స్టార్ హీరోకి తండ్రిగా చిరంజీవి.. ఫేక్ న్యూస్ అంటూ తేల్చేసిన మెగా టీమ్
మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఇటీవల ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై మెగా టీమ్ స్పందించింది. అదంతా ఫేక్ న్యూస్ అని తేల్చేసింది.

చిరంజీవిపై క్రేజీ రూమర్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో రెండు సినిమాలు లైన్‌లో పెట్టారు. అత్యంత భారీ లైనప్‌తో రాణిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవికి ఉన్న లైనప్ యంగ్ హీరోలకు కూడా లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక్క ప్రభాస్ మినహాయిస్తే. అయితే ఈ క్రమంలో చిరుకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఇండస్ట్రీలోనే చాలా క్రేజీగా మారింది.ఈ నేపథ్యంలో తాజాగా మెగా టీమ్ స్పందించింది. ఫేక్ న్యూస్ అంటూ తేల్చింది.
ఫేక్ వార్తగా తేల్చేసిన మెగా టీమ్
ఇటీవల చిరంజీవి ఓ మూవీలో భాగం కాబోతున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనిపై మెగా టీమ్ స్పందించింది. అవన్నీ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. చిరంజీవి రాబోతున్న ఒక సినిమాలో భాగం కాబోతున్నట్టు కొన్ని ఫన్నీ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్, మెగా సన్నిహితులు ఎవరూ దీన్ని నమ్మకూడదు. చిరంజీవికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ వివరాలైనా అధికారిక మాధ్యమాల ద్వారానే వెల్లడిస్తారు. కాబట్టి ఈ రూమర్లని నమ్మవద్దు. అవన్నీ ఫేక్ న్యూస్‌లు, టైమ్ పాస్ వార్తలు మాత్రమే అని వెల్లడించారు.
ప్రభాస్‌కి తండ్రిగా చిరు అనేదే ఫేక్ న్యూస్?
మరి చిరంజీవికి సంబంధించిన ఈ ఫేక్ వార్త ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల చిరంజీవి.. ప్రభాస్ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వ్యాపించాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ `స్పిరిట్` మూవీ చేయనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి తండ్రి పాత్రలో చిరంజీవి కనిపిస్తారని, ఆయనది గెస్ట్ రోల్ అంటూ ఓ వార్త బాగా వైరల్ అయ్యింది. ఈ మూవీకి చిరు ఓకే చెప్పారని, భారీ స్థాయిలో దీన్ని ప్లాన్ చేసినట్టు వార్తలు వినిపించాయి. త్వరలోనే ఈ మూవీ స్టార్ట్ కానుందని అన్నారు. అయితే దీనికి సంబంధించినే మెగా టీమ్ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ తండ్రిగా చిరంజీవి నటించడం లేదనే విషయాన్ని మెగా టీమ్ స్పష్టం చేసినట్టుగా సమాచారం.
`మన శంకరవరప్రసాద్ గారు` కొత్త షెడ్యూల్ ప్రారంభం
ఇక ప్రస్తుతం చిరంజీవి.. `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది సోషియో ఫాంటసీగా రూపొందుతుంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వీఎఫ్ఎక్స్ కారణంగా డిలే అవుతుంది. దీంతోపాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో `మన శంకరవరప్రసాద్ గారు` మూవీ చేస్తున్నారు. ఇది ఆద్యంతం ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. ఇందులో వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నారు అనిల్ రావిపూడి. ఈ మూవీ కొత్త షెడ్యూల్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 19 వరకు ఈ షెడ్యూల్ జరగబోతుందట. ఇందులో రెండు పాటలు చిత్రీకరించనున్నారట. ఇవి కొత్త రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని, 2026 సంక్రాంతికి ఈ మూవీతో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్నట్టు టీమ్ వెల్లడించింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.