- Home
- Entertainment
- దేవత మూవీ రివ్యూ , 19 ఏళ్ల శ్రీదేవి తో 45 ఏళ్ల వయసులో శోభన్ బాబు రొమాన్స్, ఎమోషన్స్ తో ఏడిపించిన సినిమా
దేవత మూవీ రివ్యూ , 19 ఏళ్ల శ్రీదేవి తో 45 ఏళ్ల వయసులో శోభన్ బాబు రొమాన్స్, ఎమోషన్స్ తో ఏడిపించిన సినిమా
శోభన్ బాబు, శ్రీదేవి కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో దేవత మూవీ ఒకటి. సెంటిమెంట్, ఎమోషన్స్ ను బేస్ చేసుకుని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈసినిమా రివ్యూ ఇప్పుడు చూద్దాం.

శోభన్ బాబు, శ్రీదేవి హిట్ కాంబినేషన్
టాలీవుడ్ అందాల నటుడు, సోగ్గాడు శోభన్ బాబు, అతిలోక సుందరి శ్రీదేవి, జయప్రద కాంబినేషన్ రూపొందిన సినిమా దేవత. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించారు. 1982 సెప్టెంబర్ 10న ఘనంగా విడుదలైన ‘దేవత' భారీ సక్సెస్ ను సాధించింది. ఆ ఏడాది రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో భారీ కలెక్షన్స్ సాధించి, టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలచింది. గతంలోదేవత టైటిల్ తో రెండు సినిమాలు వచ్చినా.. ఈసినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మురిపించిందీ. ఎమోషన్స్, సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన దేవత ఫ్యామిలీ ఆడియన్స్ ను కన్నీరు పెట్టించింది.
దేవత కథ విషయానికి వస్తే
ఒక ఊరిలో ధనవంతుడైన అబ్బాయి రాంబాబు(శోభన్ బాబు). పట్నంలో లా చదువుతుంటాడు. అదే ఊరిలో ఇద్దరు అక్కాచెల్లెళ్ళు జానకి( జయప్రద) , లలిత(శ్రీదేవి) కూడా నివసిస్తుంటారు. వీరికి తల్లీ తండ్రి లేకపోవడంతో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. లలితను జానకి అల్లారుముంద్దుగా చూసుకుంటుంది. ఇక ఈ ఇద్దరు అనాథలను ఆ ఊరి ప్రెసిడెంట్ నరసయ్య( రావుగోపాలరావు) కాపాడుతూ ఉంటాడు. ఇక రాంబాబు, లలిత ప్రేమించుకుంటారు. రాంబాబు తల్లి మాత్రం తనకు చేదోడుగా ఉన్న లలిత అక్క జానకితో రాంబాబు పెళ్లి చేసి, తన కోడలుగా చూసుకోవాలని అనుకుంటుంది. తన కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో త్యాగాలు చేసిన జానకి కోసం, తాను ప్రేమించిన రాంబాబును త్యాగం చేస్తుంది లలిత.
అక్క కోసం చెల్లెలు త్యాగం
దేవత సినిమా కథలో అక్క జానకిని రాంబాబు పెళ్ళాడాలంటే.. తాను మరొకరిని పెళ్లాడాలని నిర్ణించుకుంటుంది. తనను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్న విలన్ కామేశాన్ని(మోహన్ బాబు) పెళ్ళాడుతుంది. ఈక్రమంలో కామేశం ఓ మర్డర్ చేసి జైలుకు వెళ్తాడు, ఈలోపు రాంబాబు లలిత చేసిన పని తట్టుకోలేక, తల్లి చెప్పినట్టుగా జానకిని పెళ్లాడతాడు. కానీ ఆమెతో కాపురం చేయకుండా దూరంగా ఉంచుతాడు. తన కాపురాన్ని పట్నానికి మార్చుతాడు. అక్కడ లాయర్ గా ప్రాక్టీస్ పెడతాడు రాంబాబు. ఈలోపు లలిత ఓ బాబుకు జన్మనిస్తుంది.లలిత కు బాబు ఎవరివల్ల జన్మించాడు, కామేశాన్ని లలిత్ ఎందుకు చంపేస్తుంది. అసలు నిజం తెలిసిన జానకి చెల్లికోసం చేసి అతి పెద్ద త్యాగం ఏంటి? ఇలా దేవత కథను అద్భుతమైన మలుపులతో తెరకెక్కించారు రాఘవేంద్రరావు.
దేవత సినిమా రివ్యూ
ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కు కూడా కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కింది దేవత సినిమా. అప్పటి ప్రేక్షకుల్లో యమా క్రేజ్ ఉన్న శోభన్ బాబు, శ్రీదేవి తో అద్భుతం చేశాడు దర్శకుడు. 45 ఏళ్ల వయసులో 19 ఏళ్ల శ్రీదేవితో డ్యూయోట్లు పాడుతూ, రొమాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మొదటి భాగంఅంతా ప్రేమకథ, సరదా సన్నివేశాలు, రొమాన్స్ తో అలరించి,మురిపించారు. ఇక సెకండ్ ఆఫ్ లో మాత్రం సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ తో కంటతడి పెట్టించారు. అక్కా చెల్లెళ్ల త్యాగం, ఇద్దరు హీరోయిన్లు, తల్లి మధ్యలో నలుగుతూ.. ఎవరి మనసు నొప్పించకుండా కొనసాగిన రాంబాబు పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుంది. శ్రీదేవి గ్లామర్ దేవత సినిమాకు సరికొత్త అందం తీసుకొచ్చింది. జయప్రద త్యాగం ప్రేక్షకుల మనసును కరిగించింది. సీనియర్ నటీనటులతో, నవరసాల స్టోరీతో స్క్రీన్ ప్లేను ఆకాలానికి తగ్గట్టుగా వండి వడ్డించారు దర్శకేంద్రుడు.
ఎవరెవరు ఎలా నటించారు?
ఈ సినిమాలో శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రదతో పాటు రావు గోపాలరావు, మోహన్ బాబు, నిర్మలమ్మ, పుష్పలత, నగేశ్, రమాప్రభ, సారథి, మమత, గిరిజారాణి, జయవాణి, జానకి తదితరులు నటించారు. ఒకరు తక్కువ, ఇంకొకరు ఎక్కువ అన్నది లేదు. ప్రతీ ఒక్కరు తమ పాత్రలకు తగ్గట్టు నటనతో ఆకట్టుకున్నారు. శోభన్ బాబు ప్రేమ సన్నివేశాలతో పాటు సెంటిమెంట్ ను కూడా అద్భుతంగా పండించారు. శ్రీదేవి లలిత పాత్రలో గ్లామర్ తో ఆకట్టుకోగా, జయప్రద పర్ఫామెన్స్, మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నటన ఏడిపించింది. విలన్ పాత్రలు పోషించే రావుగోపాలరావు ను ఈసినిమాలో మంచి మనిషిగా చూపించారు. యంగ్ విలన్ గా మోహన్ బాబు ఆకట్టుకున్నాడు. ఇక నిర్మలమ్మ నటన గురించి ఏం చెప్పినా తక్కువే అవుతుంది. నగేష్, రమప్రభ మధ్య కామెడీ గిలిగింతలు పెట్టించింది. ఇతర నటీనటులు తమ పాత్రల పరిదిమేరకు అద్భుతంగా నటించి మెప్పించారు.
ఎవర్ గ్రీన్ పాటలు
ఈసినిమా ఇంత అద్భుతంగా రావడంలో దర్శకుడు రాఘవేంద్రరావు పాత్ర ప్రముఖంగా చెప్పాలి. ఆయన దర్శకత్వం లో నవరసాలు ఉంటాయి. ఒక పక్క ఘాటు రొమాన్స్ ను చూపిస్తూనే.. మరో వైపు ఎమోషనల్ గా ఏడిపించేస్తాడు దర్శకుడు. మధ్య మధ్యలో కామెడీ టచ్ ఇచ్చి నవ్వుల్లో ముంచెత్తుతాడు. రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లేలో ఆ పవర్ ఉంటుంది. అది దేవత సినిమాకు బాగా వర్కౌట్ అయ్యింది. ఇక దేవత సినిమాకు మరో బలం సత్యానంద్ మాటలు. ప్రతీ డైలాగ్ లో ఆవెయిట్ కనిపిస్తుంటుంది. ఇక ఆత్రేయ, వేటూరి పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవత సినిమా మాత్రమే హిట్ అవ్వలేదు. ఈసినిమా సంగీతం కూడా సెపరేట్ సక్సెస్ ను సాధించింది. చక్రవర్తి స్వరకల్పన శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దేవత సినిమాలో "వెల్లువొచ్చి గోదారమ్మా..." పాట ఇప్పటికీ ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ తరం యువతను కూడా ఆ పాట ఆకట్టుకుంది. ఈమధ్య కాలంలో వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేశ్'సినిమాలో ఈసాంగ్ ను రీమిక్స్ చేయడం విశేషం. ఈ పాట ఒక్కటే కాదు "కుడి కన్ను కొట్టగానే...”, “ఎండావానా నీలాడాయి.......”, “చీరకట్టింది సింగారం..”, “చల్లగాలి చెప్పింది...” లాంటి పాటలన్నీ మ్యూజిక్ లవర్స్ ను అలరించాయి.
రెండు భాషల్లో దేవత రీమేక్
దేవత సినిమా 19 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అప్పటి వరకూ కాస్త నష్టల్లో ఉన్న సురేశ్ ప్రొడక్షన్స్ ను లాభాల బాట పట్టించింది దేవత సినిమాలు. ఈమూవీ విజయం వల్ల రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు రామానాయుడు. దేవత సినిమాను పలు భాషల్లో రీమేక్ కూడా చేశారు. హిందీలో సురేశ్ సంస్థనే 'తోఫా' పేరుతో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ఈసినిమాను రీమేక్ చేశారు. జితేంద్ర, శ్రీదేవి, జయప్రద కాంబోలో నిర్మించగా, అక్కడ కూడా మూవీ హిట్ అయ్యింది. ఇక తమిళంలో మోహన్, రాధిక, ఊర్వశి కాంబినేషన్ లో 'దైవపిరవి' పేరుతో ఈ సినిమాను రామానాయుడు నిర్మించారు. తమిళనాట కూడా ఈమూవీ సూపర్ హిట్ అయ్యింది. సురేశ్ ప్రొడక్షన్స్ కు దేవత సినిమా మూడు భాషల్లో కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ అద్భుతమైన సినిమా యూట్యూబ్ లో అందుభాటులో ఉంది. దేవత సినిమాను అక్కడ ఫ్రీగా చూడవచ్చు.