Bimbisara: 'బింబిసార' విజయంతో ఫ్యాన్స్ అత్యుత్సాహం.. మరీ అంత అతి అవసరమా ?
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. కళ్యాణ్ రామ్ కింగ్ బింబిసార అదరగొట్టాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. కళ్యాణ్ రామ్ కింగ్ బింబిసార అదరగొట్టాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.బాక్సాఫీస్ వద్ద నమోదవుతున్న నంబర్స్ బట్టి ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ దిశగా దూసుకుపోతోంది.
రెండు రోజుల్లో బింబిసార చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల షేర్ మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ గా 12 కోట్లకి పైగా షేర్ సాధించింది. ఈ చిత్రానికి జరిగిన ఓవరాల్ బిజినెస్ 16 కోట్లు. దీనితో బింబిసార చిత్రం ఆదివారం రోజు బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
బింబిసార చిత్రంలో కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అందించారు. బడ్జెట్ ఎక్కువైనా సాహసం చేసి నిర్మాతగా కూడా నిరూపించుకున్నారు. అనుమానాల్ని పటాపంచలు చేస్తూ అద్భుతమైన కంటెంట్ తో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని కళ్యాణ్ రామ్ ఈ చిత్రంతో నిరూపించాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో కళ్యాణ్ రామ్ ని తప్పకుండా అభినందించాలి. తన మార్కెట్ పరిధి గురించి ఆలోచించకుండా కథనే నమ్ముకుని అదరగొట్టేశాడు.
కానీ ఇదే అదునుగా కొందరు ఫ్యాన్స్ మెగా క్యాంప్ పై ట్రోలింగ్ తో విరుచుకుపడుతున్నారు. కళ్యాణ్ రామ్ కి ఏకంగా మెగాస్టార్ ట్యాగ్ తగిలిస్తూ.. చిరంజీవిని కించపరిచేలా పోస్ట్ లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ట్రోలింగ్ సగటు ప్రేక్షకులని విడ్డూరంగా అనిపిస్తోంది.
కళ్యాణ్ రామ్ గొప్ప విజయం సాధించాడు. అందులో సందేహం లేదు. అంతమాత్రాన అతడికి మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అంటూ ట్యాగ్ జోడించి చిరంజీవిని ట్రోల్ చేయడం సబబు కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నందమూరి ఫ్యాన్స్ ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని నెటిజన్లు అంటున్నారు.
సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ సహజం.. కానీ అది సమకాలీకులు అయిన నటుల అభిమానుల మధ్య జరుగుతుంటాయి. కానీ నందమూరి ఫ్యాన్స్ కళ్యాణ్ రామ్ ని ఏకంగా మెగాస్టార్ తో పోల్చుతూ.. చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రంతో డిఫెరెంట్ అటెంప్ట్ చేసి సక్సెస్ అయ్యారు. ఇలా విభిన్నమైన చిత్రాలు చేసి విజయం సాధిస్తున్న యువ హీరోలు చాలా మందే ఉన్నారు. వారంతా మెగాస్టార్ లు అయిపోతారా అనేది ప్రశ్న.