- Home
- Entertainment
- This Week Theatre Release: ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలివే.. ఓజీ, కాంతార 2కి పండగే
This Week Theatre Release: ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలివే.. ఓజీ, కాంతార 2కి పండగే
October 10 Release: ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలన్నీ తక్కువ బడ్జెట్ చిత్రాలే. అయితే అవిపెద్దగా ప్రభావితం చేసే స్థితిలో లేకపోవడంతో పవన్ `ఓజీ`, రిషబ్ శెట్టి `కాంతార 2` చిత్రాలు పండగ చేసుకోబోతోన్నాయి.

ఈ వారం విడుదలయ్యే సినిమాలివే
గత వారం వరకు పెద్ద సినిమాల హవా సాగిన నేపథ్యలో ఈ వారం చిన్న సినిమాల టైమ్ వచ్చింది. అక్టోబర్ 10న అన్నీ చిన్న సినిమాలే విడుదల కాబోతున్నాయి. పెద్ద సినిమాలు లేకపోవడంతో వరుసగా తక్కువ బడ్జెట్ చిత్రాలు థియేటర్లోకి క్యూ కడుతున్నాయి. ఆయా సినిమాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఈ వారం(అక్టోబర్ 10)న విడుదల కాబోతున్న చిత్రాల్లో ప్రధానంగా నాలుగు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి అనసూయ నటించిన `అరి`, రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ నటించిన `శశివదనే`, `మటన్ సూప్`తోపాటు మరో మూవీ థియేటర్లోకి రాబోతుంది. మరి వీటిలో ఆడియెన్స్ ని ఆకట్టుకునే మూవీ ఏంటి? బజ్ ఉన్న చిత్రమేంటి? అనేది చూస్తే.
ప్రమోషన్స్ లో ముందున్న `శశివదనే`
ఈ వారం హైప్ ఉన్న సినిమాల్లో `శశివదనే` ముందు వరుసలో ఉంది. ఈ చిత్రంలో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించారు. సాయి మోహన్ అబ్బన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఏవిఎస్ స్టూడియోస్ పతాకంపై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సంయుక్తంగా నిర్మించారు. విలేజ్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా ఇది రూపొందింది. ప్రేమ కోసం పోరాటం హైలైట్‌గా ఈ చిత్రం సాగుతుందని ట్రైలర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. ప్రేమలోని డెప్త్, ఎమోషన్స్ హైలైట్స్ గా ఈ చిత్రం ఉండబోతుందని టీమ్ చెబుతుంది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ ఎట్టకేలకు అక్టోబర్ 10న విడుదల కాబోతుంది. అయితే ఈ వారం రాబోతున్న చిత్రాల్లో దీనికి మంచి బజ్ ఉందని చెప్పొచ్చు.
అనసూయ కమ్ బ్యాక్ మూవీ
ఇక అనసూయ నటించిన `అరి` మూవీ కూడా రాబోతుంది. ప్రముఖ దర్శకుడు వీ జయశంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘అరి’ సినిమాను ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక మంచి మెసేజ్ తో ‘అరి’ సినిమాను రూపొందించారు దర్శకుడు జయశంకర్. ఇప్పటికే ఈ సినిమా పాటలు ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ప్రమోషనల్ కంటెంట్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో క్రేజీ ఆర్టిస్ట్ లు ఉండటంతో ఒకింత మంచి బజ్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు ఏడేళ్లు హిమాలయాలకు వెళ్లారు. అక్కడ తన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొత్త భగవద్గీత తరహాలో ఈ మూవీని రూపొందించడం విశేషం.
క్రేజీ కాన్సెప్ట్ తో `మటన్ సూప్`
ఈవారం రాబోతున్న మరో క్రేజీ మూవీ `మటన్ సూప్`. టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిందీ చిత్రం. ఇందులో రమణ్, వర్షా విశ్వనాథ్ జంటగా నటించారు. రామచంద్ర వట్టికూటి తెరకెక్కించారు. `విట్ నెస్ ది రియల్ లైఫ్` అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ మూవీని రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన కంటెంట్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం ఆడియెన్స్ ని అలరించేందుకు ఈ చిత్రం వస్తోంది. ఈ మూవీ ఆడియెన్స్ కి కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ తెలిపారు. కాన్సెప్ట్ అదిరిపోయేలా ఉంటుందని చెప్పారు.
రోడ్ ట్రిప్ నేపథ్యంలో `ఆన్ ది రోడ్`
తెలుగు తెరపై తొలిసారి రోడ్ ట్రిప్ థ్రిల్లర్ రూపంలో ఓ వినూత్న కథ రాబోతోంది. ‘ఆన్ ది రోడ్’ టైటిల్ తో రూపొందిన ఈ చిత్రాన్ని పూర్తిగా లడఖ్ లోయల్లో, ప్రకృతి అందాల మధ్య చిత్రీకరించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సూర్య లక్కోజు, గతంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అనేక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం, ఆర్‌జీవీ స్వయంగా ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి ఆసక్తి ఏర్పడింది. `ఓ యువకుడు, అనుకోకుండా లడఖ్ రోడ్ ట్రిప్ లో తన మాజీ ప్రియురాలిని కలుస్తాడు. ఆమె తన భర్తతో తన మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా వెకేషన్ కి వస్తుంది. అదేమీ పట్టించుకోకుండా గతాన్ని గుర్తు చేస్తూ అతను... ఆమెను తనతో వచ్చేయమని సీరియస్ గా ప్రపోజ్ చేస్తాడు. ఈలోగా ఈ విషయం ఆమె భర్తకు కూడా తెలియటంతో వాళ్ల ముగ్గురి మధ్య ఎటువంటి ఘర్షణాత్మక సన్నివేశాలు జరిగియనేదే ఈ చిత్ర కథాంశం. సస్పెన్స్, డ్రామా ప్రధానంగా సాగే ఈ సినిమాలో ప్రధాన పాత్రల మధ్య భావోద్వేగాలతో కూడిన ఈ రోడ్ ప్రయాణం, లడఖ్ అందాలు, ప్రేక్షకులను ఎమోషనల్ గా కట్టిపడేస్తుందని నమ్ముతున్నాను` అని టీమ్ వెల్లడించింది. ఈ చిత్రం కూడా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది.
ఓజీ, కాంతార 2లకు జాక్ పాట్
ఇదిలా ఉంటే ఈవారం అన్నీ చిన్న సినిమాలే కావడంతో గత వారం వచ్చిన చిత్రాలకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓజీ థియేటర్లలో సందడి చేస్తోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండో వారంలోకి అడుగుపెట్టింది. మంచి వసూళ్లతో రన్ అవుతుంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రానికిది మంచి జాక్ పాట్ అనే చెప్పాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి సేఫ్‌లోకి వస్తుందని చెప్పొచ్చు. మరోవైపు దసరాకి విడుదలైన `కాంతార 2` కూడా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి కూడా తెలుగులో యావరేజ్‌గానే ఆదరణ దక్కుతుంది. కలెక్షన్లు ఫర్వాలేదు. అయితే సోమవారం నుంచి ఎలాంటి పికప్ ఉంటుందో చూడాలి. వచ్చే వారం పెద్ద సినిమాలు లేకపోవడంతో `కాంతారః చాప్టర 1` కూడా పండగ చేసుకుంటుందని చెప్పొచ్చు.