- Home
- Entertainment
- OG Director Sujeeth: బంగారం తాకట్టు పెట్టి మరీ సినిమాల్లోకి పంపిన తల్లి.. ఓజీ డైరెక్టర్ జీవితంలో కష్టాలు
OG Director Sujeeth: బంగారం తాకట్టు పెట్టి మరీ సినిమాల్లోకి పంపిన తల్లి.. ఓజీ డైరెక్టర్ జీవితంలో కష్టాలు
OG Director Sujeeth : పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చే చిత్రాన్ని సుజీత్ డెలివర్ చేశారు. దీనితో సుజీత్ పేరు సౌత్ లో మారుమోగుతోంది. సుజీత్ సాధించిన ఈ సక్సెస్ వెనుక, ఇండస్ట్రీలో జర్నీ వెనుక చాలా కష్టాలు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన డైరెక్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం సాయంత్రం నుంచి అభిమానుల సంబరాలు మొదలయ్యాయి ప్రీమియర్ షోల నుంచే ఓజీ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. ఈ ఏడాది సౌత్ లోనే కనీ వినీ ఎరుగని అంచనాలతో రిలీజైన చిత్రం ఓజీ అనే చెప్పాలి. ఈ చిత్రం ప్రారంభం నుంచి అంచనాలు మొదలయ్యాయి. గ్లింప్స్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా అంచనాలు పీక్స్ కి వెళ్లిపోయాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చే చిత్రాన్ని సుజీత్ డెలివర్ చేశారు. దీనితో సుజీత్ పేరు సౌత్ లో మారుమోగుతోంది. సౌత్ అగ్ర దర్శకుల జాబితాలో సుజీత్ చేరిపోయారు అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇంత పవర్ ఫుల్ గా ఏ డైరెక్టర్ కూడా ప్రజెంట్ చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. సుజీత్ తన విజన్ తో పవన్ ని స్టైలిష్ గా ప్రజెంట్ చేశారు. థియేటర్లలో పవన్ మాస్ విశ్వరూపాన్ని ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఓజీ చిత్రానికి పాజిటివ్ టాక్
డైరెక్టర్ సుజీత్ కేవలం మూడు చిత్రాలతో ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్, సుకుమార్ లాంటి అగ్ర దర్శకుల జాబితాలో సుజీత్ చేరిపోయారు అనే టాక్ వినిపిస్తోంది. సుజీత్ రన్ రాజా రన్ చిత్రంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసాడు. ప్రభాస్ తో తెరకెక్కించిన సాహో మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీనితో సుజీత్ పై కాస్త అంచనాలు తగ్గాయి. సాహో నిరాశపరిచినప్పటికీ సుజీత్ స్టైలిష్ మేకింగ్ కొందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. మొత్తంగా ఓజీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సుజీత్. దీనితో సుజీత్ జీవితానికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బంగారం తాకట్టు పెట్టి మరీ
సుజీత్ అనంతపురంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అక్టోబర్ 26న 1990లో సుజీత్ జన్మించారు. స్కూల్ దశ నుంచే సుజీత్ తెలివైన కుర్రాడిగా ఉండేవాడు. స్కూల్ సమయంలోనే సుజీత్ కి లవ్ స్టోరీలు ఉన్నాయట. కానీ వాటికి సుజీత్ అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. సినిమాలపై అభిమానం పెచుకుంటూ వచ్చాడు. సినిమాపై ఉన్న అభిమానంతోనే చెన్నై లోని ఎల్ వి ప్రసాద్ ఫిలిం అండ్ టీవీ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశాడు. వెంటనే షార్ట్ ఫిలిమ్స్ షూట్ చేయడం ప్రారంభించాడు. మంచి క్వాలిటీ ఉన్న కెమెరా కొని షార్ట్ ఫిలిమ్స్ చేయాలనేది సుజీత్ కోరిక. సుజీత్ ఉద్యోగం లేకుండా షార్ట్ ఫిలిమ్స్ అని తిరుగుతున్నప్పటికీ అతడి తల్లి ఇంకా ఎంకరేజ్ చేసింది. ఒకసారి సుజీత్ ఖరీదైన సోనీ కెమెరా కొనాలని అనుకున్నాడు. దాని ధర 44 వేల రూపాయలు. డబ్బులు లేకపోయేసరికి సుజీత్ తల్లి తన బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంది. కెమెరా కొందామని షో రూమ్ కి వెళితే ఆ కెమెరా ధర 50 వేలు దాటిపోయింది. మిగిలిన మొత్తాన్ని అప్పు చేసి సుజీత్ కి అతడి తల్లి కెమెరా కొని ఇచ్చింది.
పూరి జగన్నాధ్ ని రిక్వస్ట్ చేస్తే..
సుజీత్ తెరకెక్కించిన షార్ట్స్ ఫిలిమ్స్ కి యూట్యూబ్ లో మంచి స్పందన లభించింది. అప్పట్లో సుజీత్ కి పూరి జగన్నాధ్ ఫేవరెట్ డైరెక్టర్. ఎలాగోలా సుజిత్ పూరి జగన్నాధ్ వద్దకి వెళ్లి తనని తాను పరిచయం చేసుకున్నాడు. తాను తీసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ని సుజీత్ పూరి జగన్నాధ్ కి చూపించారు. సుజీత్ పూరికి బాగా నచ్చింది. దీనితో సుజీత్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలని ఉందని పూరిని కోరారు. ఇంత అద్భుతంగా షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నావ్.. నువ్వు ఎక్కడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ సినిమా తీసేయొచ్చు అని పూరి ప్రోత్సాహించారు.
తొలి అవకాశం ఎలా వచ్చిందంటే..
ఆ తర్వాత ఓ కెమెరా మెన్ దగ్గర అసిస్టెంట్ గా చేరారు సుజీత్. ఆ టైంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. సదరు కెమెరా మెన్ సుజీత్ దగ్గర బీర్ బాటిల్స్ తెప్పించుకునేవారట. ఇండస్ట్రీకి వచ్చింది దేని కోసం ? నేను ఏం చేస్తున్నాను ? అని సుజీత్ చాలా ఫీల్ అయ్యారట. ఆ టైంలోనే యువి క్రియేషన్స్ సంస్థ కొత్త ట్యాలెంట్ కోసం ప్రయత్నిస్తోంది. యువి క్రియేషన్స్ వాళ్ళు ప్రభాస్ కి స్నేహితులే. సుజీత్ తీసిన షార్ట్ ఫిలిమ్స్ గురించి ప్రభాస్ కి తెలిసింది. దీనితో ప్రభాస్ సుజీత్ ని పిలిపించారు. ఈ కుర్రాడి ట్యాలెంట్ ఏంటో టెస్ట్ చేయాలని ప్రభాస్ అనుకున్నారు. ఏదైనా కథ రెడీ చేసుకుని రమ్మని యువీ క్రియేషన్స్ వాళ్ళు చెప్పారు. దీనితో సుజీత్ తక్కువ సమయంలోనే తాను షూట్ చేసిన ఒక షార్ట్ ఫిలిం స్టోరీని కాస్త మార్చి రన్ రాజా రన్ అనే కథ రెడీ చేశారు. ఆ కథతో కేవలం 4 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించిన రన్ రాజా రన్ అనే చిత్రం ఏకంగా 20 కోట్లు వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. దీనితో ప్రభాస్ కి సుజీత్ పై నమ్మకం పెరిగింది. బాహుబలి 2 తెరకెక్కుతున్న సమయంలోనే సుజీత్ చెప్పిన సాహో కథ ప్రభాస్ కి బాగా నచ్చేసింది. ఆ విధంగా సాహో చిత్రంతో పాన్ ఇండియా మూవీ తెరకెక్కించే అవకాశాన్ని సుజీత్ అందుకున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సుజీత్ ప్రవల్లిక రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఓజీ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఆమె ఎమోషనల్ గా కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.