- Home
- Entertainment
- చిరంజీవి సినిమాలో సూపర్ హిట్ సాంగ్.. ఛాలెంజ్ లో గెలిచి ఒక్కో అక్షరానికి రూ.1000 తీసుకున్న లిరిసిస్ట్
చిరంజీవి సినిమాలో సూపర్ హిట్ సాంగ్.. ఛాలెంజ్ లో గెలిచి ఒక్కో అక్షరానికి రూ.1000 తీసుకున్న లిరిసిస్ట్
దాదాపు 39 ఏళ్ళ క్రితం చిరంజీవి నటించిన ఓ చిత్రంలోని పాట కోసం ఒక్కో అక్షరానికి లిరిసిస్ట్ రూ.1000 పారితోషికం తీసుకున్నారు. అది కూడా ఛాలెంజ్ లో గెలుచుకుని. అసలేం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు జరిగాయి . చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ రాక్షసుడు షూటింగ్ సమయంలో మరచిపోలేని సంఘటన ఒకటి జరిగింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రాక్షసుడు చిత్రం 1986లో విడుదలైంది. కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో రాధా, సుహాసిని హీరోయిన్లుగా నటించారు.
లెజెండ్రీ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రాల్లో 5 పాటలని వేటూరి సుందరరామ మూర్తి రాశారు. వేటూరి సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పాట అయినా అలవోకగా రాసేస్తారు. చిరంజీవి చిత్రాలలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి వేటూరి సాహిత్యం అందించారు.
రాక్షసుడు మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు కేఎస్ రామారావు లొకేషన్ లో ఉన్నారు. కో డైరెక్టర్ ఒకరు అరేయ్ బచ్చా అంటూ వర్కర్ పై సీరియస్ అవుతున్నారు. ఆ కో డైరెక్టర్ మాట్లాడే మాటల్లో బచ్చా, వచ్చా ఇలా 'చ్చా' శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది. అది కేఎస్ రామారావుకి బాగా నచ్చిందట. దానినే పాటగా మార్చితే ఎలా ఉంటుంది అని వేటూరిని పిలిపించారు. దర్శకుడితో చర్చించి 'చ్చా' అక్షరం ఎక్కువగా వచ్చేలా పాట రాయమని వేటూరికి చెప్పారు.
ఆ సమయంలో వేటూరి ఒక్కో పాటకి రూ.1000 నుంచి 2000 వరకు పారితోషికం తీసుకుంటారు. ఈ పాటలో ఒక్కో 'చ్చా' అక్షరానికి ఒక్కో 1000 ఇస్తానని వేటూరికి చెప్పారట. ఆ ఛాలెంజ్ ని స్వీకరించిన వేటూరి కేవలం 5 నిమిషాల్లోనే పాటని పూర్తి చేశారు. ఆ పాట మరేదో కాదు 'అచ్చా అచ్చా వచ్చా వచ్చా' అనే పల్లవితో సాగే పాట అది. ఈడు వచ్చాక ఇట్టా వచ్చా.. నువ్వు నచ్చాక నీకే ఇచ్చా అంటూ అందమైన లిరిక్స్ తో ఆ పాటని వేటూరి పూర్తి చేశారు. ఆ పాటలో దాదాపు 50 'చ్చా' అక్షరాలు ఉంటాయి.
దీనితో అంత మొత్తాన్ని వేటూరి.. కేఎస్ రామారావు నుంచి గెలుచుకున్నారు. దటీజ్ వేటూరి అని అనిపించుకున్నారు. ఈ సాంగ్ ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఇక చిరంజీవి, రాధా కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ లో వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది.