NMBK Review: కిరణ్ అబ్బవరం `నేను మీకు బాగా కావాల్సినవాడిని` రివ్యూ
`రాజావారు రాణిగారు`, `ఎస్. ఆర్ కళ్యాణమండపం` చిత్రాలతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం, వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే `సెబాస్టియన్`, `సమ్మతమే` చిత్రాలతో అలరించారు. ఇప్పుడు మూడో సినిమా `నేను మీకు బాగా కావాల్సినవాడిని` చిత్రంతో రాబోతున్నారు. నేడు ఈ చిత్రం విడుదలైంది. సినిమా ఎలా ఉంది అనేది రివ్యూ(Nenu Meeku Baaga Kavalsina vaadini Review)లో తెలుసుకుందాం.
`రాజావారు రాణిగారు`, `ఎస్. ఆర్ కళ్యాణమండపం` చిత్రాలతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం, వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే `సెబాస్టియన్`, `సమ్మతమే` చిత్రాలతో అలరించారు. ఇప్పుడు మూడో సినిమా `నేను మీకు బాగా కావాల్సినవాడిని` చిత్రంతో రాబోతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి శ్రీధర్ గాదె దర్శకత్వం వహించగా, దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య నిర్మించారు. నేడు శుక్రవారం(సెప్టెంబర్ 16)న ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది, రెండు డిజప్పాయింట్ల తర్వాత ఈ సినిమాతోనైనా కిరణ్ అబ్బవరం సక్సెస్ కొట్టాడా ? అనేది రివ్యూ(Nenu Meeku Baaga Kavalsina vaadini Review)లో తెలుసుకుందాం.
కథః
వివేక్(కిరణ్ అబ్బవరం) కార్ డ్రైవర్. తాగేసి ఉన్న అమ్మాయి తేజు(సంజన ఆనంద్)ని పికప్ చేసుకోవడానికి వస్తాడు. దుండగుల నుంచి ఆమెని సేవ్ చేసి రూమ్‌లో డ్రాప్ చేస్తాడు. ఈ జర్నీలో ఆమె ఎందుకు అలా తాగిందనేది అడగ్గా, ప్రేమించిన వాడు చేసిన మోసం గురించి చెబుతుంది. ప్రేమించి వాడి కోసం పెళ్లి పీఠల్లోనుంచి పారిపోయి వస్తే అతను నడి రోడ్డుపై వదిలేశాడనే విషయాన్ని చెబుతుంది. దీంతో ఆమెకి ఫిదా అవుతాడు వివేక్. ఆ తర్వాత వివేక్ కూడా తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెబుతాడు. దీంతో ఆయనకు ఇంప్రెస్ అవుతుంది తేజు. వివేక్ చెప్పే మాటలకు తన ప్రేమని మర్చిపోయి మళ్లీ మామూలు అమ్మాయి అవుతుంది. అంతేకాదు మళ్లీ ఆమెని తన కుటుంబానికి దగ్గరయ్యే సలహాలిస్తాడు. అందులో తనవంతు క్యాబ్ సహాయం చేస్తాడు. ఈ క్రమంలో వివేక్ ప్రేమలో పడుతుంది తేజు. కానీ అంతలోనే మరో ట్విస్ట్. మరి ఆ ట్విస్ట్ ఏంటీ? ఇంతకి వివేక్ ఎవరు? తేజూ బాయ్ ఫ్రెండ్ ఎందుకు మోసం చేశాడు?, తేజూకి, వాళ్ల నాన్నకి, ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఎలాంటిది? చివరగా తేజులో వచ్చిన రియలైజేషన్ ఏంటీ? వివేక్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఏంటనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
ప్రస్తుత సినిమాల్లో చాలా మార్పులొస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలో చాలా ఛేంజెస్ కనిపిస్తున్నాయి. కాన్సెప్ట్ ఉన్న చిత్రాలు, బలమైన కథలున్న మూవీస్, ముఖ్యంగా యాక్షన్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఇవి కాదని, రెగ్యూలర్ లవ్, కమర్షియల్, మాస్ మసాలా సినిమాలంటే ఆడియెన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో కొన్ని సినిమాలు దారుణంగా పరాజయం చెందితే, బలమైన కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు ఊహించని విజయాలు అందుకుంటున్నాయి. ఇలాంటి టైమ్‌లో కూడా రెగ్యూలర్ కమర్షియల్ సినిమా చేస్తే అది సాహసమే అని చెప్పాలి. `రాజా వారు రాణిగారు`, `ఎస్ ఆర్ కళ్యాణమండపం` విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపుని క్రియేట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు `నేను మీకు బాగా కావాల్సినవాడిని` చిత్రంతో అలాంటి సాహసమే చేశాడు. రొటీన్ వైపే అడుగులు వేశారు. కావాలని ఆయన ఇలాంటి మాస్, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా చేయడం గమనార్హం.
తండ్రి కూతురు సెంటిమెంట్‌కి ప్రేమని జోడించి, ప్రేమలోని లోపాలను, కొత్త సీసాలో పాత సారాలా తయారు చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రియుడి కోసం ఇష్టం లేని పెళ్లిని వదులుకుని పెళ్లి పీఠల్లోనుంచి వెళ్లిపోవడం, చివరికి తను చేసుకోబోయేవాడే ప్రేమికుడు కావడం అనే కాన్పెస్ట్ `శశిరేఖ పరిణయం` లాంటి చిత్రాల్లో చూసిందే. ఈ చిత్రం కథ కూడా దానికి దగ్గరగానే ఉంటుంది. ఇక తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ రొటీన్‌గానే అనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూడటంతో వారి ప్రేమలు, హవభావాలు అవన్నీ బోర్ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. ఆ తర్వాత ప్రియుడు మోసం చేశాడనేది రెగ్యూలరే అయినా ఆ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. కాకపోతే ఫస్టాఫ్‌లో ఓ కథని, సెకండాఫ్‌లో మరో కథని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మొదటి భాగంలో కిరణ్ కంటే మరో నటుడే ఎక్కువగా కనిపించడంతో హీరో ఎవరనే డౌట్ కూడా వస్తుంటుంది. సినిమా అసాంతం స్లోగా సాగుతుంది. కథ, కథనం ఎటు సాగుతుందో అర్థం కాదు. చాలా సందర్భాల్లో అంతా అయోమయంగా అనిపిస్తుంటుంది.
సినిమాల్లో ప్రధానంగా ఏ ఎమోషన్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేదు. సహజత్వం మిస్ అయ్యింది. సినిమా ప్రారంభంలోనే ఓ ఐటెమ్ సాంగ్ పెట్టడం విచిత్రంగా అనిపిస్తుంది. గెటప్‌శ్రీను, బాబా భాస్కర్ మాస్టర్ కామెడీ సన్నివేశాలు ఉన్నంతలో కాస్త రిలీఫ్‌గా, అదే సమయంలో ఓవర్‌గానూ అనిపిస్తుంటాయి. ఇక హీరోయిన్‌కి హీరో చెప్పే డైలాగ్‌లు, ఇతరులతో చెప్పే మాటల్లో మీనింగ్ బాగుంది. అమ్మాయి మోసం చేస్తే ప్రేమించిన వాడు ఎంత బాధని అనుభవిస్తాడో, ప్రేమించి వాడి కోసం వెళితే, ఫ్యామిలీ ఎంతటి క్షోభని అనుభవిస్తుందో ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం బాగుంది. అదే సమయంలో అమ్మాయి కాస్త లేట్‌గా ఇంటికి వచ్చినా, ఏ చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దగా చూసి నిందించడం సరికాదని, 20 ఏళ్లు పెంచిన పేరెంట్స్ పిల్లలు చేసే చిన్న తప్పులను ఎందుకు యాక్సెప్ట్ చేయరని ప్రశ్నించడం వంటివి ఆకట్టుకునే అంశాలున్నాయి. ఆ విషయంలో కిరణ్ మంచి సందేశాన్ని అంతర్లీనంగా అందించే ప్రయత్నం చేశారు. కానీ బలమైన ఎమోషన్స్ గానీ, బలమైన కథ లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్.
నటీనటులుః
కిరణ్ అబ్బవరం ఎప్పటిలాగే తన పాత్రలో ఒదిగిపోయాడు. తన డైలాగ్ డెలివరీ స్లోగా ఉండటం మైనస్‌గా చెప్పొచ్చు. అయితే మాస్ హీరోగా నిలబడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన ఎలివేషన్ సీన్లు చూస్తుంటే అర్థమవుతుంది. చాలా వరకు సినిమాని తన భుజాలపై మోశాడు. ఇక హీరోయిన్‌గా కొత్త అమ్మాయి సంజన బాగా చేసింది. డెబ్యూ అయినా ఆకట్టుకుంది. మరో హీరోయిన్ సోనూ ఠాగూర్ ఉన్న కాసేపు ఫర్వాలేదనిపించింది ఆమె ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. బాబా భాస్కర్ మాస్టర్ ఓకే అనిపించారు. గెటప్ శ్రీను జబర్దస్త్ స్టయిల్‌లో నవ్వించే ప్రయత్నం చేశాడు. నూకరాజు సీన్ బాగుంది. ప్రియుడిగా సిద్ధార్థ్ మీనన్ ఆకట్టుకున్నాడు. మొదటి భాగంలో కిరణ్‌ని డామినేట్ చేశాడు. మిగిలిన వారిలో ఎస్వీకృష్ణారెడ్డి, భరత్ రొంగలి, సమీర్ ఓకే అనిపించారు.
టెక్నీకల్‌గాః
సినిమా కథే సినిమా మైనస్. అరిగిపోయిన ఫార్ములాతో చేసిన చిత్రమిది. దర్శకుడు గాదే రొటీన్ స్టోరీతో విఫలయత్నం చేశాడు. దీనికి కిరణ్ అబ్బవరం మాటలు, స్క్రీన్‌ప్లే కొంత ప్లస్ అయినా, కంటెంట్‌లో దమ్ములేకపోవడంతో అవి తేలిపోయాయి. సినిమాకి మణిశర్మ సంగీతం ప్లస్. పాటలు బాగున్నాయి. బీజీఎం ఫర్వాలేదు. ఓ స్టార్ హీరో సినిమాకి ఇచ్చినట్టుగా ఇచ్చాడు. రాజ్ కె నల్లి కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారని అర్థమవుతుంది.
ఫైనల్‌గాః కొత్తసీసాలో పాత సార అని చెప్పినా రొటీన్‌గానే ఉంటుంది, కానీ చెప్పక తప్పడం లేదు.
రేటింగ్‌ః 2