అల్లు అర్జున్ హంగామా చేయకపోతే ఇంత గొడవ అయ్యేదే కాదు: సీఎం రేవంత్‌రెడ్డి
పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ హంగామా చేయకుండా సినిమా చూసి వెళ్లిపోయుంటే ఇంత గొడవ జరిగేది కాదని, ఈ ఘటనకు బాధ్యులెవరో ప్రభుత్వం చూస్తుందని అన్నారు.
CM Revanth Reddy, Allu Arjun, arrest
పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంటున్న నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)స్పందించారు.
అల్లు అర్జున్ (Allu Arjun) థియేటర్‌కు వచ్చి ఎలాంటి హంగామా చేయకుండా సినిమా చూసి వెళ్లిపోయి ఉంటే.. ఇంత గొడవ అయ్యేది కాదని ఆయన అన్నారు. ‘ఆజ్‌తక్’ నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న ఆయన.. అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై మాట్లాడారు.
allu arjun
అల్లు అర్జున్‌ని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేయడంతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. ఈ విషయం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అన్ని పరిశ్రమల్లోనూ చర్చనీయాంశమైంది. మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, నాగబాబుతోపాటు పలువురు సినీ ప్రముఖులు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుని ఆయన్ను ఓదార్చారు. సాయంత్రం కె.రాఘవేంద్రరావు, నటుడు రానా తదితరులు కూడా వెళ్లారు. పలువురు సినీ ప్రముఖులు అర్జున్‌కి సంఘీభావం ప్రకటించారు. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి స్పందన బయిటకు వచ్చింది.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘ఈ దేశంలో సల్మాన్‌ఖాన్, సంజయ్‌దత్‌లు ఎందుకు అరెస్టు అయ్యారు. ఒక సాధారణ పౌరుడి దగ్గరి నుంచి ప్రధాని వరకూ.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ సమానంగా వర్తిస్తుంది. ‘పుష్ప2’ విడుదల సందర్భంగా బెనిఫిట్ షోకే కాకుండా టికెట్ ధరలు పెంచుకోవడానికీ మేమే అనుమతి ఇచ్చాం.
అయితే, ఆ షోకు ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్ అక్కడకు వచ్చారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ క్రమంలో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి, థియేటర్, మేనేజ్‌మెంట్ వాళ్లను అరెస్ట్ చేశారు. 10 రోజుల తర్వాత అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది. కావాలని సినిమా నటుడిని అరెస్టు చేశారని చర్చ మొదలు పెట్టారు. అతడు సినిమా స్టారా? పొలిటికల్ స్టారా? అన్న విషయాన్ని మా ప్రభుత్వం చూడదు. నేరం ఎవరు చేశారన్న దాన్నే చూస్తాం’’ అన్నారు.
అలాగే ‘‘అక్కడ అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చి.. సినిమా మాత్రమే చూడలేదు. కారులో నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ ర్యాలీలా అభివాదం చేస్తూ వెళ్లారు. ఆయన ఎలాంటి హంగామా లేకుండా వచ్చి సినిమా చూసి ఉంటే ఈ గొడవ అయ్యేదే కాదు. అయినా కూడా జరిగిన ఘటనకు సంబంధించి ఏ11 కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన కారణంగా ఒక మహిళ చనిపోయింది. దీనికి బాధ్యులు ఎవరు? 9 ఏళ్ల పిల్లాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు?
అల్లు అర్జున్ సినిమా చూడాలనుకుంటే స్టూడియోలో స్పెషల్ షో వేసుకుని చూడొచ్చు. ఇంట్లో కూర్చొని కూడా చూడొచ్చు. మీరు ప్రేక్షకులు, అభిమానులతో కలిసి చూడాలనుకుంటే, ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేదంటే, మేనేజ్‌మెంట్‌కు సమాచారం ఇస్తే, వాళ్లు ఏర్పాట్లు చూసుకుంటారు. అలా కాకుండా సడెన్‌గా వచ్చేస్తే, ఉన్న కొద్దిమంది సిబ్బందితో వాళ్లు ఎలా సిద్ధం కాగలరు’’ అని చెప్పుకొచ్చారు.
allu arjun arrest
ఇక ‘‘అల్లు అర్జున్ చిన్నప్పట్నుంచి నాకు తెలుసు. కావాలని ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేస్తాం? అల్లు అర్జున్ మేనమామ చిరంజీవి కాంగ్రెస్ నేత. ఆయన సొంతమామ చంద్రశేఖర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అల్లు అర్జున్ సతీమణి కుటుంబం మాకు బంధువులవుతారు.
పోలీసులు చేయాల్సిన పని వాళ్లు చేస్తారు. లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుచుకుంటారు. అల్లు అర్జున్ అరెస్టయితే, ఇంత చర్చిస్తున్నారు కదా! ఆ ఘటనలో చనిపోయిన మహిళ కుటుంబం ఎలా ఉంది? వాళ్ల పరిస్థితి ఏంటి? తీవ్రంగా గాయపడిన ఆ పిల్లాడు ఎలా ఉన్నాడు? అతడు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఆ తర్వాత ఎలా బతుకుతాడు? అన్న విషయాలను ఒక్కరు కూడా అడగలేదు.
అల్లు అర్జున్ ఫిల్మ్ స్టార్. సినిమాలు చేయడం ఆయన వ్యాపారం. డబ్బులు పెడతారు.. సంపాదిస్తారు. మీకు ఏమొస్తుంది? నాకేమొస్తుంది? రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులు ఉన్నారు. ప్లాట్‌లు అమ్ముతారు.. డబ్బులు సంపాదిస్తారు. ఈ దేశం కోసం భారత్-పాకిస్థాన్ బోర్డర్‌కు వెళ్లి ఏమైనా యుద్ధం చేశారా? మూవీ తీస్తున్నారు. డబ్బులు వస్తున్నాయి. నా ఫేవరెట్ నటుడు కృష్ణ. ఆయన ఇప్పుడు లేరు. నాకు నేనే పెద్ద స్టార్‌ని. నాకంటూ అభిమానులు ఉండాలి కానీ, నేనెవరికీ అభిమానిని కాదు.’’ అని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు.