#HanuManReview: 'హనుమాన్' రివ్యూ
ప్రశాంత్ వర్మ హిందూ పురాణాల స్ఫూర్తితో 'హను మాన్' తీశారు. ఒరిజినల్ సూపర్ హీరో హనుమంతుడిని స్క్రీన్ మీదకు తీసుకు వచ్చే ప్రయత్నం చేసారు.
HanuMan
సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అంటూ చాలా మంది మ్యాన్ లను అప్పుడప్పుడూ ఉమెన్ లను కూడా చూసేసాం. అయితే వాటిని బ్రేక్ చేస్తూ ఆ మధ్యన హృతిక్ రోషన్ క్రిష్ అంటూ ఓ సీరిస్ తో పలకరించాడు. హిట్ కొట్టాడు. ఆ ప్రేరణో ఏమో కానీ ఇప్పుడు మనకు పురాణం జత వేస్తూ హనుమాన్ ని దింపారు. మరి ఈ హనుమాన్ ఎలా ఉన్నాడు. హనుమంతుడుని ఎలా ఈ సూపర్ హీరో కథకు ముడి వేసారు. సినిమా పిల్లలకు నచ్చేదేనా, నార్త్ టార్గెట్ వర్కవుట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.n
స్టోరీ లైన్
మైఖేల్ (వినయ్ రాయ్) కు చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాన్ కామిక్స్ తెగ చదివి..అలా అవ్వాలని పిచ్చి. అది ఏం రేంజిలో అంటే బ్యాట్స్ మెన్ కు ,సూపర్ మెన్ కు తల్లితండ్రులు లేరని తన అమ్మా,నాన్నను కూడా చంపేసేటంత. అలా అతను సూపర్ మ్యాన్ అవ్వాలనే పిచ్చిలో పెరిగిపెద్దవుతాడు. మరోప్రక్క అంజనాద్రి అనే ఊరిలో హనుమంతు (తేజా సజ్జా)అనే కుర్రాడు. అతను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూంటాడు. తన అక్కడ అంజమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్) తో కలిసి జీవిస్తూంటాడు. అలాగే అతనికి మీనాక్షి (అమృతా అయ్యర్) అంటే ప్రేమ. చిన్నతనం నుంచి ఆమెను ఆరాధిస్తూంటాడు. కానీ ఆమె డాక్టర్ చదువుతూంటుంది. ఇదిలా ఉంటే ఆ అంజనాద్రిని పాలెగాడు గజపతి (రాజ్ దీపక్ శెట్టి)పాలిస్తూంటాడు. అతనో అక్కడ లోకల్ విలన్ అన్నమాట. తనకు ఎదురుతిరిగిన వాళ్లను కుస్తీ పోటీకి పిలిచి చంపేస్తూంటాడు.
ఇక అతని అరాచకాలు గిట్టని మీనాక్షి నిలదీస్తే ఆమెను చంపేయటానికి ప్లాన్ చేస్తాడు ఆ పాలెగాడు. ఆమెపై ఎటాక్ చేసిన వాళ్ల నుంచి రక్షించే ప్రాసెస్ లో దెబ్బలు తిని దగ్గరలో ఉన్న నదిలో పడిపోతాడు హనుమంతు. అప్పుడు అతనికి ఆ నదిలో శక్తుల కల రుధిర మణి లభిస్తుంది. దాని సాయింతో హనుమంతుకు సూపర్ పవర్స్ వస్తాయి. ఈ విషయం వైరల్ అవుతుంది. అలా ఈ విషయం సూపర్ మెన్ పిచ్చిలో బ్రతుతుకున్న మైఖల్ కు తెలుస్తుంది. దాంతో హెలీకాప్టర్ వేసుకుని మరీ ఆ ఊరిలో దిగిపోతాడు ఆ సూపర్ పవర్ ని దక్కించుకోవటానికి ప్రయత్నం మొదలెడతాడు. అప్పుడు ఏం జరిగింది...అసలు రుధిరమణికి ఆ శక్తులు ఎలా వచ్చాయి. మైఖెల్ కు ఆ మణి లభించిందా... హనుమంతు తను ప్రేమించిన అమ్మాయి మీనాక్షిని సొంతం చేసుకోగలిగాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
భగవంతుడు శక్తులతో పవర్స్ వచ్చిన హనుమాన్ కు...మిషన్స్ సాయంతో పవర్స్ తెచ్చుకుని సూపర్ మేన్ గా చలామణి అయ్యే వ్యక్తికి మధ్య జరిగే కథ ఇది. కథగా ఇది ఇంట్రస్టింగ్ గానే ఉంటుంది. అయితే దాన్ని డీల్ చేసే విధానమే కొంత మేరకు విసిగిస్తుంది. అయితే కథలో పిల్లలు మెచ్చే ఎలిమెంట్స్ పెట్టుకోవటం కలిసి వచ్చింది. అలాగే
ఆ మధ్యన మళయాళంలో మిన్నళ్ మురళీ అనే ఓ సినిమా వచ్చింది. అది మన ఇండియన్ సూపర్ హీరో సినిమా . ఈ సినిమా కూడా కొంచెం అటూ ఇటూలో అదే ఫార్మెట్ లో వెళ్తూంటుంది. సినిమా ప్రారంభం చాలా ఇంట్రస్టింగ్ గా మొదలెట్టారు. ఏదో అదిరిపోయే కంటెంట్ చూడబోతున్నామని అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత మెల్లిగా డల్ అవుతూ వస్తుంది. హీరో ఇంట్రడక్షన్, ఫ్యామిలీ సెటప్, హీరో ఉండే ఊరు అంజనాద్రి ఇవన్నీ బాగా పాతకాలం సెటప్ లా అనిపిస్తాయి. అయితే ఎప్పుడైతే హీరోలో సూపర్ నాచురల్ శక్తులు వచ్చాయో అప్పుడు కథనంలో స్పీడు పెరిగింది. శక్తులు వచ్చాక వచ్చే సీన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్వెల్ దాకా అలా అలా లాగేసారు. అసలు కథలోకి రాకుండా. ఇంట్రవెల్ ముందు విలన్ ని తీసుకువచ్చి...కథలోకి వెళ్లారు. దాంతో ఫస్టాఫ్ పెద్దగా ఏమీ చూసినట్లు అనిపించదు.
ఇక సెకండాఫ్ లో హీరో, విలన్ మధ్య జరగటానికి పెద్దగా ఏమీ ఉండదు. ఎందుకంటే వాడు విలన్ అని హీరోకు తెలియదు. తెలిసేటప్పటికి స్క్రీన్ టైమ్ ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే హీరోని విలన్ ఇరికించటం మొదలెడతాడో మళ్లీ కథలో పరుగు మొదలైంది. ఇక ఈ సినిమాలో అసలైన ఎలిమెంట్ హనుమాన్. ఆయన ఎప్పుడు వస్తాడా..ఏమైనా చేస్తాడా అని ఎదురుచూస్తూంటాం. అయితే క్లైమాక్స్ దాకా ఆయన కనపడడు. దాంతో హనుమంతుడు కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో ఊపు వచ్చింది. దాంతో క్లైమాక్స్ ఫస్ట్ క్లాస్ లో పాసైపోయారు. ఆ ఎపిసోడ్ నమ్మే సినిమా మొత్తం చేసారా అనిపిస్తుంది. ఇక సినిమా కథను కొంత భాగం కామెడీగా ట్రీట్ చేయటం కూడా కలిసి వచ్చింది. అయితే సెకండాఫ్ లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ విసుగు అనిపిస్తాయి. ఎప్పుడు అయ్యిపోతాయి అని ఎదురుచూసేలా చేస్తాయి. ఎందుకంటే విలన్ ని హీరో ఎదుర్కొనే సీన్ కోసమే గా ఎదురుచూసేది. సెకండాఫ్ లో హీరో కొండలాంటి బండను అవలీలగా ఎత్తే సీన్ (శ్రీకృష్ణుడు గోవర్దనగిరి టైప్లో ). బుల్లెట్ల వర్షంతో హీరో వెనకాల శ్రీరాముని రూపం రావడం(ఆర్.ఆర్.ఆర్ టైప్ లో ) వంటివి బాగా డిజైన్ చేసారు.
ఎవరెలా చేసారు...
తేజ సజ్జా ...హనుమంతుగా న్యాయం చేసాడు. కానీ కొన్ని సీన్స్ లో ఆ పాత్రను బాలెన్స్ చేయలేదేమో అనిపిస్తుంది. ఇక కమిడయన్ సత్య, గెటప్ శ్రీనుల బాగానే నవ్వించారు. సత్య మీద మంచి ట్రాక్ వేసారు. వినయ్ రాయ్ విలన్ గా ఉన్నాడని, అతను విలనిజం చూపించటానికి సరపడ సీన్స్ లేవు. అలాగే ఆ విలన్ మంచివాడా చెడ్డవాడా అనే క్లారిటీ పూర్తిగా ఇవ్వరు. ఇక పాలెగాడుగా కనిపించినరాజ్ దీపక్ శెట్టి ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యారు. జబర్దస్త్ రోహిణి నవ్వించింది. వెన్నెల కిషోర్‌ది ఫుల్ లెంగ్త్ క్యారక్టరే. హీరోయిన్ మాత్రం జస్ట్ ఓకే అన్నట్లుంది. హీరో అక్కడా చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఎప్పటిలాగే చాలా సినిమాల్లో చేసిన పాత్రలాంటిందే అలాగే చేసింది. విభీషణుడిగా సముద్రఖని కొత్త తరహా పాత్రలో కనిపించారు. హీరోయిన్ తండ్రిగా మీర్ గారు చాలా హుందాగా బాగా చేసారు.
టెక్నికల్ గా ...
ప్రశాంత్ వర్మ తక్కువ బడ్జెట్ లో ఎక్కువ అవుట్ ఫుట్ తేగల సమర్దుడే. అలాగే ఏదో కొత్తదనం కథలో ఉండాలని రకరకాల జానర్స్ ట్రై చేస్తూ వస్తున్నాడు. హాలీవుడ్ ఇన్ఫూలియెన్స్ ని తెలుగు సినిమాకు అప్లై చేస్తూంటాడు. అదే ఈ సినిమాకూ చేసాడు. కాకపోతే మరీ అంజనాద్రి గ్రామం బాగా పాతకాలం సినిమాలోలాగ ఉండటమే ఎబ్బెట్టుగా ఉంటుంది. నార్త్ కోసం అలా డిజైన్ చేసారేమో మరి. విఎఫ్ ఎక్స్ వర్క్ ఆ బడ్జెట్ కు తగ్గట్లు ఉంది. .చివరి క్లైమాక్స్ పది నిమిషాలు థియేటర్లు జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగేలా ప్లాన్ చేయటం ఇప్పుడున్న అయోధ్య మూడ్ కు ఫెరఫెక్ట్. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండు బాగున్నాయి. సెకండాఫ్ లెంగ్త్ తగ్గిస్తే బాగుండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆ ప్రాజెక్టుకు సరపడా ఉన్నాయి. అలాగే కోతి పాత్రకు రవితేజ చేత డబ్బింగ్ చెప్పించటం మంచి ఆలోచన.
Teja Sajja starrer HanuMans trailer out
ఫైనల్ థాట్
నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసినట్లున్న ఈ సినిమా ఇక్కడ మన పిల్లలకు కూడా నచ్చే ఎలిమెంట్స్ తో వచ్చింది. మరి ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంటే ఇబ్బంది కానీ లేకపోతే బాగుంది అనిపిస్తుంది. ఓ సారి చూడచ్చు.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.75
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
తారాగణం: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే
డీవోపీ: దాశరధి శివేంద్ర
సంగీత దర్శకులు: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
ఎడిటర్: సాయిబాబు తలారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి, పుష్పక్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
సమర్పణ: శ్రీమతి చైతన్య
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి