`మార్కో` మూవీ తెలుగు రివ్యూ
ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన `మార్కో` చిత్రం మలయాళం, తమిళంలో దుమ్మురేపుతుంది. మరి అదే రేంజ్‌లో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
మలయాళ సినిమాలు అడపాదడపా తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. ఈ ఏడాది `మంజుమేల్ బాయ్స్`, `ప్రేమలు` చిత్రాలు విశేషంగా ఆదరణ పొందాయి. తెలుగు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ క్రమంలో మలయాళం నుంచి వచ్చిన మరో సంచలన మూవీ `మార్కో`. ఇది ఇప్పటికే మలయాళంలో, తమిళంలో విడుదలై విజయవంతంగా రన్ అవుతుంది. మోస్ట్ వాయిలెంట్ ఫిల్మ్ గా అంతా చెబుతున్నారు. ఉన్ని ముకుందన్ హీరోగా నటించగా, షరీష్ మహ్మద్ నిర్మాణంలో హనీఫ్ అదేనీ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో యుక్తి తరేజా, కబీర్ సింగ్, సిద్ధిఖ్, జగదీష్, ఇషాన్ ముఖ్య పాత్రలు పోషించారు. డిసెంబర్ 20న మలయాళంలో విడుదలై పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో కొత్త సంవత్సరం సందర్భంగా రేపు (జనవరి 1)న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
జార్జ్(సిద్ధిఖీ) గోల్డ్ డీలర్. బ్లాక్ మార్కెట్‌ని శాషిస్తుంటాడు. తనతోపాటు కొంతమందిని డీలర్లని కలుపుకుని సిండికేట్‌గా ఏర్పడతారు. భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంటుంది. జార్జ్ కొడుకు విక్టర్(ఇషాన్ షౌకాత్)కి కళ్లుండవు, కానీ తన ఫ్రెండ్ మార్కో ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తుంటారు. మార్కో(ఉన్ని ముకుందన్) జార్జ్ పెంచుకున్న పెంపుడు కొడుకు. మోస్ట్ డేంజరస్. తనని పెంచిన జార్జ్ అన్నా, వారి ఫ్యామిలీ అన్నా ఎంతో ప్రేమ, సొంత కుటుంబం కంటే ఎక్కువగా భావిస్తుంటాడు. విక్టర్‌ని ప్రత్యర్థులు చంపేస్తారు.
తన ఫ్రెండ్ హత్య కేసులో విక్టర్ సాక్షిగా ఉంటాడు. అందుకే అతన్ని చంపేస్తాడు. విక్టర్ మరణంతో జార్జ్ ఫ్యామిలీ చాలా కుంగిపోతుంది. అతని మరణానికి కారకులను వెతికి చంపేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ బాధ్యత మార్కో తీసుకుంటాడు. విక్టర్ మరణానికి కారకులను వెతికే క్రమంలో షాకిచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ సంఘటనలేంటి? విక్టర్ మరణానికి సిండికేట్ వ్యక్తులకు ఉన్న సంబంధమేంటి. మార్కో ప్రతికారం తీర్చుకున్నాడా? జార్జ్ ఫ్యామిలీలో చోటు చేసుకున్న విషాదం ఏంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
ఇండియన్ సినిమాల్లో యాక్షన్ మూవీస్ జోరు నడుస్తుంది. బోల్డ్ మూవీస్ కూడా ఆదరణ పొందుతున్నాయి. కానీ ఇండియన్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే అంశాలు ఫ్యామిలీ, ఎమోషన్స్, డ్రామా. హ్యూమన్ రిలేషన్స్, పగ ప్రతీకారం అనేది మన ఆడియెన్స్ ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడే మెయిన్ యూఎస్‌పీ. ఎలాంటి సినిమా చేసినా దానిపైనే సాహసం చేయాల్సిందే.
తాజాగా వచ్చిన `మార్కో` అనే సినిమా కూడా ఆ కోవకు చెందిందే. కానీ వాయిలెన్స్ లో ఇది ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన అన్ని రకాల యాక్షన్ మూవీస్‌కి మొగుడు లాంటిదని చెప్పొచ్చు. హింసలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. ఈ సినిమా మొత్తం అదే. ఫ్యామిలీ డ్రామా, గోల్డ్ సిండికేట్‌లో కుట్రలు, కుతంత్రాల నేపథ్యంలో సాగే యాక్షన్ ఫిల్మ్. మెయిన్‌గా విక్టర్ హత్యకి ప్రతీకారంగా సాగుతుంది.
విక్టర్‌ని చంపిన వారిని కనిపెట్టి చంపాలనేది జార్జ్, మార్కో ప్రయత్నిస్తుంటారు? వీరినే వేసేయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఇద్దరిలో ఎవరు చనిపోయారు. ఎవరు చంపారనేది క్లైమాక్స్. ఇండియాలోనే వచ్చిన అత్యంత వాయిలెన్స్ ఫిల్మ్ ఇదే అని చెప్పొచ్చు. చంపడం, రక్తపాతం లేకుండా సీన్లు లేవంటే అతిశయోక్తి లేదు.
అయితే చాలా స్టయిలీష్‌గా సినిమాని రూపొందించడం విశేషం. మాఫియా, గ్యాంగ్ స్టర్స్ మూవీస్ ఎలా అయితే స్టయిలీష్‌గా ఉంటాయో, దీన్ని ఆ కోవలో ది బెస్ట్ గా తీశారు. హాలీవుడ్ స్టయిల్ మేకింగ్ కనిపిస్తుంది. కొన్ని యాక్షన్ సీన్లలో `యానిమల్` స్టయిల్ కనిపిస్తుంది. మరో ఫైట్‌లో `పుష్ప 2` స్టయిల్ కనిపిస్తుంది.
ఫస్టాఫ్‌లో గోల్డ్ వ్యాపారం, జార్జ్ ఫ్యామిలీ డ్రామా ప్రధానంగా నడుస్తుంది. విక్టర్ హత్యకు దారితీసిన అంశాలు, అతన్ని చంపిన వారిని వెతికే పనిలో మార్కో ఉండటం చూపించారు. ఈ క్రమంలో కొన్ని యాక్షన్ సీన్లు, మరికొంత ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. అక్కడక్కడ యాక్షన్ బాగున్నా, ఫ్యామిలీ ఎలిమెంట్లు, డిస్కషన్ కొంత ల్యాగ్ అనిపిస్తుంది. స్లోగా రన్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది.
అదే సమయంలో కొంత కన్‌ఫ్యూజ్ చేసే పాత్రలు కూడా ఉంటాయి. వాళ్లెవరు? ఎందుకు ఎందుకు వస్తున్నారనేది మిస్టరీగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ లో యాక్షన్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఆ తర్వాత సెకండాఫ్ వేగంగా సాగుతుంది. హింస, యాక్షన్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఇలాంటి హింసని చూడలేదనేలా ఆయా యాక్షన్ ఎపిసోడ్లని ప్లాన్ చేశారు.
ఇక క్లైమాక్స్ కి ముందు సీన్లు, ప్రత్యర్థులను చంపే సీన్లు చాలా క్రూరంగా ఉంటాయి. సెకండాఫ్ రేసీగానే ఉంటుంది. బ్యాక్ టూ బ్యాక్ వచ్చే యాక్షన్ సీన్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. హీరో ఇంట్లో రక్తపాతాన్ని మాటల్లో వర్ణించలేం. చిన్న పిల్లల నుంచి, పెద్ద వాళ్లని, ఫ్యామిలీని అత్యంత దారుణంగా చంపే సన్నివేశాలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా ఉండవు, వాటిని చూడటానికి కూడా చాలా ధైర్యం కావాలి.
అత్యంత జుగుప్సాకరంగా ఉంటుంది. మరోవైపు క్లైమాక్స్ కూడా అదే స్థాయిలో ప్లాన్ చేశారు. సినిమాని క్లైమాక్స్ వరకు బాగా డీల్ చేశారు. కానీ హీరో ఇంట్లో రక్తపాతం అనేది, అక్కడ హింసాత్మక సన్నివేశాలు ట్రాక్ తప్పాయి. లక్ష్యం లేకుండా సాగుతాయి. హింసకి ఎలాంటి హద్దులు లేవని చూపిస్తుంది. సినిమాని చివరి వరకు ఒకలా తీసుకొచ్చి, చివర్లో కొత్తగా ఏదైనా చేయాలని వింతగా చేసినట్టుగా ఉంది.
సినిమా కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. లాజిక్ లెస్ సీన్లతో చిరాకు తెప్పించారు. అంతిమంగా సినిమాని పట్టాలు తప్పేలా చేశారు. సినిమాగా పక్కన పెడితే వాయిలెన్స్ విషయంలో, కొన్ని సీన్ల పరంగా ఇది సమాజాన్ని తపుదోవ పట్టించే చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలుస్తుంది.
నటీనటులు
`భాగమతి`, `యశోద`, `జనతా గ్యారేజ్` చిత్రాలతో ఉన్నిముకుందన్ తెలుగు ఆడియెన్స్ కి పరిచయం. ఇప్పుడు `మార్కో` సినిమాలో టైటిల్ రోల్‌లో ఆయన నటన అదరగొడుతుంది. ఆయన మోస్ట్ స్టయిలీష్ లుక్‌లో, మోస్ట్ వాయిలెంట్ రోల్‌లో అంతే అద్భుతంగా నటించాడు. మాస్ లవర్స్ కి ఫీస్ట్ ఇచ్చాడు. తనలోని మరో యాంగిల్‌ని చూపించారు. స్టయిలీష్ యాక్షన్‌తో మెప్పించాడు. ఒక రకంగా విశ్వరూపం చూపించాడు. జార్జ్ పాత్రలో సిద్ధిఖీ నటన కూడా అంతే బాగుంది. హుందాగా ఉంటుంది. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. రియల్ గ్యాంగ్ స్టర్స్ ని తలపించేలా ఆయా పాత్రలు ఉండటం విశేషం.
టెక్నీకల్‌గాః
`మార్కో` సినిమా టెక్నీకల్‌గా చాలా బ్రిలియంట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కెమెరా వర్క్ గానీ, విజువల్స్ గానీ, సౌండింగ్‌గానీ, మ్యూజిక్, ఆర్‌ఆర్‌గానీ, ఎడిటింగ్ గానీ చాలా బాగుంది. రెగ్యూలర్ స్టాండర్డ్స్ ని మించి ఉంటుంది. చాలా క్వాలిటీగా ఉంటుంది. టెక్నీకల్‌గా టీమ్ పడ్డ కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. సినిమాని మోస్ట్ స్టయిలీష్ యాక్షన్ ఫిల్మ్ గా మార్చడంలో వారి కష్టం కనిపిస్తుంది. కెమెరా వర్క్, బీజీఎం సినిమాకి మెయిన్ అసెట్స్.
ఇక దర్శకుడు టేకింగ్, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కానీ క్లైమాక్స్ లో ఆయన చేసిన మిస్టేక్, లక్ష్యం లేని విధంగా వ్యవహరించిన తీరు సినిమాకి పెద్ద మైనస్. సినిమాని చివరి వరకు అద్భుతంగా చేసినా చివర్లో కిచిడి చేసి వదిలేసినట్టుగా మారిపోయింది. కొన్ని లాజికల్‌గా, మరికొన్ని టెక్నికల్‌గా, ఇంకొన్ని ఎమోషనల్‌గా చేసిన మిస్టేక్స్ సినిమాకి పెద్ద మైనస్‌గా మార్చాయి. ఈ మూవీ ఇప్పటికే విడుదలై ఇతర భాషల్లో విశేష ఆదరణ పొందుతున్నా, తెలుగు ఆడియెన్స్ మాత్రం అంత ఈజీగా దీన్ని తీసుకోలేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఫైనల్‌గాః క్రైమ్, యాక్షన్‌ని ఇష్టపడే వారిని ఆకట్టుకున్నా.. ఇదొక లక్ష్యం లేని మూవీ, సమాజానికి అత్యంత ప్రమాదకరమైన మూవీ.