- Home
- Entertainment
- Revanth Reddy: `ఫూలే` మూవీ కోసం ఆర్టీసీ బస్‌లో రేవంత్ రెడ్డి, మంత్రులు.. సినిమా చూశాక సీఎం రియాక్షన్ ఇదే
Revanth Reddy: `ఫూలే` మూవీ కోసం ఆర్టీసీ బస్‌లో రేవంత్ రెడ్డి, మంత్రులు.. సినిమా చూశాక సీఎం రియాక్షన్ ఇదే
Revanth Reddy: సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా 'పూలే' సినిమాను రూపొందించారు. ఈ మూవీని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా వీక్షించారు.

ఫూలే సినిమా చూసిన సీఎం రేవంత్ రెడ్డి
ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాలతో తీరికలేకుండా గడిపే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం సాయంత్రం కాస్త రిలాక్ట్ అయ్యారు. సరదాగా అందరు కలిసి వచ్చి సినిమా చూశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి `ఫూలే` సినిమా చూశారు. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా 'పూలే' సినిమాను రూపొందించారు.
అనంత్ మహదేవన్ దర్శకత్వంలో ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర నిర్మించిన ఈ మూవీ గతేడాది ఏప్రిల్ 25న హిందీలో విడుదలైంది. చిత్రంలో జ్యోతిరావు పూలేగా ప్రతీక్ గాంధీ, సావిత్రీబాయి పూలేగా పత్రలేఖ పాల్ నటించారు. ఈ సినిమాని వీక్షించిన వారిలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకట స్వామి, శ్రీధర్ బాబు, పొన్నంప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఫూలే మూవీపై సీఎం రియాక్షన్ ఇదే
సినిమా వీక్షించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కుల నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతులు గొప్ప పోరాటం చేశారని, మహిళా విద్య కోసం వారు ఎదుర్కొన్న సవాళ్లను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని , పూలే దంపతుల సామాజిక సేవా గుణం, వారి జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం స్పందన ఇదే
డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మా ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గ సహచరులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పూలే సినిమా ప్రత్యేక ప్రదర్శనకు ఆహ్వానించిన మా మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా భారతీయ సమాజానికి అద్భుతమైన సందేశాన్నిస్తుంది. మహిళా అభ్యున్నతి కోసం, ఆనాటి సమాజంలో ఉన్న కులవివక్ష ఇతర ఇబ్బందులను తట్టుకుని సమసమాజం కోసం పూలే దంపతులు వేసిన పునాదులు వేశారు. ఈ రోజు ఆ ఫలాలను, ఫలితాలనే మన స్వంతత్ర భారతదేశంలో అనుభవిస్తున్నాం. వారు వేసిన పునాదుల మీద సాగుతూ వారి ఆశయాలను, లక్ష్యాలను సాధించడంలో మా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కృషి చేస్తాం` అని చెప్పారు.
నిర్మాత పొన్నం రవిచంద్ర ఏమన్నాడంటే?
నిర్మాత, జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ , పూలే సినిమా ప్రత్యేక ప్రదర్శనకు సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం సంతోషంగా ఉంది. ఆయన రెండు గంటలకు పైగా సమయం వెచ్చించి సినిమాను చూశారు. ఈ సినిమాను ప్రతి గ్రామంలో ప్రదర్శించేలా అవకాశం కల్పించాలని కోరుతున్నాను. సమాజంలోని రుగ్మతలు తొలగించుకునేందుకు, అందరికీ విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరిలో పూలే సినిమా స్ఫూర్తిని కలిగిస్తుంది` అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ, ఇతర సినిమా టీమ్ కూడా పాల్గొన్నారు.

