- Home
- Entertainment
- ఎన్టీఆర్ ని హీరోని చేసిన నిర్మాత మరణంపై బాలయ్య ఎమోషన్ నోట్.. చంద్రబాబు, లోకేష్, మంచు విష్ణు ఏమన్నారంటే?
ఎన్టీఆర్ ని హీరోని చేసిన నిర్మాత మరణంపై బాలయ్య ఎమోషన్ నోట్.. చంద్రబాబు, లోకేష్, మంచు విష్ణు ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌ని హీరోగా పరిచయం చేసిన నిర్మాత కృష్ణవేణి మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల బాలయ్య, చంద్రబాబు, లోకేష్, నందమూరి ఫ్యామిలీ, మంచు విష్ణు సంతాపం ప్రకటిస్తూ ఎమోషనల్ నోట్‌ని పంచుకున్నారు.

తెలుగు సినిమా యుగపురుషుడు, నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు నటుడిగా వెండితెరకు పరిచయం అయిన సినిమా `మనదేశం`. ఇందులో ఆయన హీరోగా నటించగా, కృష్ణవేణి హీరోయిన్‌గా నటించింది. ఎస్వీ ప్రసాద్ దర్శకత్వం వహించారు. దీన్ని కృష్ణవేణినే నిర్మించడం విశేషం. అయితే ఈ సినిమాలో రామారావుకి ఛాన్స్ ఇచ్చింది కృష్ణవేణినే, రామారావులోని ప్రతిభని గుర్తించి ఈ అవకాశం ఇచ్చింది.
నందమూరి వంశానికి కారణమయ్యింది. తెలుగు ప్రజలకు నందమూరి వంశం తెలియడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యింది కృష్ణవేణి. ఓ రకంగా ఆమెకి నందమూరి ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటారు. అలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన కృష్ణవేణి ఆదివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె 102ఏళ్ల జీవించడం విశేషం. ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ స్పందిస్తూ సంతాం తెలియజేశారు.
Chandrababu Naidu
సినీ నిర్మాత, నటి కృష్ణవేణి మృతి బాధాకరమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్టూడియో అధినేతగా, వివిధ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, రఘుపతి వెంకయ్య అవార్డు పొందిన కృష్ణవేణి తెలుగు సినీకీర్తిని చాటారని తెలిపారు. కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్ధించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
`తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతగా గుర్తింపు పొందిన శ్రీమతి కృష్ణవేణి గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా శ్రీమతి కృష్ణవేణి గారు బహుముఖ ప్రజ్ఞ చాటుకున్నారు.
ఎన్టీఆర్, ఘంటసాల వెంకటేశ్వరరావులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. శ్రీమతి కృష్ణవేణి గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా` అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
Nandamuri Balakrishna
బాలకృష్ణ ఎమోషనల్ నోట్‌ని పంచుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటజీవితానికి తొలుత అవకాశం అందించిన కృష్ణవేణి గారు సంపూర్ణ జీవితం చాలించి శివైక్యం చెందడం బాధాకరం. కృష్ణవేణి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయం.
`మన దేశం` లాంటి గొప్ప చిత్రాలు నిర్మించి సమాజంలో ఉన్నత విలువలను పెంచడానికి కృషి చేశారు. ప్రభుత్వ పరంగా ఎన్నో అవార్డ్స్ అందుకొన్నారు. ఇటీవల ఎన్ టి ఆర్ వజ్రోత్సవ వేడుకలలో, అంతకు ముందు ఎన్ టి ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా కృష్ణవేణి గారిని ఘనంగా సత్కరించడం జరిగింది.
కృష్ణవేణి గారి మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నా` అని బాలకృష్ణ తెలిపారు.
Nara Lokesh
ఏపీ మంత్రి నారా లోకేష్ చెబుతూ, `తెలుగు చలనచిత్ర రంగంలో తమదైన ముద్ర వేసిన సినీ నిర్మాత, తొలితరం హీరోయిన్ కృష్ణవేణి మృతి బాధ కలిగించింది. శోభనాచల స్టూడియో అధినేతగా, వివిధ చిత్రాలకు నిర్మాతగా, నటిగా ఆమె ఎనలేని సేవలు అందించారు.
రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన కృష్ణవేణి తెలుగు సినీ పరిశ్రమకు వన్నె తెచ్చారు. కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధి స్తున్నా. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసున్నా` అని అన్నారు.
`మా` అధ్యక్షుడు మంచు విష్ణు స్పందిస్తూ, `తెలుగు సినిమాలో ఒక చిరు దీపం వెలిగించిన లెజెండరీ కృష్ణవేణి కలిసిన తిథి. ఆమె పరిశ్రమతో నందమూరి తారక రామారావు ని బిగ్‌స్క్రీన్ కి పరిచయం చేసి, మన ఇండస్ట్రీ కి ఒక అముల్యమైన గిఫ్ట్ ఇచ్చారు. ఆమె జ్ఞాపకాలు ఎప్పుడు మన హృదయంలో ఉండిపోతాయి. వారి ఫ్యామిలీకి నా ప్రగాఢ సంతాపం అని ట్విట్ చేశారు. నందమూరి ఫ్యామిలీ సైతం సంతాపం తెలియజేస్తున్నారు.
read more: నందమూరి ఫ్యాన్స్ కి పండగే, డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. బుల్లితెరపై దబిడి దిబిడే