హీరో రాజశేఖర్ బాధపడుతున్న వ్యాధి ఇదే? ఇది ఎందుకు వస్తుంది? ఒక్కసారి వస్తే అంతేనా?
హీరో రాజశేఖర్ తాను చాలా కాలంగా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు. మరి ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఏంటి? అనేది తెలుసుకుందాం.

`బైకర్` మూవీతో రాజశేఖర్ కమ్ బ్యాక్
హీరో రాజశేఖర్ చాలా గ్యాప్‌తో మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య ఆయన హీరోగా నటించిన సినిమాలు సరిగా ఆడలేదు. వరుస పరాజయాల కారణంగా కొంత గ్యాప్ ఇచ్చారు. మరోవైపు క్యారెక్టర్ వైపు కూడా టర్న్ తీసుకున్నారు. ఆ మధ్య నితిన్ హీరోగా నటించిన `ఎక్స్ టార్డినరీ మ్యాన్` చిత్రంలో కీలక పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. కానీ సినిమా ఆడలేదు. దీంతో గ్యాప్ తీసుకున్నారు. కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ అయ్యారు. శర్వానంద్ హీరోగా రూపొందుతున్న `బైకర్` చిత్రంలో నటించారు. ఆయనది ఇందులో స్ట్రాంగ్ రోల్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ని శనివారం విడుదల చేశారు. ఇందులో రాజశేఖర్ పాల్గొన్నారు.
ఖాళీగా ఉంటే జైల్లో ఉన్నటే ః రాజశేఖర్
ఈ కార్యక్రమంలో రాజశేఖర్ మాట్లాడుతూ, తాను కరోనా సమయంలో చాలా ఇబ్బంది పడినట్టు తెలిపారు. కరోనా తర్వాత మళ్లీ కోలుకుంటానా? మళ్లీ నడవగలనా అనే భయం వేసిందని, కానీ మూడు నెలల్లోనే లేచానని, మళ్లీ మామూలు మనిషి అవడానికి ఆరు నెలలు పట్టిందన్నారు. అయితే ఆ సమయంలో సినిమాలు లేవని, ఖాళీగా ఉన్నానని, దీంతో ఆ టైమ్‌లో జైల్లో ఉన్న ఫీలింగ్ కలిగిందన్నారు. మళ్లీ హీరోగానే కాదు, ఎలాంటి పాత్ర అయినా చేయాలని నిర్ణయించుకుని కథలు విన్నప్పుడు ఒక్కటి కూడా నచ్చలేదని, అలాంటి సమయంలోనే `బైకర్` మూవీ స్టోరీ వచ్చిందని, పాత్ర నచ్చడంతో ఓకే చేసినట్టు తెలిపారు. సినిమాలో తన పాత్రని చూసి శర్వానంద్ అభినందించినట్టు తెలిపారు రాజశేఖర్.
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న రాజశేఖర్
ఈ సందర్భంగానే ఆయన తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపారు. చాలా రోజులుగా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్(ibs)తో బాధపడుతున్నట్టు చెప్పారు. దీని కారణంగా తనకు కడుపులో నొప్పి వస్తుందని, సరిగా మాట్లాడలేనని వెల్లడించారు. అయితే దర్శకుడు అభిలాష్ రెడ్డి రిక్వెస్ట్ మేరకు వచ్చినట్టు వెల్లడించారు. అయితే రాజశేఖర్ బాధపడుతున్న `ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్` ఏంటి? అది ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏంటి? ఎలా కంట్రోల్ చేయాలనేది చూస్తే.
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లక్షణాలేంటి?
ఒమెగా ఆసుపత్రి ఎండీ మోహన వంశీ చెప్పిన వివరాల ప్రకారం.. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వస్తాయి. మెయిన్‌గా కడుపు నొప్పి వస్తుందట. రాజశేఖర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సరిగా నిలబడలేనని, మైండ్ డిస్టర్బెన్స్ ఉంటుందని, ఏదేదో మాట్లాడతానని తెలిపారు. ఆయన చెప్పినదాితోపాటు తిమ్మిరి, ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు, మలబద్దకం వంటివి కలుగుతాయట. ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఈ లక్షణాలు కనిపిస్తాయట. జీర్ణశయాంతర రుగ్మత వల్ల అది మెదడుకి, పేగుకి మధ్య సంబంధాన్ని దెబ్బతీస్తుందట. అందుకే చిరాకు కలుగుతుందట. పేగులు సున్నితంగా తయారవుతాయట. పేగు కండరాల సంకోచాలు కలుగుతాయట.
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఎందుకొస్తుందంటే?
ఈ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ రావడానికి కారణం ప్రధానంగా ఒత్తిడి అని డాక్టర్ మోహన వంశీ తెలిపారు. జీవన విధానం, బయట తినే జంక్ ఫుడ్ వంటివి కారణమవుతాయని తెలిపారు. ఆలస్యంగా ఫుడ్ తీసుకోవడం, గ్యాస్ కారణమైన ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుందన్నారు. ఆందోళన, నిరాశ వంటివి కూడా కారణమని, సరైన వ్యాయామం లేకపోవడం కూడా ఓ కారణమవుతుందని, జీర్ణక్రియ దెబ్బతింటే ఒకదాని తర్వాత మరో జబ్బు వస్తుందన్నారు. ఇది చాలా కాలం వెంటాడుతుందని తెలిపారు.
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ రాకుండా ఏం చేయాలంటే?
ఎలా నివారించాలంటే.. ఒత్తిడి తగ్గించుకోవడం, సమయానికి అన్ని పనులు చేసుకోవడం, వ్యాయమాలు చేయడం, ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, కొవ్వు పదార్థాలు తగ్గించుకోవడం, కారం, ఎక్కువ ప్రాసెస్ ఫుడ్‌కి దూరంగా ఉండటం, కెఫిన్, ఆల్కహాల్ వంటివి పరిమితంగా తీసుకోవాలని తెలిపారు డాక్టర్ మోహన వంశీ. శ్వాసకి సంబంధించిన వ్యాయమాలు, యోగా చేయాలని, దీంతోపాటు డాక్టర్ సూచనల మేరకు కొన్ని మెడికేషన్ తీసుకోవాలని వెల్లడించారు. ఇదిలా ఉంటే హీరో రాజశేఖర్ కూడా డాక్టర్ అనే విషయం తెలిసిందే.