- Home
- Entertainment
- వరుస ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్‌కి పిలిచి ఆఫర్ ఇచ్చిన బాలయ్య.. ఇండస్ట్రీ హిట్ కానుకగా ఇచ్చాడు.. ఆ దర్శకుడు ఇతనే
వరుస ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్‌కి పిలిచి ఆఫర్ ఇచ్చిన బాలయ్య.. ఇండస్ట్రీ హిట్ కానుకగా ఇచ్చాడు.. ఆ దర్శకుడు ఇతనే
హీరో బాలకృష్ణ తన కెరీర్‌లో ఎంతో మంది ఫ్లాప్‌ల్లో ఉన్న దర్శకులతో పనిచేశారు. అయితే వారిలో ఓ డైరెక్టర్ మాత్రం బాలయ్యకి ఇండస్ట్రీ హిట్ మూవీని కానుకగా ఇవ్వడం విశేషం.

పరాజయాల్లో ఉన్న దర్శకుడికి అవకాశం ఇచ్చిన బాలకృష్ణ
బాలకృష్ణ సినిమాల విషయాల్లో దర్శక, నిర్మాతలకు చాలా కంఫర్ట్ గా ఉంటారు. ఈ విషయాన్ని ఆయనతో పనిచేసిన చాలా మంది దర్శక, నిర్మాతలు తెలిపారు. ఒక్కసారి స్క్రిప్ట్ నచ్చి, సినిమా ఓకే చేస్తే, అందులో ఇన్‌వాల్వ్ అవ్వరు. దర్శకుడికి సరెండర్ అయిపోతారు. దర్శకుడు చిన్నా, పెద్దనా అనేది చూడరు, వాళ్లు చెప్పింది చేస్తారు. ఆ గొప్ప క్వాలిటీనే ఆయన్ని ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండేలా చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకు కూడా ఆఫర్లు ఇచ్చిన గొప్ప మనసు బాలకృష్ణది కావడం విశేషం. అలా వరుస పరాజయాల్లో ఉన్న దర్శకుడికి ఆఫర్ ఇచ్చాడు బాలయ్య. ఆ డైరెక్టర్ ఇండస్ట్రీ హిట్‌ని నందమూరి నటసింహానికి కానుకగా ఇచ్చారు. ఆ కథేంటో చూద్దాం.
స్టార్ హీరోలకు ఇండస్ట్రీ హిట్స్ అందించిన బి గోపాల్
బాలయ్యకి ఇండస్ట్రీ హిట్‌ని ఇచ్చిన ఆ దర్శకుడు ఎవరో కాదు బి గోపాల్. మాస్ సినిమాలకు ఆయన కేరాఫ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫ్యాక్షన్ మూవీస్‌తో ఇండస్ట్రీని షేక్ చేశారు. ఈ ఫ్యాక్షన్ నేపథ్యంలోనే బాలయ్య, చిరంజీవిలకు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. వారితోపాటు మోహన్ బాబు, రాజశేఖర్, వెంకటేష్, నాగార్జునలకు కమర్షియల్ మూవీస్‌తో సూపర్ హిట్స్ అందించారు. 1986లో `ప్రతిధ్వని` చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన, ఏఎన్నార్, నాగార్జునలతో చేసిన `కలెక్టర్ గారి అబ్బాయి`తో సూపర్ హిట్ అందుకున్నారు. `రక్త తిలకం`, `విజయ్`, `స్టేట్ రౌడీ`, `లారీ డ్రైవర్`, `బొబ్బిలి రాజా`, `అసెంబ్లీ రౌడీ`, `చినరాయుడు`, `రౌడీ ఇన్ స్పెక్టర్`, `మెకానిక్ అల్లుడు`, `గ్యాంగ్ మాస్టర్`, `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు`, `ఇంద్ర` వంటి బ్లాక్ బస్టర్స్ ని రూపొందించారు.
బి గోపాల్ కి `సమరసింహారెడ్డి` చేసే ఛాన్స్ ఇచ్చిన బాలయ్య
రాజశేఖర్‌తో చేసిన `గ్యాంగ్ మాస్టర్` తర్వాత దర్శకుడు బి గోపాల్‌కి వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. `స్ట్రీట్ ఫైటర్`, `ఖైదీ ఇన్‌స్పెక్టర్`, `కలెక్టర్ గారు`, `అడవిలో అన్న` వంటి చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ డిజప్పాయింట్ చేశాయి. దీంతో దర్శకుడితో సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. రెండేళ్లు గ్యాప్ కూడా వచ్చింది. అలాంటి సమయంలో బి గోపాల్‌ని నమ్మి అవకాశం ఇచ్చారు బాలయ్య. అప్పుడు బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే `సమరసింహారెడ్డి`. బాలయ్య, అంజలా జవేరి, సిమ్రాన్, సంఘవి నటించిన ఈ ఫ్యాక్షన్ నేపథ్య మూవీ అప్పట్లో ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే.
బాలయ్యకి కానుకగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన బి గోపాల్
1999 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసుని షేక్ చేసింది. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా, అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లోనే ముప్పై కోట్ల వసూళ్లని రాబట్టింది. ఒక థియేటర్‌లో ఏడాది ఆడింది. మూడు థియేటర్లలో 227 రోజులు ఆడింది. 175 రోజులు 29 సెంటర్లలో ఆడింది. వంద రోజులు 72 సెంటర్లలో, 50 రోజులు 122 సెంటర్లలో ప్రదర్శించబడింది. అప్పట్లో ఇదొక సంచలనంగా చెప్పొచ్చు. అలా ఫ్లాప్‌లో ఉన్న దర్శకుడు బి గోపాల్‌కి అవకాశం ఇస్తే, ఆయన బాలయ్యకి ఇండస్ట్రీ హిట్‌ని కానుకగా ఇచ్చారు. ఇదే కాదు ఆ తర్వాత `నరసింహనాయుడు`తోనూ మరో ఇండస్ట్రీ హిట్‌ని ఇవ్వడం విశేషం. ప్రస్తుతం బి గోపాల్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ 1986 నుంచి 2009 వరకు దర్శకుడిగా పనిచేసి సంచలన చిత్రాలను రూపొందించారు.
బాలకృష్ణని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను
ఈ మూవీపై బి గోపాల్ స్పందిస్తూ, `నాలుగైదు సినిమాల ఫ్లాపుల తర్వాత బాలయ్య నన్ను నమ్మి `సమరసింహారెడ్డి` సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో మళ్లీ నేను పెద్ద హీరోలతో సినిమాలు చేస్తాననే ధైర్యం పోయింది. అలాంటి సమయంలో నన్ను నమ్మిన హీరో బాలయ్య. అర్థగంట మాత్రమే కథ చెప్పాం. నచ్చిందన్నారు. డైరెక్ట్ షూటింగ్‌కి వెళ్లిపోయాం. బాలయ్య బాబుని నా లైఫ్‌లో మర్చిపోలేను` అని చెప్పారు. ట్యాగ్ తెలుగు(శివ మల్లాల)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బి గోపాల్ ఈ విషయాలను వెల్లడించారు.
అఖండ 2తో రాబోతున్న బాలకృష్ణ
ఇక బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన `అఖండ`కిది సీక్వెల్. అయితే ఈ సారి శివతత్వం ప్రధానంగా చేసుకుని మూవీని రూపొందిస్తున్నారు బోయపాటి. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కాబోతుంది. దీన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి బాలయ్య కూతురు తేజస్విని నిర్మాత కావడం విశేషం. ఆమెతో కలిసి రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.