- Home
- Entertainment
- వేటగాడు రివ్యూ, తన కంటే 40 ఏళ్లు చిన్నదైన శ్రీదేవితో ఎన్టీఆర్ రొమాన్స్, రికార్డులతో ఆటాడిన వేటాగాడు
వేటగాడు రివ్యూ, తన కంటే 40 ఏళ్లు చిన్నదైన శ్రీదేవితో ఎన్టీఆర్ రొమాన్స్, రికార్డులతో ఆటాడిన వేటాగాడు
నందమూరి నటశిఖరం తారకరామారావు సినిమాల్లో వేటగాడు ఓ అద్భుతమని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు, అప్పట్లో యువతను ఆకట్టుకునేలా తీసిన ఈసినిమా రివ్యూ గురించి, నటీనటులు, టెక్నీషియన్స్ గురించి చూద్దాం.

ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు. టాలీవుడ్ కీర్తి శిఖరంగా ఎన్టీఆర్ పేరు ఎప్పుడూ మారుమోగుతూనే ఉంటుంది. సినిమాలలో ఆయన చేసిన ప్రయోగాలు ఎవరికీ సాధ్యంకావు. మైథలాజికల్ మూవీస్ తో పాటు సాంఘిక సినిమాలు కూడా పరుగులు పెట్టించిన ఘనత ఎన్టీఆర్ సొంతం. యూత్ ను ఆకట్టుకునేలా ప్రేమకథలను కూడా ఎన్టీఆర్ అద్భుతంగా రక్తి కట్టించేవారు. యాక్టింగ్, రొమాన్స్, డాన్స్ ఏ విషయంలో అయినా పెద్దాయన రూటేసెపరేట్ గా ఉండేది. అలా ఆయన చేసిన సూపర్ డూపర్ సినిమాలలో వేటగాడు కూడా ఒకటి. ఈసినిమా అప్పటి యూత్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించి రికార్డులను వేటాడింది.
శ్రీదేవి తో ఎన్టీఆర్ నటించడంపై విమర్శలు
నందమూరి తారక రామారావు హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా వేటగాడు. 1979లో విడుదలై విజయవంతమైన తెలుగు సినిమా ఇది. రోజా మూవీస్ పతాకంపై అర్జునరాజు, శివరామరాజు నిర్మాతలుగా, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వేటగాడు. ఎన్.టి.ఆర్.కు జంటగా శ్రీదేవి నటించిన తొలి చిత్రం ఇది. ఈసినిమాలో ఎన్టీఆర్ తో శ్రీదేవి నటించడంపై ఎన్నో రకాల కామెంట్స్ వచ్చాయి. అయినా సరే ఈ విషయంలో పెద్దాయన తగ్గేదే లేదు అనేశారు. తన కంటే దాదాపు 40 ఏళ్లు చిన్నదైన హీరోయిన్ తో ఎన్టీఆర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కొన్ని విమర్శలకు దారి తీసింది. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ మనవరాలిగా నటించిన శ్రీదేవి. వేటగాడు సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా ఆడిపాడింది. అప్పట్లో ఇలాంటి సాహసాలు చేయాలంటే ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అన్నట్టు ఉండేది?
వేటగాడు సినిమా కథ విషయానికి వస్తే?
జగ్గయ్య ఒక జమిందారు. ఆయన అడవి ప్రాంతంలో పెద్ద ఇంటిని నిర్మించుకుంటాడు. అయితే మరో జమిందారు అయిన కాంతారావు జగయ్య దగ్గర ఉన్న విలువైన హారాన్ని అడుగుతాడు. అది అతని భార్య దగ్గర ఉంటుంది. ఆ హారన్ని ఇవ్వడానికి జగ్గయ్య తిరస్కరిస్తాడు. హారంతో పాటు గుడికి వెళ్ళిన జగ్గయ్య భార్య (పుష్పలత) ను దివాను (రావుగోపాలరావు) ను కాంతారావు కిడ్నాప్ చేసేప్రయత్నం చేసినట్టు చూపిస్తారు. ఈ పెనుగులాటలో ఆ హారాన్ని ఈలోపు పుష్పలత ఒక గిరిజనుడికి (చలపతిరావు) ఇచ్చి జాగ్రత్త చేయమంటుంది. కాని ఇది కాంతారావు చేయించాడా లేదా అనేది ఆతరువాత తెలుస్తుంది. ఇక పోతే ఆ హారాని అడిగిన కాంతారావే ఆమెను హారం కోసం హత్య చేసి ఉంటాడని జగ్గయ్యతో దీవాను చెబుతాడు. అది నమ్మి జగ్గయ్య కాంతారావు పట్ల ద్వేషం పెంచుకుని అడవిలో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. జగ్గయ్య అలా వెళ్లిపోవడంతో, ఆ బంగ్లామొత్తం దివాను ఆధీనం చేసుకుని, అక్కడ అధికారం చెలాయిస్తూంటాడు. అక్రమ వ్యాపారాలు కూడా మొదలు పెడతాడు. ఇక ఆతరువాత కాలంలో కథలో రామారావు, కాంతారావు కొడుకుగా ఎంటర్ అవుతాడు, వేట అతనికి ఆట. శ్రీదేవి జగ్గయ్య కూతురుగా ఎంట్రీ ఇస్తుంది. వేటకు అడవికి బయలుదేరిన రామారావుకు తన ఎస్టేటుకు బయలుదేరిన శ్రీదేవి కలుస్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది? రావుగోపాలరావు కొడుకు సత్యనారాయణ. అతనికి శ్రీదేవిని పెళ్ళి చేసి వారి ఆస్తి కాజేయాలని దీవాను ఆశ. దివాను చేసే అక్రమ వ్యాపారాలు సంగతి ఏంటి? పుష్పలత ఏమైంది? నిజంగా కాంతారావు చంపేశాడా? హారం ఎవరి పాలైంది, జగ్గయ్యకు అపోహలు ఎలా తొలిగాయన్నది సినిమా కథ.
వేటగాడు రివ్యూ
ఈసినిమాలో ప్రతీ సీన్ ను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు రాఘవేంద్రరావు. సినిమాలో యూత్ ను ఆకట్టుకునేలా ప్రేమ కథ, ఫ్యామిలీ ఆడియన్స్ ను రీచ్ అయ్యేలా ఎమోషన్స్, యాక్షన్ ప్రియులను అలరించేలా ఫైట్స్, ఇలా అనని రకాలా ఎలిమెంట్స్ పక్కా టైమింగ్ ప్రకారం వచ్చేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. అందుకు తగ్గట్టుగా కథ కూడా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యింది. తన కంటే 40 ఏళ్లు చిన్నదైన శ్రీదేవితో ఎన్టీఆర్ నడిపిన ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్, వారి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, పాటలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. కథలో ఎక్కడ పాట అవసరమో అక్కడే అద్భుతమైన పాటలను పెట్టించి సినిమాకు మరింతగా ముస్తాబు చేశారు. వేటగాడు సినిమాలో లవ్ , యాక్షన్, సెంటిమెంట్ తో పాటు కామెడీ కూడా అద్భుతంగా పండింది. తమిళ కమెడియన్ నగేష్, అల్లు రామలింగయ్య మద్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు గిలిగింతలు పెడతాయి. ఇక అడవుల్లో తీసిన సన్నివేశాలు ఈసినిమాకు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి.
నటీనటుల విషయానికి వస్తే?
ఈసినిమాలో నటించినవారంతా మహామహులే. ఎన్టీఆర్, శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి నటన అందరికితెలిసిందే. ఈసినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. వయసు విషయంలో విమర్శలు వచ్చినా.. డోంట్ కేర్ అని అన్నగారు సినిమా కోసం రంగంలోకి దిగారు. ఇక ఆటలు, పాటలు సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఎంత అద్భుతంగా పండిందో చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఈసినిమాలో ఇక రావు గోపాలరావు, సత్యనారాయణ విలనిజం, పండరీబాయి, గాయత్రీదేవి సెంటిమెంట్, కాంతారావు, జగ్గయ్యల నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నగేష్, అల్లు రామలింగయ్య కామెడీ టైమింగ్ కడుపుబ్బా నవ్విస్తుంది. సినిమా కథకు స్క్రీన్ ప్లేతో రాఘవేంద్రరావు బొమ్మను చేస్తే, నటనతో వీరు ప్రాణం పోశారని చెప్పవచ్చు. ప్రత్యేకంగా రావు గోపాలరావు ప్రాసతో మాట్లాడే సంభాషణలు జనరంజకమయ్యాయి. ప్రతీ ఒక్కరు తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. సినిమాను సక్సెస్ వైపు నడిపించారు.
టెక్నిషియన్స్ ఎలా పనిచేశారు?
ఎప్పుడు సినిమా చేసినా కాస్త ముందు తరం వారిలా ఆలోచిస్తుంటాడు దర్శకుడు రాఘవేంద్రరావు. ఈసినిమా విషయంలో కూడా అదే ఆలోచించాడు. ఆతరువాతి తరం వారికి కూడా కావలసిన ఎలిమెంట్స్ ను వేటగాడు సినిమాలో చూపించగలిగాడు. ప్రేమ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించడంలో కోవెలమూడివారిది అచ్చివచ్చిన చేయి కావడంతో, వేటగాడు సినిమా కూడా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇక ఈసినిమాకు పాటుల ప్రాణం పోశాయి. మరీ ముఖ్యంగా ఈసినిమాలో ఆకుచాటు పిందె తడిసే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. చక్రవర్తి సంగీతం ఇప్పటికీ తెలుగువారి మనసుల్లో అలా నిలిచిపోయింది ఈ పాటల ద్వారానే. ఇక ఈసినిమాకు జంధ్యాల సంభాషణలు వెయ్యి ఏనుగుల బలన్ని అందించాయి. కేఎస్ ప్రకాష్ కెమెరా పనితనం, సలీం డాన్స్ లు, కోటగిరి ఎడిటింగ్ ఇలా అన్ని రకాలుగా సినిమా ప్లాస్ అయ్యిందని చెప్పవచ్చు
రికార్డుల వేటగాడు
వేటగాడు సినిమా ఆరోజుల్లో థియేటర్లను అల్లాడించేసింది. దాదాపు 50 కేంద్రాలలో 50 రోజులు ఆడిన ఈసినిమా, 30 కేంద్రాలలో 4 ఆటలతో 100 రోజులు పూర్తి చేసుకుని, శతదినోత్సవాన్ని విజయవంతం చేసింది. అంతే కాదు 6 థియేటర్లలో 175 రోజులు, 3 కేంద్రాలలో 200 రోజులు ఆడింది వేటగాడు సినిమా. ఇక హైదరాబాద్ లో 400 రోజులకు పైగా ఆడిన సినిమాగా వేటగాడు సరికొత్త రికార్డు సాధించింది. ఇక ఈసినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి వారమే 20 లక్షలకు పైగా వసూలు చేసిన ఈసినిమా 50 రోజులు పూర్తయ్యేనాటికి 1 కోటి రూపాయలు వసూళ్లు సాధించినట్టు సమాచారం.
వేటగాడు ఎక్కడ చూడవచ్చంటే?
పాతతరం సినిమా అని వదిలిపెట్టకుండా మనసు పెట్టి చూస్తే.. ఈ తరం సినిమాలకంటే అద్భుతాలెన్నో అప్పటి సినిమాలలో కనిపిస్తుంటాయి. అలా చూడదగ్గ సినిమాల్లో వేటగాడు కూడా ఒకటి. యువతను ఆకట్టుకునే అంశాలు ఈసినిమాలో ఎన్నో ఉన్నాయి. ఈమూవీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఒక సారి అలా లుక్కేయండి మరి.