- Home
- Entertainment
- చంద్రబాబుతో భేటీ తర్వాత మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అయిందా..?
చంద్రబాబుతో భేటీ తర్వాత మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అయిందా..?
ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా? అనేది గత కొంతకాలంగా సాగుతున్న చర్చ. అయితే తాజాగా చంద్రబాబుతో మంచు మనోజ్-భూమా మౌనిక దంపతులు భేటీ కావడంతో.. ఈ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా? అనేది గత కొంతకాలంగా సాగుతున్న చర్చ. అయితే తాజాగా చంద్రబాబుతో మంచు మనోజ్-భూమా మౌనిక దంపతులు భేటీ కావడంతో.. ఈ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మంచు మనోజ్ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి సతీ సమేతంగా వచ్చారు. దాదాపు అరగంటకు పైగా చంద్రబాబాబుతో వారు భేటీ అయ్యారు. కుటుంబ వ్యవహారాలు, రాజకీయ అంశాలపై చంద్రబాబుతో మనోజ్ దంపతులు చర్చించినట్లు సమాచారం. అయితే ఈ భేటీలో ప్రధానంగా ఏం చర్చించారనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న తర్వాతే ఇలా చంద్రబాబుతో భేటీ అయ్యారనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది.
అయితే చంద్రబాబుతో భేటీ తర్వాత మనోజ్ చెప్పినమాటలు చూస్తుంటే.. ఆయన పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకుంటున్నట్టుగానే కనిపిస్తుంది. ఈ భేటీ అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లైనా తర్వాత తొలిసారి చంద్రబాబును కలిసేందుకు వచ్చామని.. రేపు తమ బాబు బర్త్ డే సందర్భంగా ఆశీస్సులు తీసుకున్నామని చెప్పారు. రాజకీయాల్లోకి ప్రవేశంపై మంచి సందర్భం వచ్చినప్పుడు మౌనికనే చెబుతుందని కామెంట్ చేశారు.
‘‘చంద్రబాబు మా కుటుంబానికి ఎంతో సన్నిహితులు. ఎంతో ప్రేమ, అభిమానం ఉంటుంది. మేమంటే ఎంతో అభిమానం. పెళ్లి తర్వత మేమిద్దరం చంద్రబాబును కలవాలని చాలా సందర్భాల్లో అనుకున్నాం. కానీ కుదరలేదు. ఆయన బిజీగా ఉండటం వల్ల సాధ్యపడలేదు. ఈరోజు ఫోన్ చేసి రమ్మన్నారు.. మర్యాదపూర్వకంగా మా బాబుతో కలిసి వెళ్లి కలిశాం. రేపు(ఆగస్టు 1) మా అబ్బాయి పుట్టినరోజు కావడంతో వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకున్నాం. రాజకీయాల్లోకి ప్రవేశంపై మంచి సందర్భం వచ్చినప్పుడు మౌనికనే చెబుతుంది’’ అని మనోజ్ తెలిపారు.
మరోవైపు మౌనిక మాట్లాడుతూ.. ‘‘ఇద్దరం అంకుల్ ఆశీస్సులు తీసుకోవడానికి బాబుతో కలిసి వచ్చాం. మేము ఏం చేస్తున్నామనేది షేర్ చేసుకున్నాం. ఇది క్యాజువల్ ఫ్యామిలీ మీటింగ్’’ అని పేర్కొన్నారు. అయితే మనోజ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా?.. లేదా తన భార్య భూమా మౌనికను రంగంలోకి దింపుతారా? అనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
అయితే మనోజ్ దంపతులు చెబుతున్న మాటలను చూస్తుంటే.. మనోజ్-మౌనిక దంపతులు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం కోసం రంగం సిద్దం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనోజ్ అన్న విష్ణుకు వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో మంచు ఫ్యామిలీ వైసీపీకి మద్దతుగా నిలిచింది. అయితే గత కొంతకాలంగా మంచు బ్రదర్స్ విష్ణు-మనోజ్‌ల మధ్య విబేధాలు నెలకొన్నాయన్నది బహిరంగ రహస్యమే.
ఇక, మౌనిక ఫ్యామిలీ టీడీపీలో ఉంది. ప్రస్తుతం మౌనిక సోదరి భూమా అఖిలప్రియ, సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. వారి కజిన్ భూమా బ్రహ్మానందరెడ్డి కూడా టీడీపీలోనే ఉన్నారు. అయితే భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత కుటుంబానికి సంబంధించిన రాజకీయ వ్యవహారాల్లో మౌనిక తెరవెనక కీలక భూమిక పోషించారు. ఆళ్లగడ్డలో అఖిల ప్రియ, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపులో కూడా ఆమె పాత్ర కూడా ఉందని చెబుతారు.
ఈ క్రమంలోనే భూమా అభిమానులు కూడా మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆమె కూడా నంద్యాల లేదా ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే మంచు మనోజ్ కొంతకాలంగా రాజకీయాలపై ఆసక్తిని కనబరుస్తున్నారు. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌లతో వేర్వేరుగా మనోజ్ భేటీ అయిన సంగతి తెలిసిందే.
అయితే పెళ్లి తర్వాత మనోజ్-మౌనిక దంపతులు చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. టీడీపీలో ఎంట్రీకి మనోజ్ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటారు..? లేదంటే వేరే పార్టీలో చేరుతారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు మరికొద్ది రోజుల్లోనే సమాధానం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి.