విష్ణుపై మనోజ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదు, తల్లి సంచలన లేఖ!
మంచు మనోజ్ కి కన్న తల్లి నిర్మలాదేవి బిగ్ షాక్ ఇచ్చింది. విష్ణు మీద మనోజ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదంటూ పోలీసులకు లేఖ రాసింది.
మంచు మనోజ్ తాజాగా విష్ణుపై ఆరోపణలు చేశాడు. తల్లి నిర్మలాదేవి జన్మదిన వేడుకకు హాజరైన విష్ణు, తన ఇంటి జెనరేటర్ లో పంచదార కలిపిన డీజిల్ పోశాడంటూ ఓ వీడియో ఫుటేజ్ షేర్ చేశాడు. తనను ఇబ్బందులకు గురి చూసేందుకు తన మనుషులతో కుట్రలు చేస్తున్నాడని మనోజ్ ఫిర్యాదు చేశారు.
Manoj Manchu
మనోజ్ ఆరోపణలపై స్పందిస్తూ తల్లి నిర్మలాదేవి ఫహాడీ షరీఫ్ పోలీసులకు లేఖ రాసింది. సదరు లేఖలో విష్ణుపై మనోజ్ చేసిన ఆరోపణలు అవాస్తవం అని స్పష్టత ఇచ్చారు. డిసెంబర్ 14న నా జన్మదినం కావడంతో విష్ణు కేక్ తీసుకుని మనోజ్ ఇంటికి వచ్చాడు. నాతో కేక్ కట్ చేయించి, బర్త్ డే సెలబ్రేట్ చేశాడు.
Manoj Manchu
అనంతరం గదిలో ఉన్న తన వస్తువులు తీసుకుని వెళ్ళిపోయాడు. చిన్న కొడుకు మనోజ్ కి ఇంట్లో ఎంత హక్కు ఉందో.. పెద్ద కుమారుడు విష్ణుకు కూడా అంతే హక్కు ఉంది. ఇంటి జెనరేటర్ లో విష్ణు పంచదార పోశాడంటూ మనోజ్ చేసిన ఆరోపణలు అవాస్తవం. ఇంట్లో పని మనుషులు కూడా తాము ఇక్కడ పని చేయలేమని వెళ్లిపోయారు. విష్ణు ఎలాంటి ఒత్తిడి చేయలేదు. నా బర్త్ డే సెలబ్రేట్ చేసి ఇక్కడ నుండి విష్ణు వెళ్ళిపోయాడు. అంతకు మించి ఏమీ జరగలేదు, అని నిర్మలాదేవి లేఖలో రాసుకొచ్చింది.
నిర్మలాదేవి లేఖ మొత్తంగా మనోజ్ ఇమేజ్ డ్యామేజ్ చేసింది. వారం రోజులుగా జరుగుతున్న హైడ్రామాలో మనోజ్ దే తప్పు. మోహన్ బాబు, విష్ణుల మీద మనోజ్ చేసేవన్నీ తప్పుడు ఆరోపణలే అని ఆమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది. నిర్మలాదేవి పోలీసులకు రాసిన లేఖ వైరల్ అవుతుంది. మరి ఈ లేఖపై మనోజ్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.
మోహన్ బాబు రెండో భార్య నిర్మలాదేవికి మనోజ్ సొంత కొడుకు. మంచు లక్ష్మి, విష్ణు.. మొదటి భార్య సంతానం. మరోవైపు మనోజ్ జనసేన పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబును ఎదుర్కొనేందుకు మనోజ్ రాజకీయంగా బలోపేతం కావాలని ప్రణాళికలు వేస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది.
మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం పరిశీలిస్తే... మోహన్ బాబు ఏకంగా కొడుకు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మనోజ్ సైతం కేసు పెట్టాడు. జుల్ పల్లిలో గల మోహన్ బాబు ఫార్మ్ హౌస్ లో భారీ హైడ్రామా జరిగింది.
పరస్పరం దాడులు చేసుకుంటున్న క్రమంలో మనోజ్ జుల్ పల్లి ఫార్మ్ హౌస్ వద్ద ఒక 30 మంది బౌన్సర్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. మంచు విష్ణు ఒక 40 మందికి బౌన్సర్స్ ని నియమించుకుంటున్నాడు. విదేశాల నుండి హుటాహుటిన విష్ణు వచ్చారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడాడు. మోహన్ బాబు ఇంటి నుండి మనోజ్ ని వెళ్ళగొట్టే ప్రయత్నం జరిగింది. అంతకు ముందు మనోజ్ పహాడీ షరీఫ్ సీఐ గురువారెడ్డిని కలిశాడు. తనతో పాటు మౌనికకు, కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు లో పేర్కొన్నారు. అయితే మోహన్ బాబు, విష్ణు పేర్లు ఆయన ఫిర్యాదులో చేర్చలేదు. పది మంది దుండగులు మా ఇంటిపై దాడి చేశారు. కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి సీసీ టీవీ ఫుటేజ్, హార్డ్ డిస్కులు ఎత్తుకుపోయారు. వారిని నిలువరించే క్రమంలో నాకు గాయాలు అయ్యాయని, మనోజ్ కంప్లైంట్ చేశాడు.