`ఆదిపురుష్`పై కొత్త డౌట్, ఆనాడు ఎన్టీఆర్ వల్లే కాలేదు.. మరి ఇప్పుడు ప్రభాస్..?
ప్రభాస్ `ఆదిపురుష్`లో రాముడిగా కనిపించబోతున్నాడు. మాస్, కమర్షియల్ చిత్రాల్లో మెప్పించిన ప్రభాస్ రాముడిగా ఆకట్టుకుంటాడా? సెటిల్డ్ పర్‌ఫెర్మెన్స్ తో ఆడియెన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అవుతాడా? ఇప్పుడీ అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్‌నే పౌరాణికంలో స్వీకరించలేదు. ఇప్పుడు ప్రభాస్‌ని యాక్సెప్ట్ చేస్తారా?
ప్రభాస్ ప్రస్తుతం తెలుగు, హిందీలో పాన్ ఇండియా చిత్రం `ఆదిపురుష్` చిత్రంలో నటిస్తున్నారు. పౌరాణిక కథ `రామాయణం` ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో రాముడిగా ప్రభాస్ నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
ప్రభాస్ రాముడిగా నటించడంపై సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఆ పాత్రలో నటించగలడా? అని సందేహం వ్యక్తం చేస్తూ సోషల్ సినిమాలు చేసిన వాళ్లు రాముడి పాత్ర చేయలేరని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్(సీనియర్) విషయాన్ని గుర్తు చేశారు. బీకే ఈశ్వర్.
ఎన్టీఆర్ `మాయాబజార్`కి ముందు రెండు సినిమాల్లో కృష్ణుడి వేషం వేస్తే ఆడియెన్స్ స్వీకరించలేదని, వాటిని జనం చూడలేదని చెప్పారు. దీంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా పేరొందిన ఎన్టీఆరే బాధపడ్డారని తెలిపారు.
`ఎన్టీఆర్ `ఇద్దరు పెళ్లాలు`,`సొంత ఊరు` అనే రెండు సినిమాల్లో కృష్ణుడిగా కనిపిస్తే థియేటర్లో ఆడియెన్స్ గోల పెట్టారు. డ్రీమ్ సీన్స్ లో ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించారు. కానీ జనం అంగీకరించలేకపోయారు. దీంతో ఎన్టీఆర్ చాలా బాధపడ్డారు. నేను కృష్ణుడిగా పనికిరానా? అంటూ ఆవేదన చెందార`ని చెప్పారు. ఆ సమయంలో దర్శకుడు కేవీ రెడ్డి `మీరు కృష్ణుడిగా రాణిస్తారని రుజువు చేస్తామ`ని చెప్పి గొప్పగా మేకప్ సెట్ చేశారట. నగలు వేసి లుక్ ఛేంజ్ చేసి ఎన్టీఆర్‌లో నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి చాలా కసరత్తులు చేసి `మాయా బజార్` తీశారని చెప్పారు.
ఆ సినిమా ఎంత గొప్పగా ఆడిందో చెబుతూ, అప్పటి నుంచి కృష్ణుడు పేరు చెబితే ఎన్టీఆరే గుర్తొచ్చేలా చేశారని తెలిపారు. ఇప్పటికీ రాముడిగా, కృష్ణుడిగా చాలా మంది తెలుగు ఆడియెన్స్ ఎన్టీఆర్‌నే ఊహించుకుంటారని చెప్పొచ్చు. అలా ఆ పాత్ర కోసం చేయాల్సి వచ్చిందట.
అదే సమయంలో రాముడుగా చేయడమంటే అంత ఈజీ కాదన్నారు. బాడీ లాంగ్వేజ్ పరంగా ప్రభాస్ బాగానే సూట్ అవుతాడని, కానీ డైలాగ్ డెలివరీ, డిక్షన్, హవాభావాలు పలికించడం సాధ్యమేనా? అన్నది ప్రశ్నార్థకమన్నారు. సోషల్ సినిమాలు చేసిన వాళ్లు పౌరాణికాలు చేయడం, ముఖ్యంగా రాముడి పాత్ర చేయడం కష్టమన్నారు. ఒకవేళ చేస్తే అభాసుపాలు కావడమే అని స్పష్టం చేశారు. ప్రభాస్ ఎలా చేస్తాడో చూడాలన్నారు.
దీంతో ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న `ఆదిపురుష్`పై అనేక సందేహాలు కలుగుతున్నాయి. ప్రభాస్ `బాహుబలి`లో బాహుబలి పాత్రలో మెప్పించారు. కాకపోతే అది పూర్తి భిన్నమైన పాత్ర. కాస్త అగ్రెసివ్‌గాను, మరికాస్త రెగ్యూలర్ ఫ్లోగా సాగుతుంది. కానీ రాముడి పాత్ర పూర్తిగా సెటిల్డ్ గా ఉంటుంది. చాలా నెమ్మదిగా డైలాగులు చెప్పడం, స్పష్టంగా పలికించడం, హవాభావాలు సైతం సెటిల్డ్ పలికించాల్సి ఉంటుంది.
మరి ఆ పాత్రకి ప్రభాస్ న్యాయం చేస్తాడా? లేదా? అనే కొత్త డౌట్ ఇప్పుడు సర్వత్రా క్రియేట్ అవుతుంది. ప్రభాస్ ఏ మేరకు న్యాయం చేస్తాడనేది చూడాలి. `మాయా బజార్`కి ముందు ఎన్టీఆర్‌కి ఎదురైన అనుభవమే ప్రభాస్‌కి ఎదురవుతుందా? ఒకవేళ అదే జరిగితే ప్రభాస్ కెరీర్‌కి పెద్ద దెబ్బే అవుతుంది. అంతేకాదు వందల కోట్లు పెట్టి తీసే సినిమా పరాజయం చెందితే నిర్మాతలు కోలుకోవడం కష్టం. అదే సమయంలో ప్రభాస్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. మరి దాన్ని `సాహో` స్టార్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి.