బన్నీ మధ్య తలెత్తిన మాటల యుద్ధం, ఫ్యాన్ వార్స్ మొదలైన అంశాలు సమసిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇకపై మెగా, అల్లు ఫ్యామిలీలు ఒకటే అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కలిసిపోవాలని వారు కోరుకుంటున్నారు.