- Home
- Entertainment
- సినిమాలు మానేసిన మహేష్ బాబు హీరోయిన్..బడా కంపెనీకి సీఈవోగా ఉద్యోగం, ఆమె కెరీర్ ఎలా మారిపోయిందో తెలుసా
సినిమాలు మానేసిన మహేష్ బాబు హీరోయిన్..బడా కంపెనీకి సీఈవోగా ఉద్యోగం, ఆమె కెరీర్ ఎలా మారిపోయిందో తెలుసా
మహేష్ బాబుతో నటించిన ఒక క్రేజీ హీరోయిన్ సినిమాలు మానేసి ఇప్పుడు ఒక కంపెనీకి సీఈవో గా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆమె ఎవరు, ఆమె నటించిన సినిమాలు ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

హీరోయిన్లుగా అవకాశాలు అందుకోవడం కోసం నటీమణులు చాలా కష్టపడుతుంటారు. రంగుల ప్రపంచం అయిన సినిమా రంగంలో రాణించేందుకు చాలా కష్టపడుతుంటారు. ఒక్కసారి అవకాశం దక్కించుకుని స్టార్ గా ఎదిగితే ఇక తిరుగు ఉండదు. కొంతమంది నటీనటులు సినిమాలకు గుడ్ బై చెప్పి వేరే రంగాలలో స్థిరపడిన వారు కూడా ఉన్నారు.ఉదాహరణకి తెలుగు హీరోయిన్ లయ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. వివాహం తర్వాత సినిమాలు మానేసి యుఎస్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసింది. నితిన్ తమ్ముడు చిత్రంతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరో క్రేజీ హీరోయిన్ కూడా కార్పొరేట్ రంగంలో టాప్ పొజిషన్ కి చేరుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ హీరోయిన్ పేరు మయూరి కాంగో. తెలుగు సినీ అభిమానులకు ఆమె పేరుతో అంతగా పరిచయం ఉండకపోవచ్చు.
తెలుగులో ఆమె నటించింది ఒక్కే ఒక్క చిత్రం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వంశీ చిత్రంలో మయూరి కాంగో నటించింది. మయూరి కాంగో ప్రస్తుత వయసు 43 ఏళ్ళు. మయూరి కాంగో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జన్మించింది. ఆమె తల్లి నాటక రంగంలో రాణించారు. తండ్రి రాజకీయ నాయకుడు. మయూరి కాంగో అప్పట్లో ఐఐటీ కాన్పూర్ లో సీటు పొందారు. అదే సమయంలో ఆమెకి బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చాయి.
తన తల్లికి ఉన్న పరిచయాల కారణంగా డైరెక్టర్ సయీద్ అక్తర్ దృష్టిలో మయూరి కాంగో పడ్డారు. దీనితో ఆమెకి తొలి చిత్రం నసీం లో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం కోసం మయూరి కాంగో ఐఐటీ కాన్పూర్ లో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత మహేష్ భట్ దర్శకత్వంలో రూపొందిన 'పాపా కహతే హై' అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ యావరేజ్ గా నిలిచినప్పటికీ మయూరి పేరు మాత్రం మారుమోగింది. అందుకు కారణం ఈ చిత్రంలోని 'ఘర్ సి నికల్తీ' అనే సాంగ్ అనే చెప్పాలి.ఆ తర్వాత మయూరికి అజయ్ దేవగన్, సంజయ్ దత్ లాంటి హీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ చిత్రంలో నటించింది. ఈ మూవీ ఫ్లాప్ కావడంతో తెలుగులో ఆమె మరిన్ని ఆఫర్స్ దక్కించుకోలేకపోయింది.
2003లో మయూరి.. ఆదిత్య ధిల్లాన్ అనే ఎన్నారైని వివాహం చేసుకుంది. 2011లో వీరికి కుమారుడు జన్మించాడు. పెళ్లి తర్వాత మయూరి యుఎస్ లో సెటిల్ అయింది. దీనితో సినిమాలకు పూర్తిగా దూరమైంది. పెళ్లి తర్వాత ఆమె సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆ తర్వాత ఆమె ఫ్యామిలీ తిరిగి ఇండియాకి వచ్చి గుర్గావ్ లో సెటిల్ అయ్యారు. తన కొడుకుని పెంచుకుంటూనే పబ్లిసిస్ గ్రూప్ అనే మల్టీ నేషనల్ కంపెనీలో మయూరి ఉద్యోగం పొందారు.
ఆ తర్వాత గూగుల్ ఇండియాలో ఇండస్ట్రీ హెడ్ గా వర్క్ చేశారు. కార్పొరేట్ రంగంలో మంచి అనుభవం పొందాక తిరిగి ఆమె పబ్లిసిస్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు. ఈసారి ఆమెకి ఆ కంపెనీలో గ్లోబల్ డెలివరీ విభాగంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) ఉన్నత పదవి లభించింది. నటన రంగం నుంచి కార్పొరేట్ రంగంలోకి వెళ్లిన మయూరి కాంగో ఇంతటి ఉన్నత స్థాయికి ఎదగడం విశేషం అని చెప్పొచ్చు.