Pawan Kalyan: బండ్ల గణేష్ విషయంలో పవన్ మెత్తబడ్డాడా?
హీరో పవన్ కళ్యాణ్ తన భక్తుడు బండ్ల గణేష్ ని దూరం పెట్టాడనే వాదన కొన్నాళ్లుగా ఉంది. అయితే పవన్ ఈ మధ్య మెత్తబడ్డారని బండ్ల గణేష్ పై ఆయనకు కోపం పోయిందనే వాదన తెరపైకి వచ్చింది.

Pawan Kalyan
నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని ఆరాధిస్తారు. వేదికల మీద ఈశ్వరా... పవనేశ్వరా అంటూ పొగడ్తల దండకం అందుకుంటారు. పవన్ ని చూస్తే బండ్ల గణేష్ కి పూనకం వచ్చేస్తుంది. ఇక సందర్భం ఉన్నా లేకుండా అప్పుడప్పుడూ పవన్ ని బండ్ల గణేష్ కలుస్తూ ఉంటారు. బండ్ల గణేష్ ని నిర్మాత చేసింది పవన్ కళ్యాణ్. ఆయన బ్యానర్ లో పవన్ రెండు సినిమాలు చేశాడు. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్.
కాగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానం అందని బండ్ల గణేష్ పవన్ మిత్రుడు త్రివిక్రమ్ ని తిట్టాడు. ఆ ఆడియో ఫైల్ లీక్ అయ్యింది. త్రివిక్రమ్ పట్ల బండ్ల ప్రవర్తించిన తీరు నచ్చని పవన్ కళ్యాణ్ దూరం పెట్టాడనే ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వివాదం తర్వాత పవన్-బండ్ల కలిసింది లేదు. బండ్ల గణేష్ మీద పవన్ కళ్యాణ్ కోపం తగ్గలేదని అందుకే బండ్లకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని టాలీవుడ్ టాక్.
అయితే బండ్ల విషయంలో పవన్ మెత్తబడ్డాడన్న వాదన మొదలైంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి పోస్ట్ గా ఒక వీడియో షేర్ చేశారు. కెరీర్ బిగినింగ్ నుండి తన సినిమా జర్నీ ఫోటోల రూపంలో పంచుకున్నాడు. రెండు తరాల స్టార్ హీరోలు, దర్శకులు, నటులు, మ్యూజిక్ డైరెక్టర్స్, నిర్మాతలతో పాటు పలు పరిశ్రమలకు చెందిన ప్రముఖులను కలిసిన ఫోటోలు వీడియోలో జోడించారు.
కొందరి ఫోటోలు పవన్ పెట్టడానికి ఇష్టపడలేదు. ఆలీ, మోహన్ బాబులతో దిగిన ఫోటోలు లేవు. అనూహ్యంగా బండ్ల గణేష్ తో ఉన్న ఫోటో వీడియోలో ఉంది. పరిశ్రమలో తనకు ఇష్టమైన వారి ఫోటోలు ఉంచి ఇష్టం లేని వారి ఫోటోలు లేకుండా చూసుకున్నాడు. బండ్ల గణేష్ ఫోటో జోడించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ మీద కోపం పోయిందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే ఇవన్నీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టంట్స్ గా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. ఇతర హీరోలు, నటులు అంటే తనకు ఎంతో గౌరవం అని నిరూపించే ప్రయత్నమే ఈ వీడియో ఆంతర్యం అంటున్నారు. ఆ విధంగా జనసేన పార్టీకి స్టార్ హీరోల అభిమానుల మద్దతు, సానుభూతి పొందాలని చూస్తున్నాడని అంచనా వేస్తున్నారు.వారాహి యాత్రలో మహేష్, ప్రభాస్ నాకంటే పెద్ద హీరోలన్న పవన్... ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల మీద ప్రశంసలు కురిపించారు.