దేవదాసు రివ్యూ , తాగుబోతు కథ నడవదన్నారు, ఛాలెంజ్ గా తీసుకుని ఏఎన్నార్ ఏం చేశారంటే?
Devadasu Review : అలనాటి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ సినిమాలలో దేవదాసు కూడా ఒకటి. భగ్నప్రేమికులకు దేవుడిగా మారిన దేవదాసు సినిమా 72 ఏళ్లు పూర్తి చేసకుంది. ఇప్పటికీ తెలుగు పరిశ్రమ గర్వంగా చెప్పుగోదగ్గ సినిమాగా దేవదాసు రివ్యూ గురించి చూద్దాం

దేవదాసుకు 72 ఏళ్లు
72 ఏళ్ల దేవదాసు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు అది ఒక చరిత్ర. ఒక పెయిన్, ఓ చిన్న నవల ఆధారంగా తెరకెక్కి, దేశవ్యాప్తంగా వెండితెరపై ప్రకంపనలు సృష్టించింది సినిమా. సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ రాసిన దేవదాస్ అనే నవల ఆధారంగా ఆదే పేరుతో తెరకెక్కింది దేవదాసు. ఆ నవలను తెలుగులోకి అనువదించి మరీ చక్రపాణి ఈ చిత్రాన్ని నిర్మించారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వానికి, అక్కినేని, సావిత్రిల నటనకు, ఘంటసాల గాత్రం.. దేవదాసు సినిమాను చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి. లవ్ ఫెయిల్యూర్స్ ను ఇప్పటికీ దేవదాసు అయ్యావురా అంటారంటే.. అది ఈ సినిమా ప్రభావంతోనే. తాగుబోతులను కూడా దేవదాసు లిస్ట్ లో చేర్చే మహానుభావులకు దేవదాసు మనసు అర్ధం అయితే, ఆసినిమా అర్ధం అవుతుంది. 1953 జూన్ 26న విడుదలైన ఈ సినిమా విశేషాలు రివ్యూ రూపంలో చూసుకుంటే?
దేవదాసు కథ విషయానికి వస్తే
దేవదాసు (అక్కినేని నాగేశ్వరరావు ) రావులపల్లి జమీందారు నారాయణ రావు (యస్.వీ.రంగారావు) రెండో కొడుకు. నిరుపేద కుటుంబంలో జన్మించిన పార్వతి (సావిత్రి), దేవదాసులు చిన్ననాటి నుండి స్నేహితులు. పార్వతి దేవదాసు చిన్నతనం నుండే చాలా క్లోజ్ గా ఉండేవారు. పార్వతి తిట్టడం, దేవాదాసు పార్వతిని దండించటం జరుగుతూ ఉంటుంది. చదువు పట్ల శ్రద్ధ చూపకుండా అల్లరి చిల్లరగా తిరిగే దేవదాసుని చూసి అన్న లాగా పాడైపోతాడని భయంతో, పై చదువుల కోసం జమీందారు అతనిని పట్నం పంపుతాడు. చదువు పూర్తి చేసిన దేవదాసు తిరిగి ఇంటికి వస్తాడు. యుక్తవయసుకి మళ్ళిన ఇరువురి మధ్య చనువుని చూసి సంతోషించిన పార్వతి తండ్రి పెళ్ళి గురించి మాట్లాడటానికి దేవదాసు ఇంటికి వెళతారు. ఆస్తి, కులం తక్కువ అని వారిని జమీందారు అవమానపరుస్తారు. తండ్రిని ఒప్పించడానికి దేవదాసు ప్రయత్నించినా.. తనని చంపి ఇష్టం వచ్చినట్టు చేసుకొనవచ్చునన్న బెదిరింపుకి దేవదాసు లొంగిపోతాడు. ఆ తర్వాతి రోజునే దేవదాసు పార్వతికి చెప్పకుండా పట్నం బయలుదేరి వెళ్ళిపోతాడు.
భగ్నప్రేమికుడి కథ
జమీందారు వద్ద మాట పడ్డ పార్వతి తండ్రి అంతకన్నా మంచి సంబంధం తెచ్చుకోగలమని చెప్పి.. భార్యని పోగొట్టుకొని, పిల్లలు ఉన్న పెద్దమనిషి దుర్గాపురం ఊరి జమీందారు భుజంగరావు (సి.యస్.ఆర్. ఆంజనేయులు) తో సంబంధం కుదుర్చుకొని వస్తాడు. తనని మరచిపొమ్మని దేవదాసు అదివరకే పంపిన ఉత్తరంతో పార్వతి ఆ వివాహనికి ఒప్పుకొంటుంది. పార్వతిని మరచిపోలేని దేవదాసు తిరిగి ఊరి బాట పడతాడు. కానీ అప్పటికే పార్వతి పెళ్ళి వేరొకరితో నిశ్చయం అయిపోయినదని తెలుసుకొని బాధను తట్టుకోలేకపోతాడు. అదే సమయంలో అతని స్నేహితుడు భగవాన్ (శివరాం పేకేటి) మందు అలవాటు చేస్తాడు. ఆతరువాత దేవదాసు తాగుడుకి బానిసౌతాడు. ఊరికి వచ్చిన దేవాదాసుని పార్వతి కలిసి తనతో పాటే తన ఊరు రమ్మంటుంది. పోయేలోపు ఒకసారి వస్తానని వాగ్దానం చేస్తాడు దేవదాసు.ఇక ఈలోపు దేవదాసుకు ఓ వేశ్య పరిచయం అవుతుంది. దేవదాసును ప్రేమిస్తుంది. కాని అతను ఈ జీవితంలో మరోసారి ప్రేమ పెళ్లి కి చోటు లేదు అంటాడు. ఆమెను స్నేహితురాలిగా అభిమానిస్తాడు. దేవదాసు అంకితభావానికి చలించిపోయిన ఆమె.. తన వృత్తిని వదిలి దేవదాసుకు సేవ చేస్తుంటుంది. ఇక మితి మీరిన తాగుడు వలన కాలం గడిచే కొద్దీ దేవదాసు ఆరోగ్యం పాడవుతుంది. చనిపోయేలోపు పార్వతిని చూడాలన్నకోరికను చివరి కోరికను దేవదాసు తీర్చుకోగలడా? దేవదాసును చూస్తే సావిత్రి పరిస్థితి ఏంటి? ఈ ఈమధ్యలో ఎలాంటి ఆంటకాలు వస్తాయి అనేది పూర్తి సినిమా.
దేవదాసు రివ్యూ
భగ్నప్రేమికుల కథలు తెలుగులో పనిచేయవని చాలామంది ఈసినిమా టీమ్ ను భయపెట్టారు. దీంతో మొదటి షెడ్యూల్ షూటింగ్ అవ్వగానే సినిమా ఆపేశారు. మధ్యలో మరో సినిమా చేశారు. ఆ తర్వాత నిర్మాత డీఎల్ నారాయణ పట్టుబట్టి దేవదాసును పట్టాలపైకి తీసుకొచ్చారు. అంతా తప్పుకున్నా సరే తనే సోలోగా నిర్మాతగా మారి దేవదాసు నిర్మించారు. అంతే కాదు శరత్ రాసిన నవలను అంత కంటే అద్భుతంగా తెరపై చూపించడం ఈసినిమాకే సాధ్యం అయ్యింది. ఒక్కొక్క పాత్ర ఆణిముత్యంలా మెరిసింది. ఒక హృదయం పగిలిపోతే మళ్లీ అతకదు అనే నిజాన్ని, ఎంతో అద్భుతంగా చూపించగలిగారు. ప్రేమ కు ఎంత పవర్ ఉంటుంది, దానికి ఎంత గౌరవం ఉంటుంతో ఈసినిమా ద్వారా తెలిపే ప్రయత్నం చేశారు. పార్వతి పెళ్లి చేసుకున్న తరువాత దేవదాసుకుని వరించడానికి ఎంతో మంది అమ్మాయిలు రెడీగా ఉంటారు. కాని అతను ఈ జీవితానికి పార్వతి తప్ప మరొకరికి చోటు లేదు, ఈ జీవితం ఇంతే అని ఆ ప్రేమకు గౌరవం ఇచ్చాడు. 18 ఏళ్ళ వయస్సులో ముసలివాడిని పెళ్లాడిన సావిత్రి కూడా తన జీవితం తాను చూసుకోలేదు... భర్త, అతని పిల్లలు, కుటుంబం కోసమే తన లైఫ్ ను త్యాగం చేసింది. దేవదాసు ప్రేమలో నిజాయితిని చూసి ఒక వేశ్య చలించిపోయిందంటే, ఆ ప్రేమలో ఎంత నిజాయితీ ఉంది. ఇలాంటి అంశాలను ఆకాలానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లేన్ రాసుకున్నారు దర్శకుడు. ఈ కథకు ఏఎన్నార్, సావిత్రి నటన, మిగిలిన వారి సపోర్ట్ అద్భుతం అని చెప్పాలి. అంతే కాదు ఈసినిమాలో మరో విశేషం చెప్పుకోవాలి ఈ సినిమాలో ఎక్కడా దేవదాసు-పార్వతి ప్రేమిస్తున్నాననే విషయాన్ని చెప్పుకోరు. కథ అలా సాగిపోతుందంతే.
నటీనటుల విషయానికి వస్తే..
ఈసినిమాలో అందరు సీనియర్లే నటించారు. ఎవరిని వేలు పెట్టి చూపించడానికి లేదు. ప్రతీ ఒక్కరు అద్భుతమనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈసినిమా కోసం ఏఎన్నార్ చేసిన సాహసాల గురించి చెప్పుకోవాలి. అప్పటికి తాగడం అలవాటు లేని అక్కినేని నాగేశ్వరావు తాగుబోతు పాత్రకోసం రాత్రి నిద్రపోకుండా తన ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మరీ ఈ పాత్రలో నటించారు. సరిగ్గా నిద్రలేక, తిండి కూడా తినకపోవడంతో.. దేవదాసు పాత్రకోసం కావల్సిన లుక్ ను నేచురల్ గానే ఆయన సాధించాడు. సినిమాలో పాత్ర కోసం ఆయన అంత సాహసం చేశాడు కాబట్టే ఆసినిమా అంత అద్భుతంగా వచ్చింది. ఇక పార్వతి పాత్రలో సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఈ పాత్ర కోసం జమున, షావుకారు జానకీలను అనుకున్నారట. కాని సావిత్రిని తీసుకోవడంవల్లే ఆ పాత్రకు ఆమె అలా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఈ పాత్ర చేసే సమయానికి సావిత్రి వయస్సు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. అయినా సరే ఆమె నటనలో ఎంత పరిపక్వత కనిపించిందంటే.. సీనియర్లు కూడా అంతలా నటించలేరేమో అన్నట్టుగా చేసి చూపించింది సావిత్రి. ఇక జమీందారు నారాయణ రావు గా యస్.వీ.రంగారావు, సావిత్రిని పెళ్లి చేసుకున్న మరో జమీందారు భుజంగరావు గాసి.యస్.ఆర్. ఆంజనేయులు, ఏఎన్నార్ స్నేహితుడు భగవాన్ గా శివరాం పేకేటి, వేశ్య పాత్రలో లలిత ఇలా అంతా సీనియర్ తారలు ఈసినిమాలో వారి పాత్రలకు ప్రాణం పోశారు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈసినిమా తెలుగులో మాత్రమే కాదు తమిళ నాట కూడా సంచలనం సృష్టించింది.
పాత్ర కోసం సాహసం చేసిన అక్కినేని నాగేశ్వరావు
దేవదాసు సినిమాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓవైపు సినిమా షూటింగ్ అవుతుంటే, మరోవైపు విమర్శలు వచ్చాయి. తాగుబోతు పాత్ర ఎవరు చూస్తారు అని అన్నారు. అప్పటి వరకూ ప్రేమ సినిమాలు చేసిన నాగేశ్వరరావును దేవదాసుగా చూడలేమంటూ చాలా విమర్శలు, సెటైర్లు వచ్చాయి. దాంతో ఈ పాత్రను అక్కినేని నాగేశ్వరావు ఛాలెంజ్ గా తీసుకున్నారు. దేవదాసు ను ఓన్ చేసుకోవడం కోసం దానిపై రీసెర్చ్ చేశారు. బెంగాలి నవలను తెలుగులో అనువదించిన చక్రపాణి వద్దకెళ్లి దేవదాసు పాత్రలో లోతు తెలుసుకున్నారు. తాగుబోతు లుక్స్ లో, నీరసించిన కళ్లతో కనిపించడం కోసం రాత్రివేళల్లో షూటింగ్స్ చేశారు. ఇక క్లైమాక్స్ కోసమైతే 2 పూటలు భోజనం మానేశారు ఏఎన్నార్. అలా నిజంగానే నీరసించిపోయి నటించారు. సినిమా తరువాత ఆయన కోలుకోవడానికి 2 వారాల పైనే పట్టింది. దేవదాసు పాత్రలో ఏఎన్నార్ ను చూసిన ఆడియన్స్ అక్కినేని నిజంగా తాగారని అనుకునేవారు. నిజానికి ఆ టైమ్ కు అక్కినేనికి మద్యం అలవాటు లేదు. ఆయన దేవదాసు పాత్రలో ఎంతలా లీనమయ్యారంటే.. సినిమా రిలీజ్ తర్వాత అతిగా తాగొద్దంటూ ఏఎన్నార్ కు వేలకొలదీ ఉత్తరాలొచ్చాయి. దేవదాసు పాత్ర కోసం ఏఎన్నార్ కష్టం ఫలించింది అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు.
టెక్నికల్ టీమ్ అద్బుతం
ఇక ఈ సినిమాను వేదాంతం రాఘవయ్య డైరెక్ట్ చేసిన తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బెంగాలీ నవలను తెలుగులో రాయించి. దానికి మన తెలుగు ఫ్లేవర్ ను ఆడ్ చేసి, అద్భుతమైన స్క్రీన్ ప్లేను రాసుకున్నారు రాఘవయ్య. సున్నితమైన అంశాన్ని తీసుకుంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆయనకు తెలుసు. ఈ సినిమా ఆడదు అని ఎంతో మంది భయపెట్టినా కూడా తన పని తాను సిన్సియర్ గా చేసుకుంటూ వెళ్లిపోయారు వేదాంతం. ఇక భగ్నప్రేమికుల కథలు తెలుగులో పనిచేయవని చాలామంది భయపెట్టారు. దీంతో మొదటి షెడ్యూల్ అవ్వగానే సినిమా ఆపేశారు. మధ్యలో మరో సినిమా చేశారు. ఆ తర్వాత నిర్మాత డీఎల్ నారాయణ పట్టుబట్టి దేవదాసును పట్టాలపైకి తీసుకొచ్చారు. అంతా తప్పుకున్నా సరే తనే సోలోగా నిర్మాతగా మారి దేవదాసు నిర్మించారు. నిర్మాణం వ్యయం విషయంలో కూడా ఏమాత్రం తగ్గలేదు టీమ్.
దేవదాసు పాటలు ఎవర్ గ్రీన్
దేవదాసు సినిమా అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి పాటలే. ఈసినిమా పాటలు ఎంతలా ప్రభావం చూపాయంటే.. అప్పటి జనాలు ఈపాటలకు ఉర్రూతలూగిపోయారు. ప్రేమ విఫలం అయితే చాలు దేవదాసు పాటలు పెట్టుకుని బోరుమని ఏడ్చినవారు ఉన్నారు. ఈ సినిమా గురించి, పాటల గురించి ఏకంగా ఇళయరాజాలాంటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఓ సందర్భంలో చెప్పిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే దేవదాసు షూటింగ్ లో ఓ ప్రాబ్లమ్ వచ్చింది. షూటింగ్ లోనే మరో ఘోరం కూడా జరిగింది. సంగీత దర్శకుడు సీఆర్ సుబ్బురామన్ మరణించారు. దీంతో దేవదాసులో మిగిలిన 2 పాటల్ని ఆయన శిష్యుడు ఎమ్మెస్ విశ్వనాథన్ కంపోజ్ చేసి పెట్టారు. ఆ పాటలే అందం చూడవయా.. జగమే మాయ. ఈ పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగమే మాయ పాటకోసమైతే ఘంటసాల రెండు మూడు నెలలు కష్టపడాల్సి వచ్చింది. ఎమ్మెస్ విశ్వనాథన్ చేసిన ట్యూన్, ఆయన పనితనం చూసి ఘంటసాల పొంగిపోయారు. పాటలు ఇప్పటికీ జనాలు మర్చిపోలేక పోతున్నారంటే, ఆనాడు వారు పడ్డ కష్టమే కారణం.
ఒక దేవదాసు 10 సినిమాలు
1953 జూన్ 26న విడుదలైన దేవదాసుకు ఫస్ట్ డే ప్లాప్ టాక్ వచ్చింది. సినిమా బాలేదు అన్నారు. టీమ్ లో భయం పట్టుకుంది. ఇక వారం తిరిగే సరికి దేవదాసు సంచలనంగా మారింది. నెగెటివ్ కాస్తా పాజిటివ్ టాక్ గా మారి, అఖండ విజయాన్నందుకుంది. ఇక ఈ సినిమాను చూసి దేశంలో అన్ని భాషల్లో దేవదాసు సినిమాలు తియ్యడం స్టార్ట్ చేశారు. కాని ఈసినిమాను డామినేట్ చేసే విధంగా ఎవరు దేవదాసును తీయ్యలేకపోయారు. 1928 నుంచి ఇప్పటివరకూ బెంగాలి, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 12 సార్లు ‘దేవదాసు’ కథ తెరకెక్కింది. వీటన్నింటిలో తెలుగు ‘దేవదాసు’ నంబర్ వన్ గా నిలిచింది. దానికి కారణం అక్కినేని నటన.
1937లో హిందీలో పి.సి.బారువా దేవదాసు చిత్రాన్ని నిర్మించారు. కె.ఎల్.సైగల్, జమున హీరోహీరోయిన్లు గా నటించార. ఇక తమిళంలో అదే ఏడాది దేవదాసు ను ప్రయత్నించారు. సి.వి.రావు దేవదాసుగా నటించారు. కాని పెద్దగా ప్రభావం చూపించలేదు. 1955లో మళ్లీ హిందీలో దిలీప్ కుమార్, వైజయంతిమాల జంటగా దేవదాసు వచ్చింది. ఆతరువాత హిందీలోనే షారుక్ ఖాన్, ఐశ్వర్యారాయ్, మాధురీ దీక్షిత్‌లతో 2002లో మొడ్రన్ దేవదాసును తెరకెక్కించారు. ఈసినిమా పర్వాలేదు అనిపించింది. ఇక మొత్తంగా అన్ని భాషల్లో 10 సార్లు దేవదాసును తీశారు. ఇక తెలుగులో కూడా సూపర్ స్టార్ కృష్ణ 1974లో దేవదాసు సినిమాను ప్రయత్నం చేశారు. ఈ సినిమా విడుదలై 50రోజులు ఆడితే, అదే సమయంలో రీరిలీజ్ అయిన ఏఎన్నార్ దేవదాసు 200 రోజులు ఆడింది.
ముగింపు
దేవదాసు అంటే ఇప్పటికీ ఒక పోస్టర్ గుర్తుకు వస్తుంది. మాసిపోయిన గడ్డం, భుజంపై శాలువా, ఒక చేతిలో సిగరెట్టు, మరో చేతిలో మందు గ్లాసు, పక్కన కుక్క. ఈ పోస్టర్ జనాలలో ముద్రపడిపోయింది. దేవదాసు అంటే తాగుబోతులకు ఆదర్శం అన్న విమర్శలు వచ్చినా.. ఆ దేవదాసులా ప్రేమించే మనసు ఇప్పటి వారిలో ఎవరికి ఉంది.? దేవదాసు ఆకారం కాదు, అతని బాధను మనసులోకి తీసుకోగలిగేవారు ఎవరున్నారు. దేవదాసు పాత్రలో ఆ పెయిన్ అప్పటి ఆడియన్స్ అర్ధం చేసుకున్నారు కాబట్టి, ఈసినిమా చరిత్ర సృష్టించింది. రిలీజ్ అయ్యి 72 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచిపోయింది. అందుకే ఒక్క సారి యూట్యూబ్ లోకి వెళ్ళి మనస్పూర్తిగా దేవదాసు సినిమాను చూడండి. అద్భుతం మీ కళ్ల ముందు ఆవిష్క్రుతం అవుతుంది.