నాని 'వి' మూవీ రివ్యూ
ఇప్పటి వరకు ఏ పెద్ద తెలుగు సినిమా కూడా ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ కాలేదు. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఫస్ట్ క్రేజీ తెలుగు మూవీ 'V'. ఈ సినిమాకు వ్యూయర్ షిప్ ఎలా ఉండబోతోందని ఇండస్ట్రీలోనే కాకుండా సినిమా అభిమానుల్లోనూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంటే మరికొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టే అవకాశాలు ఉండటంతో మేకర్స్ అందరూ 'వి' రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో నాని కొత్త సినిమా చూసి చాలా కాలం అయిన అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దానికి తోడు నాని డిఫరెంట్ గా ఉంటూ వదిలిన ప్రోమోలు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఎలా ఉంది..కథేంటి...అంచనాలను అందుకుందా..రివ్యూలో చూద్దాం...
కథేంటి:
నీతి, నిజాయితీ,సాహసానికి మారు పేరుగా డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) పేరు మీడియాలో మారు మ్రోగుతుంది. ఎలాంటి రిస్క్ ఉన్న కేసుని అయినా డీల్ చేసి,గెలవటంతో అతనికు డిపార్టమెంట్ ఎన్నో మెడల్స్ తో గౌరవిస్తుంది. ఆదిత్య సూపర్ కాప్ గా ఎదగటం.... డిపార్టమెంట్ లోని కొందరు సీనియర్ అధికారలకు అసూయ పుట్టిస్తుంది. సరైన కేసు తగలకే ఆదిత్య ఇలా రెచ్చిపోతున్నాడని వారి వాదన.
అలాంటి సమయంలో లంగర్ హౌస్ ఎస్సై వేద ప్రసాద్ తన ఇంట్లోనే చాలా క్రూరంగా, దారుణంగా హత్యకు గురి అవుతాడు. ఆ కిల్లర్.. హత్య చేయడమే కాదు.. వీలైతే నన్ను పట్టుకో అంటూ డీసీపీ ఆదిత్యకు ఛాలెంజ్ విసురుతాడు. అక్కడ నుంచి ఆదిత్య రంగంలోకి దూకి, క్లూ లు సేకరించటం మెదలెడతాడు. వాటి ఆధారంగా కిల్లర్ ని ట్రేస్ చేసేలోగా మరో మర్డర్ జరుగుతంది.
ఈ సారి.. సిటీలోని ప్రముఖ బిల్డర్ మల్లిఖార్జున్(మధుసూదన్)ను మర్డర్ అవుతాడు. అంతేకాదు.. ఆ కిల్లర్ ... డైరెక్ట్‌గా ఆదిత్యకు ఫోన్ చేసిన కిల్లర్ పొడుపు కథలాంటి ఓ క్లూ కూడా ఇస్తాడు. ఆదిత్య తన ఇన్విస్టిగేషన్ మరింత స్పీడు పెంచుతాడు. ఆ పొడుపు కథను ఛేదించి ముంబై వెళతాడు ఆదిత్య.
ఆదిత్య అక్కడకి చేరుకునేలోపు ముంబైలో కె.కె అనే ఓ డాన్ ని దారుణంగా చంపేస్తాడు. కిల్లర్ ను పట్టుకుందామని విశ్వ ప్రయత్నం చేసినా తృటిలో తప్పించుకుంటాడు. దాంతో డిపార్టమెంట్ నుంచి ఆదిత్యకు ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ఆ కిల్లరే తన గురించి అతి కీలకమైన క్లూ ఇస్తాడు. ఆ క్లూ చూసి షాక్ అవుతాడు ఆదిత్య.
ఆ క్లూ ఏమిటి...అసలు ఆ కిల్లర్ హత్యలు చేయటానికి మోటో ఏమిటి...అతనేమన్నా సైకోనా .... అసలు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? చివరకు ఆదిత్య, సదరు కిల్లర్‌ను పట్టుకోగలిగాడా? ఆదిత్యకే ఎందుకు ఛాలెంజ్ లు వదులుతున్నాడు... ఈ కథలో అపూర్వ రామానుజం(నివేదా థామస్) పాత్ర ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎలా ఉంది..
రిలీజ్ కు ముందు నుంచి ఈ సినిమా ద్వారా రెండు ఎలిమెంట్స్ సస్పెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు దర్శకుడు. దానిలో మొదటిది ఈ సినిమా టైటిల్. అసలు ‘వి’ వెనుక సీక్రెట్ ఏంటన్నది, మరొకటి నాని హీరోనా, విలనా ...హీరో అయితే.. విలన్ పాత్రలో ఎవరు నటించారన్నది పూర్తి సస్పెన్స్ పెట్టారు. అయితే సినిమా ప్రారంభమైన తర్వాత ఈ రెండు అంశాలనుంచి మన దృష్టి ప్రక్కకు వెళ్లిపోతుంది. ఎందుకంటే నాని పరిచయం అయిన కాసేపటికి అతని హత్యల వెనక ఏదో గతం ఉందని అతని పాత్ర హీరోనే అని అర్దమైపోతుంది. దాంతో ఇది ఇద్దరు హీరోల సినిమాలా మారింది. నెగిటివ్ క్యారక్టర్స్ హైలెట్ కాలేదు.
దాంతో సరైన విలనీ ఎస్టాబ్లిష్ కాలేదు. హీరో,విలన్ అనే కాంప్లిక్ట్ లేకుండా పోయింది. ఆ డ్రామా మిస్సైంది. నానిని ఎలాగో సుధీర్ బాబు పట్టుకోలేడు, పట్టుకున్నా అతను మంచి వాడు కాబట్టి ఏమీ జరగదు అని తెలిసిపోవటంతో ఇంట్రస్ట్ తగ్గుతూ వచ్చింది. ఎంతసేపు సుధీర్ బాబు పాత్ర...నాని వెనక పరుగెడుతూ..అతను ఇచ్చిన క్లూస్ లని ఎనలైజ్ చేస్తూ,చివరలో మిస్ చేసుకుంటూ ఆయాసపడటమే సరిపోయింది. దాంతో స్క్రీన్ ప్లే పూర్తి ప్లాట్ గా మారిపోయింది.
ఇక నాని ప్లాష్ బ్యాక్ విషయానికి వస్తే....అతను ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ కథకు ప్రత్యేకంగా కలిసొచ్చిందేమీ లేదు. పరమ రొటీన్ ప్లాష్ బ్యాక్. ఇలాంటివి ఎన్నో సినిమాల్లో చూసిన మనం ఎగ్జైట్ కాము. క్లైమాక్స్ లో ఏదన్నా పెద్ద ట్విస్ట్ ఉంటుందేమో అంటే అదీ చప్పగా తేల్చేసారు. అప్పట్లో వచ్చిన షారూఖ్ ..బాజీగర్ తరహాలో ఒకే హీరోని తీసుకుంటే బాగుండేది. ఇద్దరి హీరోలకు సరపడ కథ కాదు ఇది.
ఏ హీరో ఇరగదీసాడు:
నాని ఎప్పటిలాగే నాచురల్ గా చేసుకుంటూ పోయాడు. సుధీర్ బాబు ..పోలీస్ పాత్రలో బాగున్నాడు. అయితే ఈ మధ్యన వచ్చిన హిట్ లాంటి సినిమాలతో పోలిస్తే అతని నటన తక్కువే. నాని ..దాదాపు హీరో పాత్రే అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా జాగ్రత్తపడ్డారు.
అంచనాలు అందుకుందా:
ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయిందనే చెప్పాలి. ప్రపంచ సినిమాలలో వస్తున్న ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్ ను ఓటీటిలలో చూసేస్తున్న ప్రేక్షకుడుకి ఈ సినిమా అంత కిక్ ఇవ్వదు. ఏదో రొటీన్ డ్రామా చూసినట్లుంది. ముఖ్యంగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ వంటి దర్శకుడు నుంచి ఎక్సపెక్ట్ చేసింది కాదు.
టెక్నికల్ టాక్:
డైరక్టర్ గా ఇంద్రగంటి...సినిమాని చాలా నీటుగా ప్రెజంట్ చేసారు. ఆయన తరహా పంచ్ డైలాగ్స్ తో మైమరిపించారు. ఇక సినిమాలో చెప్పుకోవాల్సింది పి. జి. వింద ఫోటోగ్రఫీ. మామూలు రొటీన్ సీన్స్ ను కూడా కెమెరా వర్క్ తో నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్తే ప్రయత్నం చేసారు. ఇక అమిత్ త్రివేది పాటలు సోసోగా ఉన్నాయి. తమన్ పూర్తిగా సూపర్ హిట్ రాక్షసన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఫాలో అయ్యిపోయాడు. అయితే అందులో ఉన్న టెన్షన్ ఈ సినిమాలో లేకపోవటంతో... నేపథ్య సంగీతం,సీన్స్ మ్యాచ్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
ఫైనల్ థాట్
'రాక్షసన్' లాంటి థ్రిల్లర్స్ చూసేసిన మనకు 'అంతకు మించి' కావాలి.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5/5
ఎవరెవరు:
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి, సీనియర్ నరేశ్, రోహిణి, హరీశ్ ఉత్తమన్, మధుసూదన్ రావు, వెన్నెలకిషోర్ తదితరులు
సంగీతం: అమిత్ త్రివేది
నేపథ్య సంగీతం: ఎస్.ఎస్.తమన్
సౌండ్ డిజైన్: బిశ్వదీప్ చటర్జీ
కెమెరా: పి.జి.విందా
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీశ్, హర్షిత్ రెడ్డి
రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
విడుదల: అమెజాన్ ప్రైమ్