`స్కంద`, `చంద్రముఖి 2`, `పెదకాపు` కలెక్షన్లకి వినాయకుడి గండి.. అనుకున్నదొక్కటి అవుతుందొక్కటి ?
ఈ వారం మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రెండు వారాల క్రితం విడుదల కావాల్సిన ఈ సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుని మరీ సెప్టెంబర్ 28న రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో వినాయకుడి రూపంలో గట్టి దెబ్బ పడబోతుంది.
రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంఓ వచ్చిన `స్కంద` చిత్రం విజయదశమి సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ నెల రోజులు ముందుకు జరిగారు. సెప్టెంబర్ 15న విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. బాలకృష్ణ గెస్ట్ గా వచ్చి సినిమాపై హైప్‌ని పెంచాడు. కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. సెప్టెంబర్ 28న రావాల్సిన ప్రభాస్ `సలార్` వాయిదా పడటంతో ఆ డేట్‌కి పోస్ట్ పోన్ చేశారు.
ఇదే కాదు తమిళంలో రూపొందిన `చంద్రముఖి 2` చిత్ర పరిస్థితి కూడా ఇదే. ఈ చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 15నే రిలీజ్ చేయాలని భావించారు. కానీ టెక్నికల్‌గా ఎదురైన సమస్యలతో సినిమాని వాయిదా వేశారు. సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. `చంద్రముఖి`కి సీక్వెల్‌గా వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలున్నాయి. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పి వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ గురువారం విడుదల కాబోతుంది.
దీంతోపాటు ఒక్క రోజు గ్యాప్‌తో శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న `పెదకాపు 1` చిత్రం రాబోతుంది. కొత్త హీరో నటిస్తున్న ఈ చిత్రాన్ని `అఖండ` నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. అయితే ఈ నెల 28నే కిరణ్ అబ్బవరం `రూల్స్ రంజన్`, ఎన్టీఆర్ బావమరిది నవీన్ నేర్ని నటించిన `మ్యాడ్` చిత్రాలు విడుదల కావాల్సింది. కానీ లేటెస్ట్ గా ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. అక్టోబర్ 6కి షిఫ్ట్ అయ్యాయి.
దీంతో ఈ మూడు సినిమాలకు ఈ వారం మంచి స్పేస్ దొరికిందని చెప్పొచ్చు. మూడు మీడియం రేంజ్ సినిమాలు కావడంతో థియేటర్లు ఈజీగానే పంచుకోవచ్చు. దీంతో రిలీజ్ విషయంలో సమస్య లేదు. కానీ అసలు సమస్య ఇప్పుడు ఎదురు కాబోతుంది. `సలార్` డేట్ దొరికిందని మురిసిపోయిన మేకర్స్ కి వినాయకుడి రూపంలో పెద్ద దెబ్బ పడబోతుంది. ఈ సినిమాల ఓపెనింగ్స్ పై గణేషుడు తీవ్ర ప్రభావాన్ని చూపబోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్ఞనం సెప్టెంబర్ 28ని నిర్ణయించారు. ఆల్మోస్ట్ అన్ని గణపతి విగ్రహాలు ఆ రోజు నిమజ్ఞనం అవుతాయి. అందుకోసం మార్నింగ్ నుంచి మండపాల వద్ద కోలహలం ఉంటుంది. యువత అంతా ఆయా కార్యక్రమాల్లోనే బిజీగా ఉంటారు. సినిమాని చూసేది మేజర్‌గా యూతే. వారే బిజీగా ఉంటే ఇక థియేటర్‌కి వచ్చేది ఎవరు? ఇక్కడే సినిమాలకు పెద్ద సమస్య రాబోతుంది. దీంతో ఈ నెల 28న రాబోతున్న `స్కంద`, `చంద్రముఖి 2` చిత్రాలపై తీవ్ర ప్రభావం పడబోతుంది. ఇప్పుడు సినిమాలకు ఓపెనింగ్సే కీలకం. వాటికే కోత పడితే సినిమాకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అంతేకాదు ఆ ప్రభావం 29న కూడా ఉంటుంది. సినిమాని చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపరు. దీంతో రెండో రోజు కూడా కలెక్షన్లకి గండి పడబోతుంది. దీంతో `పెదకాపు` చిత్రంపై కూడా వినాయకుడి నిమజ్ఞనం ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు అనుకున్నదొక్కటి, అవుతుందొక్కటి అన్నట్టుగా మారిపోయింది నిర్మాతల పరిస్థితి.