'ఆచార్య' ఈ వార్త ఫ్యాన్స్ కు భారీ షాకే, కానీ తప్పేటట్లు లేదే
చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన సైరా చిత్రం అనుకున్నంత ఊపు ఇవ్వలేదు. భారీ నష్టాలతో ఈ సినిమా కథ ముగిసిందనే వార్తలు సైతం వచ్చాయి. దాంతో తన తదుపరి చిత్రంపై ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారు. వరస హిట్స్ తో దూసుకుపోతున్న కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాని చేస్తున్నారు.. ఇది చిరంజీవికి 153 వ సినిమా. రకరకాల కారణాలతో లేట్ గా మొదలైన ఈ ఆచార్య షూటింగ్ కరోనా ఎఫెక్ట్ పడడంతో మరింత ఆలస్యం అయ్యేపరిస్దితి కనపడుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిరంజీవి దూసుకుపోవాలని భావిస్తున్నారు. దానికి తోడు ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు.
చిత్ర యూనిట్ సినిమా ఫస్ట్ లుక్‌ను శ్రీరామనవి సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల చేయాలని భావిస్తుందట. అక్కడదాకా బాగానే ఉంది కానీ... ఈసినిమా రిలీజ్ ఎప్పుడనేది ఇప్పుడు ఓ పెద్ద ప్రశ్నగా ట్రేడ్ లో మారింది. ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేయాలని మొదట ప్లాన్ చేసారు.
అయితే అనుకోని విధంగా ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. దీనివల్ల సినిమా విడుదల ఏకంగా 2021 సమ్మర్ కు వాయిదా పడే అవకాశం ఉందని మీడియాలో వార్తలు మొదలయ్యాయి.
అలాగే ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం రామ్ చరణ్ ని అనుకుంటున్నారు. మే నెలలో రామ్ చరణ్ తో షూటింగ్ పెట్టేసుకోవాలని భావించారు. అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సైతం వాయిదా పడటంతో రామ్ చరణ్ ని వదలడు రాజమౌళి.
అంటే జులై లేదా ఆగస్టుకి గాని రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ నుండి బయిటకు రాడు. అంటే ఎలా చూసుకున్నా ఆగష్టు 14 విడుదల సాధ్యం కాదు.
పోనీ దసరాకు విడుదల చేద్దామంటే కేజీఎఫ్ 2 ఉంది… సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ వస్తుంది. ఇలా అన్ని సీజన్ లు బుక్ అయ్యిపోయాయి. అన్ సీజన్ లో విడుదల చేస్తే తప్ప ఆచార్య ఈ మధ్యలో విడుదల అయ్యే అవకాశం లేదు.
దీనితో మంచి సీజన్ కోసం చిరంజీవి తన సినిమాని 2021 సమ్మర్ కు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మణి శర్మ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఇప్పటికే మొదలయ్యింది. దాదాపుగా అన్ని ఏరియాలలో అల వైకుంఠపురములో సాధించిన కలెక్షన్స్ రేటుకు సినిమా రైట్స్ ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారట.
కొరటాల శివకు కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా లేకపోవటమే కలిసొచ్చే అంసం. ఆయన ప్రతీ సినిమా ఆ హీరోల కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్లు అయ్యాయి. ఇదొక్కటీ చూపించి ఆచార్య రైట్స్ భారీ రేట్లకు అమ్ముతున్నారట
ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ త్రిషను అనుకోగా ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ఎంపిక చేసింది చిత్రం టీమ్.. చిరంజీవి, కాజల్ గతంలో ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే.
పక్కా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.