నాని మూవీ కాపీనా..? త్రివిక్రమ్ ని ఫాలో అవుతున్న యంగ్ డైరెక్టర్స్!
నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం పై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. ఇది ప్రముఖ రచయిత రాసిన నవలకు కాపీ అంటున్నారు. ఈ క్రమంలో యువ దర్శకులు త్రివిక్రమ్ ని ఫాలో అవుతున్నారనే టాక్ మొదలైంది..

Trivikram Srinivas
దర్శకుడు త్రివిక్రమ్ కొన్నాళ్లుగా కథల విషయంలో సీరియస్ అలిగేషన్స్ ఎదుర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన తెరకెక్కించిన అజ్ఞాతవాసి ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ కి కాపీ. మూవీ విడుదలయ్యాక ఈ విషయం బట్టబయలు అయ్యింది. త్రివిక్రమ్ ఇమేజ్ భారీగా డామేజ్ అయ్యింది. లార్గో వించ్ డైరెక్టర్ కూడా ఆరోపణలు చేశాడు. ఇక నితిన్ హీరోగా తెరకెక్కించిన అ ఆ.. మూవీ యద్దనపూడి సులోచనా రాణి రచించిన మీనా నవల కాపీ అనే ఆరోపణలు వినిపించాయి. ఆ విషయంలో త్రివిక్రమ్ తేలు కుట్టిన దొంగలా ఉండిపోయాడు.
Trivikram
ఆయన కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉన్న అల వైకుంఠపురంలో ఎన్టీఆర్ ఇంటి గుట్టు చిత్రానికి మోడ్రన్ వెర్షన్. కథ పరంగా మక్కీకి మక్కీ దించేశాడు. ఇక లేటెస్ట్ రిలీజ్ గుంటూరు కారం కూడా యద్దనపూడి సులోచన రాణి రాసిన కీర్తి కిరీటాలు నవల కాపీ అనే వాదన ఉంది. త్రివిక్రమ్ పాత సినిమాలు, నవలలు కాపీ చేస్తూ బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు.
ఈ హిట్ ఫార్ములా యువ దర్శకులు కూడా అలవరుచుకుంటున్నారు. బుర్ర పెట్టి సొంత కథలు రాయకుండా నవలలు, పాత సినిమాలు కాపీ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. నాని లేటెస్ట్ హిట్ హాయ్ నాన్న చిత్రానికి శౌర్యువ్ దర్శకుడు. కాగా ఈ మూవీ శోభన్ బాబు, మంజుల జంటగా 1974లో విడుదలైన మంచి మనుషులు చిత్రానికి కాపీ అంటున్నారు. సోషల్ మీడియాలో హాయ్ నాన్న మీద ఈ ఆరోపణలు వినిపించాయి.
Saripodhaa Sanivaaram
నాని అప్ కమింగ్ మూవీ సరిపోదా శనివారం కూడా కాపీ కథేనట. ప్రముఖ రచయిత మల్లాది కృష్ణమూర్తి రాసిన 'శనివారం నాది' నవల ఆధారంగా ఈ మూవీ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడని సమాచారం. విడుదలైన పోస్టర్ తో మరింత క్లారిటీ వచ్చింది. శనివారం నాది నవలలో హీరో ప్రతి శనివారం ఒక అనూహ్య పరిణామానికి పాల్పడతాడట. నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర అట. మంగళ అనే కీలకమైన లేడీ క్యారెక్టర్ వృత్తిరీత్యా పోలీస్ అట.
సరిపోదా శనివారం మూవీలో హీరోయిన్ ప్రియాంక మోహన్ పోలీస్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన పోస్టర్ లో ఆమె అదే గెటప్ లో ఉన్నారు. ఇటీవల నాని చేసిన ట్వీట్ లో కూడా శనివారం వైలెన్స్ అని కామెంట్ చేశాడు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే సరిపోదా శనివారం మూవీ... శనివారం నాదే నవల కాపీనే అని బలంగా అనిపిస్తుంది. ఈ నవల రైట్స్ నిర్మాతలు కొనుగోలు చేశారా? లేక అనధికారికంగా కాపీ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా శౌర్యువ్, వివేక్ ఆత్రేయ తమ సీనియర్ త్రివిక్రమ్ ని ఫాలో అవుతున్నారని సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి.