Fact Check: తెలంగాణ పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్..? వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్‌లు
iBomma: తెలుగు చిత్ర పరిశ్రమకి ఐబొమ్మ వార్నింగ్ అంటూ స్క్రీన్‌షాట్‌లు వైరల్ గా మారాయి. పలు మీడియా కథనాలు కూడా వచ్చాయి. తెలంగాణ పోలీసులు ఇటీవల పైరసీ వెబ్ సైట్లపై ఫోకస్ చేసినట్టు వెల్లడించిన తర్వాత ఐబొమ్మ వార్నింగ్ స్క్రీన్‌షాట్‌లు వైరల్ అవుతున్నాయి.

పైరసీ తెలంగాణ పోలీసుల చర్యలు
తెలుగు చిత్ర పరిశ్రమకి, దక్షిణాది సినీ ఇండస్ట్రీకి ఐబొమ్మ వెబ్ సైట్ కొరకరాని కొయ్యగా మారింది. సినిమాలని పైరసీ చేస్తూ యూజర్లకు అందుబాటులో ఉంచుతోంది. హై క్వాలిటీ కంటెంట్ ని యూజర్లకు అందుబాటులో ఉంచడం ఐబొమ్మ ప్రత్యేకత. టాలీవుడ్ గతంలో చాలా సార్లు ఐబొమ్మ ఆటకట్టించడానికి ప్రయత్నించారు. కానీ దానిని నిర్మూలించడం సాధ్యపడలేదు. ఇటీవల తెలంగాణ పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం చాలా సీరియస్ గా పైరసీ వెబ్ సైట్లు, ఐబొమ్మపై ఫోకస్ చేశారు.
టాలీవుడ్ కి ఐబొమ్మ వార్నింగ్ ?
దీంతో ఐబొమ్మ ఘాటుగా టాలీవుడ్ కి, పోలీసులకు వార్నింగ్ ఇచ్చిందంటూ స్క్రీన్‌షాట్‌లు వైరల్ అవుతున్నాయి. పోలీసులు ఇటీవల ఐబొమ్మ, బొప్పమ్ లాంటి పైరసీ వెబ్ సైట్లని తొలగించే ప్రయత్నం మొదలు పెట్టారు. దీనితో ఐబొమ్మ టాలీవుడ్ కి, పోలీసులకు వార్నింగ్ ఇస్తూ కొన్ని కామెంట్స్ చేసింది. మీరు ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మి ఆ తర్వాత ఏమీ పట్టనట్లు ఓటీటీలో ఎలా సొమ్ము చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో మాపై ఫోకస్ చేస్తున్నారు. అసలు హీరోలకు అంత భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి ఎందుకు సినిమాలు చేస్తున్నారు. విదేశాల్లో షూటింగ్స్ చేయాల్సిన అవసరం ఏంటి.. అనవసర బడ్జెట్ భారం తప్ప అంటూ వైరల్ అవుతున్న వార్నింగ్ స్క్రీన్‌షాట్‌లలో పేర్కొంది.
హీరోలకు ఆంత రెమ్యునరేషన్ ఎందుకు ?
అలాగే, “సినిమాకి పనిచేసేది హీరో హీరోయిన్లు మాత్రమేనా ? వాళ్ళకే అధిక రెమ్యునరేషన్స్ ఎందుకు ? సినిమాకి పనిచేసే కార్మికులు, ఇతర సిబ్బంది చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే రెమ్యునరేషన్ ఏ కూలి పని చేసినా వస్తాయి. అనవసరంగా బడ్జెట్ పెంచేసి దానిని రికవరీ చేయడానికి మధ్యతరగతిపై పడుతున్నారు. టికెట్ ధరలు పెరగడం వల్ల బాధపడేది మధ్యతరగతి వాళ్ళే. మేము ఏ దేశంలో ఉన్నా భారత దేశం, తెలుగు వారి కోసం ఆలోచిస్తాం. ఫస్ట్ మీరు కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వేరే వెబ్సైట్స్ మీద ఫోకస్ పెట్టండి. మేము అంత మంచి వాళ్ళం కాదు.. బురదలో రాయి వేయకండి. చావుకి భయపడని వాడు దేనికీ భయపడడు” అంటూ అందులో పేర్కొంది. అయితే, ప్రస్తుతం వైరల్ కథనాలు, కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నట్టుగా ఐబొమ్మ పోలీసులకు ఇప్పుడు ఇచ్చిన వార్నింగ్ కాదు. గతంలో టాలీవుడ్ కు ఇచ్చిన వార్నింగ్. అయితే, ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ, ఐబొమ్మ వివాదం
విజయ్ దేవరకొండ నటించిన ఖుషి, కింగ్డమ్ చిత్రాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఐబొమ్మ వార్తల్లో నిలిచింది. నిర్మాతలు తమ సినిమాలు పైరసీ కాకుండా కొందరు ఏజెంట్లకు డబ్బులు ఇస్తున్నారని..ఐబొమ్మ పేరుతో ఫేక్ వెబ్ సైట్స్ క్రియేట్ చేస్తున్నారని ఐబొమ్మ గతంలో పేర్కొంది. అది ఆపకపోతే తాము ఏం చేయాలో అది చేస్తాం అని వార్నింగ్ ఇచ్చింది.
పైరసీ ఏజెంట్ లని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ విధంగా ఐబొమ్మ తెలుగు చిత్ర పరిశ్రమ సినిమాలని కాపీ చేసి యూజర్లకు అందుబాటులో ఉంచుతూ.. అదే తెలుగు చిత్ర పరిశ్రమకి వార్నింగ్ ఇవ్వడం విడ్డూరం. తెలంగాణ పోలీసులు ఇటీవల థియేటర్స్ లో సినిమాని కెమెరాలతో షూట్ చేసే పైరసీ వెబ్ సైట్స్ ఏజెంట్స్ ని అరెస్ట్ చేశారు. వారి దగ్గర డేటా స్వాధీనం చేసుకున్నారు. పైరసీ నివారణ కోసం తెలంగాణ పోలీసులు ఇటీల మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, దిల్ రాజు, నాని లాంటి సినీ ప్రముఖులతో భేటీ అయిన సంగతి తెలిసిందే.
ఏసియా నెట్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్ లో బయటపడ్డ వాస్తవం
మీరు మాపై ద్రుష్టి పెడితే మేము ఏం చేయాలో అదిచేస్తాం అంటూ ఐబొమ్మ తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్లు అనేక కథనాలు, సోషల్ మీడియా పుకార్లు వైరల్ అయ్యాయి. ఈ మేరకు ఐబొమ్మ స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఐబొమ్మ సంస్థ తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఏసియా నెట్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లు 2023 నాటివి. ఐబొమ్మ అప్పట్లో కూడా పోలీసులని ఉద్దేశించి ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు. అవి తెలుగు చిత్ర పరిశ్రమని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. అప్పట్లో ఏసియా నెట్ ఈ వార్తని కవర్ చేసింది. అప్పటి స్క్రీన్ షాట్స్ ని కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు వైరల్ చేస్తున్నాయి. వాస్తవం మాత్రం ఐబొమ్మ సంస్థ పోలీసులకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు.