నా క్యారెక్టర్ ని చంపేస్తున్నారు, వంద శాతం తప్పుడు ఆరోపణలు.. అల్లు అర్జున్ ఆవేదన
అసెంబ్లీలో తనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లకి హీరో అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. తన క్యారెక్టర్ అస్సాసినేషన్ జరుగుతుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సంధ్య థియేటర్ ఘటన మరింత ముదురుతుంది. ఈఘటన రాను రాను సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్‌గా మారింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, జరిగిన ఘటన పూర్తిగా యాక్సిడెంట్ అని, అది చాలా బాధాకరం అని తెలిపారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి ఆయన సానుభూతి తెలిపారు. శ్రీతేజ్ కోలుకుంటున్నారని తెలిసి సంతోషంగా ఉందన్నారు.
దీనిపై బన్నీ ఇంకా మాట్లాడుతూ, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా క్యారెక్టర్ అస్సాసినేషన్ చేస్తున్నారు. అది చాలా బాధగా ఉంది. ఇన్నాళ్లు ఎప్పుడూ తాను ఎలాంటి మిస్టేక్ చేయలేదు. నేను రోడ్ షో చేశానని ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. పోలీసుల అనుమతితోనే ముందుకు వెళ్లినట్టు తెలిపారు. అయితే ఈ ఘటన గురించి పోలీసులు చెప్పలేదని, నా టీమ్ వాళ్లు, థియేటర్ మేనెజ్‌మెంట్ వాళ్లు సర్ ఓవర్ క్రౌడ్ అవుతుందని, వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయాను.
నేను రోడ్ షో చేయలేదు ఫ్యాన్స్ భారీగా వచ్చారు. వారు నాకోసం అరుస్తున్నారు. వాళ్లని కాదని వెళ్లిపోతే ఆరోగెంట్ అనుకుంటారని వారి కోసం నేను కారు పైకి వచ్చి వారికి అభివాదం తెలిపానని, నేను చెబితేనే ఫ్యాన్స్ ముందుకు వెళ్తారని పోలీసులు చెబితేనే నేను అలా ముందుకు వెళ్లాలని చెప్పాను అందుకోసం అలా చేయాల్సి వచ్చింది, అంతేకాని సంబరాలు చేసుకోవడానికి కాద`ని తెలిపారు బన్నీ.
తాను సినిమాలు చేసేదే ఆడియెన్స్ ఎంజాయ్ చేయడం కోసం అని తెలిపారు బన్నీ. తెలుగు వారి గౌరవాన్ని పెంచాలని నేను సినిమాలు చేస్తుంటే నేను మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. శ్రీతేజ్ విషయంలో తాను అన్ని రకాలుగా సహకరించేందుకు బాధ్యతతో ఉన్నాను, కానీ రెస్పాన్సిబులిటీగా లేనని ఆరోపణలు చేయడం బాధగా ఉందన్నారు అల్లు అర్జున్. చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, వంద శాతం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, క్యారెక్టర్ అస్సాసినేషన్ చేస్తున్నారని తెలిపారు. ఇరవై ఏళ్లు సాధించుకున్న ఈ కష్టం, క్రెడిబులిటీని ఒక్క రాత్రితో బ్రేక్ చేస్తున్నారని తెలిపారు బన్నీ.
ఆ రోజు రాత్రి ఆ ఘటన గురించి తెలియదని, మార్నింగ్ తెలిసిన వెంటనే వీడియో ద్వారా స్పందించానని వెల్లడించారు. అయితే ఆసుపత్రికి వెళ్లి ఆ అబ్బాయిని పరామర్శించాలనుకున్నానని, కానీ ఆసుపత్రి వర్గాలు, తన ఫ్రెండ్ బన్నీ వాసు ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని గమనించి ఆసుపత్రికి రావద్దని చెప్పడంతో తాను వెనక్కి తగ్గానని, దీనిపై కేసు కావడంతో లీగల్ సమస్యల కారణంగా తాను సైలెంట్‌గా ఉన్నానని తెలిపారు అల్లు అర్జున్.
`పుష్ప 2` సినిమా ప్రీమియర్స్ రోజు రాత్రి సంధ్య థియేటర్‌కి అల్లు అర్జున్ టీమ్‌తో కలిసి వచ్చిన విషయం తెలిసిందే. అభిమానుల మధ్య సినిమా చూసేందుకు, ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు ఆయన థియేటర్‌కి వచ్చారు. బన్నీ వస్తున్నారని తెలిసి ఆయన కోసం భారీగా అభిమానులు తరలి రావడంతో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళా అభిమాని రేవతి అక్కడిక్కడే మృతి చెందగా, ఆమె కొడుకు శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యంపై, హీరో అల్లు అర్జున్‌పై కేసులు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. మృతురాలు రేవతి భర్త భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ఆయనకు రిమాండ్ కూడా విధించింది. హైకోర్ట్ మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బన్నీ బయటకు వచ్చారు. కానీ ఆ రోజు రాత్రి జైల్లో గడిపాడు.