Buttabomma Review: `బుట్టబొమ్మ` మూవీ రివ్యూ, రేటింగ్
మలయాళంలో విజయం సాధించిన `కప్పేలా` మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది `బుట్టబొమ్మ`. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, త్రివిక్రమ్‌కి చెందిన ఫార్చ్యూన్ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకాలపై నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కడం విశేషం. ఈ సినిమా శనివారం(ఫిబ్రవరి 4)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
చిన్న చిన్న పాయింట్లతో సినిమాలు తెరకెక్కించి హిట్లు కొడుతున్నారు నేటి తరం మేకర్స్. అయితే అలాంటి పాయింట్లు వెండితెర కంటే ఓటీటీలో మంచి ఆదరణ పొందుతున్నాయి. కానీ థియేటర్లోకి రావాలంటే పాయింట్ మాత్రమే చాలదు, అంతకు మించి ఉండాలి. అన్నీ కుదరాలి, అప్పుడే బిగ్ స్క్రీన్ ఆడియెన్స్ ని మెప్పించడం సాధ్యం. అలాంటి ఓ పాయింట్‌తోవచ్చిన సినిమా `బుట్టబొమ్మ`. మలయాళంలో విజయం సాధించిన `కప్పేలా` మూవీకిది రీమేక్. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహించగా ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, త్రివిక్రమ్‌కి చెందిన ఫార్చ్యూన్ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకాలపై నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కడం విశేషం. నూతన నటీనటులు నటించిన ఈ సినిమా శనివారం(ఫిబ్రవరి 4)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
కథః
అరకు సమీపంలోని ఓ గ్రామంలో నివసించే సత్య(అనిఖా సురేంద్రన్)ది మధ్యతరగతి ఫ్యామిలీ. తండ్రి రైస్‌మిల్లులో పనిచేస్తుండగా, తల్లి ఇంట్లోనే కుట్టుమిషన్ నడిపిస్తుంటుంది. సత్య వారికి చేదోడు వాదోగుగా ఉంటుంది. అప్పుడప్పుడు స్నేహితురాలితో కలిసి ఊరు చివరన ఉన్న కన్నయ్య(కృష్ణుడు)ని మొక్కుకుంటూ ఇంట్లో సమాన్ల కోసం అరకు వెళ్లి వస్తుంటుంది. సత్యకి పెద్ద కెమెరా ఫోన్ కొని రీల్స్ చేసి పేరుతెచ్చుకోవాలని ఉంటుంది. స్వతహాగా మంచి సింగర్ కూడా. ఈ క్రమంలో తను కుట్టుమిషన్ పనిమీద రాంగ్ నెంబర్‌కి కాల్ చేస్తుంది. అది మురళీ(సూర్య వశిష్ట) అనే ఆటో డ్రైవర్‌కి వెళ్తుంది. అతను రేడియోలో లేడీ జాకీ వాయిస్ వింటూ, ఆటో నడుపుతూ, ఆపదో ఉన్నవారికి సహాయం చేస్తుంటాడు. మంచి వాయిస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అనుకోకుండా వచ్చిన ఫోన్ లో సత్య వాయిస్ నచ్చి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. ఎట్టకేలకు ఫోన్ చేసి మాటలు కలుపుతాడు. ఇద్దరు కనెక్ట్ అయి ఫోన్‌లోనే ప్రేమించుకుంటారు. అయితే సత్యని తమ ఊర్లోనే ఉండే రైస్ మిల్లు హోనర్ కొడుకు ఇష్టపడుతుంటాడు. పెద్దల అంగీకారంతో ఎంగేజ్‌మెంట్ సెట్ అవుతుంది. కానీ సత్యకి ఆ పెళ్లి ఇష్టం లేదు. దీంతో మురళీని కలవాలనుకుంటుంది. అమ్మానాన్న ఊరెళ్లడంతో మురళీని కలిసేందుకు వైజాగ్ వెళ్తుంది. మరి అక్కడికి వెళ్లాక మురళీని కలిసిందా? అక్కడ సత్యని ఆర్కే(అర్జున్ దాస్) ఎందుకు కలిశాడు? తనేందుకు ఆమెను ఫాలో అవుతుంటాడు? చివర్లో వచ్చే ట్విస్ట్ ఏంటి? అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మిగిలిన కథ.
విశ్లేషణః
`బుట్టబొమ్మ` విలేజ్ నేపథ్యంలో సాగే సింపుల్ లవ్ స్టోరీ. మంచితనం, ప్రేమ వెనకాల దాగున్న ముసుగులను, మోసాలను ఆవిష్కరించిన చిత్రమని చెప్పొచ్చు. పాయింట్ పరంగా మంచి సందేశంతో కూడిన చిత్రమే. కానీ దాని టేకింగ్ విషయంలోనే దర్శకుడు తడబడ్డాడు. ఈ సినిమాలో ప్రేమ పేరుతో సాగే మోసాన్ని చూపించారు. కానీ దాన్ని బలంగా ఆవిష్కరించలేకపోయారు. సింపుల్ స్టోరీ కావడంతో దర్శకుడు దాన్ని మరింత రక్తికట్టించేలా ఆవిష్కరించలేకపోయారు. అంతా కూల్‌గా, స్లోగా నడిపించాడు. ఫన్ ఎలిమెంట్లు కూడా లేవు. ఏదో సీన్ బై సీన్ వచ్చిపోతుంటాయిగానీ, కట్టిపడేసే సన్నివేశాలు, ఎంగేజ్ చేసే సీన్లు ఒక్కటి కూడా లేవు. పైగా మలయాళ సినిమాకి పెద్దగా మార్పులు కూడా చేయలేదు. తెలియని చిన్న చిన్న మార్పులు తప్ప మిగిలిన ప్లాట్ మొత్తం సేమ్ టూ సేమ్.
మొదటి భాగం మొత్తం స్లోగా, బోరింగ్‌గా సాగుతుంది. ఏమాత్రం కొత్తదనం కనిపించదు. పాత్రల తీరుతెన్నులే మన చుట్టూ జరిగేలా ఉండటం కనెక్టింగ్ పాయింట్. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త సర్‌ప్రైజింగ్ అనిపిస్తుంది. సెకండాఫ్‌లో అర్జున్ దాస్ ఎంట్రీ తర్వాత కథ కాస్త వేగం పుంజుకుంటుంది. కానీ అ తర్వాత మళ్లీ మొదటికొస్తుంది. కథలో స్టఫ్ లేకపోవడంతో సీన్లని సాగదీశాడు దర్శకుడు. ఇక చివర్లో క్లైమాక్స్ ఉత్కంఠకి గురి చేస్తుంది. సూర్య, అర్జున్ దాస్ పాత్ర మధ్య గొడవలు ఆసక్తిని క్రియేట్ చేస్తాయి, అయితే వాహ్ అనిపించే సీన్లు లేవు. క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సత్య పాత్రలోని సంఘర్షణ మనల్ని ఆకర్షిస్తుంది. హీరో అనుకున్నవాడు విలన్, విలన్ అనుకున్నవాడు హీరో కావడమే సినిమాకి హైలైట్ పాయింట్. అదే సమయంలో ప్రేమ పేరుతో అమ్మాయిల అక్రమ రవాణా అంశాన్ని టచ్ చేసిన తీరు బాగుంది.
చివరి ముప్పై నిమిషాలే అసలు సినిమా. దాని కోసం మిగిలినది భరించాలా అన్నట్టుగా ఈ సినిమా సాగుతుంది. కొత్త డైరెక్టర్ అయినా, తన ప్రతిభని చూపించలేకపోయారు. రీమేక్‌ని దించాడు తప్ప తన మార్క్ ని ఎక్కడా చూపించలేకపోయారు. సినిమాలో సోల్ లేకపోవడంతో ఎమోషన్స్ పండలేదు. గుర్తిండిపోయే సీన్లు ఒక్కటి కూడా లేవు. అయితే ఇలాంటి కథలు వెండితెరపై చూడగలమా అనేది సందేహం. ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతుంది. పెద్ద తెరకి వచ్చేంత స్టఫ్ ఉందా అనేది డౌట్. పైగా కొత్త నటీనటులు, చిన్న బడ్జెట్‌తో వచ్చినప్పుడు కంటెంట్ కీలకం. అది లేకపోతే ఆడియెన్స్ లైట్ తీసుకుంటారు. `బుట్టబొమ్మ` కంటెంట్‌పై దృష్టిపెడితే, మరింత సంఘర్షణతో కూడిన సన్నివేశాలు పెడితే బాగుండేది. దీంతో ఇది షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ, సినిమాకి తక్కువగా మారిపోయింది. అయితే సినిమా నిడివి రెండు గంటలు కూడా లేకపోవడం పెద్ద రిలీఫ్.
నటీనటులుః
బాలనటిగా మెప్పించిన అనిఖా సురేంద్రన్ ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. సినిమా మొత్తం ఆమె పాత్ర మీదే నడుస్తుంది. తొలి చిత్రమైనా బలమైన పాత్రని మోసి మెప్పించింది అనిఖా. తెలుగులో ఫ్రెష్ ఫేస్ కావడంతో ఆమె, ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది. మురళీ పాత్రలో సూర్య వశిష్ట బాగా చేశాడు. తన పాత్రలోని ట్విస్ట్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆర్కేగా అర్జున్ దాస్ మెప్పించాడు. సత్య ఫ్రెండ్ పాత్రలో చేసిన అమ్మాయి కూడా మెప్పించింది. మిగిలిన పాత్రలన్నీ అలా వచ్చిపోయేవేగానీ, ఏదీ రిజిస్టర్ అయ్యేది లేదు.
టెక్నీకల్‌గాః
సంగీతం సినిమాకి పెద్ద అసెట్. గోపీసుందర్, స్వీకర్ అగస్తి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్(ఆర్‌ఆర్) ఆకట్టుకుంటాయి. కెమెరామెన్ వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ ఓ ఫ్రెష్ ఫీలింగ్‌ని కలిగిస్తుంది. సినిమాలో విషయం లేకపోవడంతో సాగదీయాల్సి వచ్చింది. ఈ విషయంలో ఎడిటర్ చేయడానికి ఏం లేదు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. రాజీపడకుండా నిర్మించారు. ఇక దర్శకుడు శౌరి చంద్రశేఖర్ సినిమాని ఎంగేజింగ్‌గా తీయలేకపోయాడు. అదే సమయంలో కథలో సోల్ మిస్ అయ్యింది. దీంతో ఆడియెన్స్ సినిమా కథతో ట్రావెల్ కాలేకపోతుంటారు. ఆ విషయంలో కేర్ తీసుకుని, మరింత డ్రామాతో తీసి ఉంటే బాగుండేది. ఈ విషయంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.
ఫైనల్‌గాః `బుట్టబొమ్మ`ని చూడాలంటే ఓపిక ఉండాల్సిందే!
రేటింగ్‌ః 2.5
నటీనటులు : అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ, ప్రేమ్ సాగర్, నవ్యా స్వామి, నర్రా శ్రీను, 'మిర్చి' కిరణ్, పమ్మి సాయి, వాసు ఇంటూరి, 'పుష్ప' జగదీశ్ తదితరులు
స్క్రీన్ ప్లే, మాటలు : గణేష్ కుమార్ రావూరి
ఛాయాగ్రహణం : వంశీ పచ్చిపులుసు
సంగీతం : గోపీసుందర్, స్వీకర్ అగస్తి
నిర్మాతలు : నాగవంశీ ఎస్. - సాయి సౌజన్య
దర్శకత్వం : శౌరి చంద్రశేఖర్ రమేష్
విడుదల తేదీ: ఫిబ్రవరి 4, 2023