- Home
- Entertainment
- 80s Stars Reunion: 80 రీయూనియన్ ఎలా ప్రారంభమైందో తెలుసా? మైఖేల్ జాక్సన్ మరణంతో సంబంధం.. ఆ ఇద్దరే అసలు కారణం
80s Stars Reunion: 80 రీయూనియన్ ఎలా ప్రారంభమైందో తెలుసా? మైఖేల్ జాక్సన్ మరణంతో సంబంధం.. ఆ ఇద్దరే అసలు కారణం
80 స్టార్స్ రీయూనియన్ శనివారం చెన్నైలో జరిగింది. దాదాపు 31 మంది స్టార్స్ ఇందులో పాల్గొన్నారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అసలు ఈ రీయూనియన్ ఎలా ప్రారంభమైంది, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటనేది తెలుసుకుందాం.

చెన్నైలో గ్రాండ్‌గా 80 స్టార్స్ రీయూనియన్
ఇండియన్ సినిమాలో 80 స్టార్స్ రీయూనియన్ చాలా పాపులర్. ఆనాటి స్టార్స్ అంతా ప్రతి ఏడాది కలుస్తుంటారు. చనిపోయినప్పుడు రావడం కాదు, బతికి ఉన్నప్పుడే కలవాలని, తమ ఆనందాలను, బాధలను పంచుకోవాలని, స్నేహాన్ని, తమ అనుబంధాలను మరింత బలపరుచుకోవాలనే ఉద్దేశ్యంతో `80స్టార్స్ రీయూనియన్`ని ప్రారంభించారు. ప్రతి ఏడాది 80నాటి హీరోలు, హీరోయిన్లు కలుస్తుంటారు. అన్ని విషయాలను పంచుకుంటారు. ఎంజాయ్ చేస్తారు. డాన్సులు చేస్తారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటారు. అందులో భాగంగా ఈ ఏడాదికిగానూ శనివారం ఈ 80 రీయూనియన్ జరిగింది. ఈ సారి చెన్నైలో రాజ్ కుమార్ సేతుపతి, శ్రీప్రియ ఆతిథ్యం ఇచ్చారు. ఏదో స్టార్ హోటల్స్ లో కాకుండా తమ ఇంట్లోనే ఈ రీయూనియన్ నిర్వహించడం విశేషం.
80 స్టార్స్ రీయూనియన్‌లో పాల్గొన్న స్టార్స్ వీరే
ఇందులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్‌తోపాటు జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్ కుమార్ సేతుపతి, శ్రీ ప్రియా, నదియా, సుహాసిని, రమ్యకృష్ణన్, జయసుధ, సుమలత, రెహ్మాన్, ఖుష్బూ, భాగ్యరాజ్, పూర్ణిమా భాగ్యరాజ్, లిస్సీ, నరేష్, సురేష్, శోభన, మేనక, రేవతి, ప్రభు, జయరాం, అశ్వతి జయరాం, సరితా, భానుచందర్, మీనా, లతా, స్వప్నా, జయశ్రీ, రాధ వంటి వారు ఇందులో పాల్గొన్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇది నిర్వహించారు. గతేడాదినే కలవాలని భావించారు. కానీ చెన్నైలో వరదల కారణంగా బ్రేక్ పడింది. దీంతో ఈ శనివారం అందుకు వేదికగా మార్చారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ, 80 నాటి ప్రియమైన స్నేహితులతో కూడిన ఈ రీయూనియన్ జ్ఞాపకాల మార్గంలో ఒక నడకలా ఉంటుంది. నవ్వు, వెచ్చదనం, దశాబ్దాలుగా మనం పంచుకున్న అదే విడదీయరాని బంధంతో నిండి ఉంటుంది. చాలా అందమైన జ్ఞాపకాలు అయినప్పటికీ ప్రతి సమావేశం మొదటి మీటింగ్ లాగే ఫ్రెష్‌గా అనిపిస్తుంది` అని చిరంజీవి ట్వీట్ చేశారు. సుహాసిని, లిస్సీ, ఖుష్బూ సైతం తమ ఆనందాలను పంచుకున్నారు.
స్టార్స్ రీయూనియన్‌కి మైఖేల్ జాక్సన్ మరణానికి ఉన్న సంబంధం
అయితే 80 నాటి స్టార్స్ రీయూనియన్ అనేది ఎలా ప్రారంభమైంది. ఈ ఆలోచన ఎవరికి వచ్చింది. దీనికి లెజెండరీ పాప్ సింగర్, డాన్సర్ మైఖేల్ జాక్సన్‌కి ఉన్న సంబంధం ఏంటనేది చూస్తే. ఓ రోజు హీరోయిన్ సుహాసిని.. మరో హీరోయిన్ లిస్సీని కలిసేందుకు వాళ్ల ఇంటికి వెళ్లింది. లిస్సీ దర్శకుడు ప్రియదర్శన్ భార్య. వీరిద్దరు సరదాగా కలిసిన సమయంలోనే మైఖేల్ జాక్సన్ చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు హాలీవుడ్‌తోపాటు ప్రపంచ సెలబ్రిటీలు హాజరయ్యారు. భారీగా అంతిమయాత్ర జరుగుతుంది. ఆ సందర్భాన్ని చూసిన సుహాసిని, లిస్సీ.. మైఖేల్ జాక్సన్ బతికి ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు, కానీ ఆయన చనిపోతే అందరు వచ్చారు. అప్పుడు వచ్చి ప్రయోజనం ఏంటని సుహాసిని, లిస్సీ మాట్లాడుకున్నారు. ముందే మనం ఎందుకు కలవకూడదని భావించారు. తమకు వచ్చిన ఆలోచనని అందరితో పంచుకున్నారు.
ఒక్కో ఏడాది ఒక్కో సెలబ్రిటీ ఆతిథ్యం
ఈ ఇద్దరు అప్పటి స్టార్స్ అందరికి ఫోన్ చేశారు. హీరోలు, హీరోయిన్లందరికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. అందులో మొదటగా భానుచందర్‌కి వెల్లడించారు. ఆయన కూడా వై నాట్ అని భావించారు. తనవంతుగా అందరితో మాట్లాడారు. అంతా ఓకే అనుకున్నారు. అప్పటి నుంచి కలవడం ప్రారంభించారు. అప్పటి నుంచి కలుస్తూనే ఉన్నారు. ఒక్కో ఏడాది ఒక్కో స్టార్ ఆతిథ్యం ఇస్తారు. మధ్య మధ్యలో కొన్ని సార్లు గ్యాప్ వచ్చినా, ఏమాత్రం అవకాశం ఉన్నా అంతా కలుస్తూనే ఉన్నారు. ఇందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ స్టార్స్ అంతా కలుస్తున్నారు. తమ మధ్య స్నేహాన్ని, ప్రేమ, అనుబంధాలను పంచుకుంటున్నారు.
80 స్టార్స్ రీయూనియన్‌లో నిబంధన
అయితే ఈ కలయిక వెనుక ఒక నిబంధన కూడా ఉంది. ఇందులో 80నాటి స్టార్స్ మాత్రమే కలుస్తారు. ఫ్యామిలీకి అనుమతి లేదు. అప్పటి హీరోహీరోయిన్లు జంటలు అయితే కలవొచ్చు, అంతేకాని తమ పార్టనర్స్, పిల్లలు కలవడానికి లేదు. ఇదొక నిబంధనలా పెట్టుకుని వస్తున్నారు. ఫ్యామిలీస్ వస్తే అంత ఫ్రీగా ఉండలేరు, తమ జ్ఞాపకాలను పంచుకోలేరు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాలను నటుడు భానుచందర్ ఆ మధ్య ఐ డ్రీమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా 80 స్టార్స్ రీయూనియన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు.