'లిటిల్ హార్ట్స్' తొలి రోజు సంచలన కలెక్షన్స్.. చిన్న హీరో దుమ్ములేపాడుగా
మౌలి తనుజ్ ప్రశాంత్, శివాని నగరం నటించిన ‘లిటిల్ హార్ట్స్’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు సాధించింది.

చిన్న బడ్జెట్‌తో రూపొందిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని నమోదు చేసింది. మౌలి తనుజ్ ప్రశాంత్, శివాని నగరం హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మొదటి రోజు అంచనాలను మించి వసూళ్లు సాధించింది.
ప్రచారంలో ప్రత్యేకతను చూపిన ఈ మూవీ యూనిట్ సోషల్ మీడియాలో పెద్ద హంగామా చేసింది. ఎంటర్‌టైనింగ్ మేకింగ్ వీడియోలు, ట్రెండీ ప్రమోషనల్ కంటెంట్, రోస్ట్ ఈవెంట్ వంటివి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ కలిగించాయి. ఈ వ్యూహాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌గా మారాయి.
వివరాల్లోకి వెళితే, ‘లిటిల్ హార్ట్స్’ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.2 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కొత్తవారితో తెరకెక్కిన చిత్రానికి ఇది ఒక సెన్సేషనల్ ఫీట్‌గా చెప్పుకోవాలి. అమెరికాలో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. పరిమిత లొకేషన్లలో మాత్రమే విడుదలైన ఈ మూవీ తొలి రోజే $171K (సుమారు రూ.1.4 కోట్లు) వసూలు చేసింది. అధిక డిమాండ్ కారణంగా రెండో రోజు నుంచి స్క్రీన్ల సంఖ్య పెంచుతున్నారు.
ప్రేక్షకుల టార్గెట్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని, మేకర్స్ పెయిడ్ ప్రీమియర్స్‌తో పాటు విద్యార్థులకు ఉచిత ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. కథ కాలేజ్ స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతుండటంతో ఈ వ్యూహం సూపర్‌గా పని చేసింది.
ఈ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా, నిర్మాతగా #90s ఫేమ్ ఆదిత్య హసన్ పనిచేశారు. రాజీవ్ కనకాల, ఎస్.ఎస్.కాంచి, అనితా చౌదరి, సత్య కృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు. సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందించగా, డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను వంశి నందిపాటి, బన్నీ వాస్ నిర్వర్తించారు.ప్రస్తుతం వచ్చిన మొదటి రోజు కలెక్షన్లతో, ‘లిటిల్ హార్ట్స్’ చిన్న సినిమాగా పెద్ద విజయాన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.