30 కోట్లు బడ్జెట్, 50 కోట్లకు డీల్, బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న డీమోంటె కాలనీ 3
'డీమోంటె కాలనీ' సిరీస్ వరుస విజయాలతో షాక్ ఇస్తోంది. ఈ సిరిస్ లో వస్తోన్న మరో సినిమా 'డీమోంటె కాలనీ 3' భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు 50 కోట్లకు అమ్ముడు పోయాయి. ఇంతకీ కొన్నది ఎవరంటే?

విజయపథంలో డీమోంటె కాలనీ సిరీస్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హారర్ థ్రిల్లర్ జానర్‌లో 'డీమోంటె కాలనీ' ఒక ప్రత్యేక ముద్ర వేసింది. 2015లో దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్‌నిధి హీరోగా వచ్చిన మొదటి భాగం, చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ వసూళ్లను సాధించింది. దానికి కొనసాగింపుగా సుమారు 9 ఏళ్ల తర్వాత 2024లో విడుదలైన 'డీమోంటె కాలనీ 2' సినిమా కూడా విమర్శకుల ప్రశంసలతో పాటు, కమర్షియల్‌గానూ మంచి విజయం సాధించింది. ఈ వరుస విజయాలే ఇప్పుడు రాబోతున్న 'డీమోంటె కాలనీ 3' సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి.
జీ సంస్థ భారీ ఒప్పందం
ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండగా, సినిమా వ్యాపారం గురించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను ప్రముఖ మీడియా సంస్థ జీ (Zee) గట్టి పోటీ మధ్య దక్కించుకుంది. సుమారు 50 కోట్ల రూపాయలకు ఈ ఒప్పందం కుదిరినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అరుళ్‌నిధి కెరీర్‌లో ఒక సినిమా డిజిటల్, టెలివిజన్ హక్కులు ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడవడం ఇదే మొదటిసారి.
30 కోట్లు పెడితే.. 50 కోట్లు..
అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్‌నిధి మరోసారి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, అరుణ్ పాండియన్, మీనాక్షి గోవిందరాజన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను 30 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా.. డిజిటల్, శాటిలైట్ హక్కులకే 50 కోట్లు వచ్చాయి.రిలీజ్ అయితే కలెక్షన్లు ఏ రేంజ్ లో వస్తాయా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, గత భాగాల కన్నా మరింత భయానకంగా ఉంటుందని స్పష్టం చేసింది. రెండో భాగం చివర్లో ఉన్న ట్విస్టులు, మూడో భాగం కథను మరో స్థాయికి తీసుకెళ్తాయని అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
డీమోంటె కాలనీ సిరీస్ పై చర్చ
సాధారణంగా పెద్ద స్టార్ల సినిమాలకు మాత్రమే హక్కుల కోసం ఇంత పెద్ద మొత్తాలు చెల్లిస్తారు. కానీ, ఒక హారర్ సిరీస్ సినిమాకు ఇన్ని కోట్లు ఇవ్వడం, మంచి కథ ఉంటే మార్కెట్ విలువ కూడా పెరుగుతుందని నిరూపించింది. ఈ మెగా డీల్ వల్ల 'డీమోంటె కాలనీ 3' సినిమా విడుదలకు ముందే లాభదాయకమైన ప్రాజెక్ట్‌గా మారింది. ఇది కోలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

