హన్సిక పరిస్థితి ఇలా అయింది ఏంటి.. గృహ హింస కేసులో ఫ్యామిలీ మొత్తం ఇరుక్కుపోయారు
Hansika : నటి హన్సిక తన వ్యక్తిగత జీవితంలో ఊహించని ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. ఆమెపై నమోదైన గృహ హింస కేసులో హై కోర్టు షాకిచ్చింది. హన్సిక ఫ్యామిలీ మొత్తం వివాదంలో చిక్కుకున్నారు.

దేశముదురుతో ఎంట్రీ
యాపిల్ బ్యూటీ హన్సిక మొత్వానీ గురించి పరిచయం లేదు. పూరి జగన్నాధ్ పరిచయం చేసిన యాపిల్ బ్యూటీ గతంలో టాలీవుడ్ లో వెలుగు వెలిగింది. దేశముదురు చిత్రంలో హన్సిక టీనేజ్ లోనే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హీరోయిన్ గా అనేక అవకాశాలు అందుకుంది. హన్సిక తెలుగులో దేశముదురుతో పాటు మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ లాంటి చిత్రాల్లో నటించింది.
భర్తకి దూరంగా హన్సిక
ఇదిలా ఉండగా హన్సికకి ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో హన్సిక వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. హన్సిక 2022లో తన స్నేహితుడు సోహైల్ ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. హన్సిక తన భర్తకి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఆమె పండుగలని సైతం ఒంటరిగా సెలెబ్రేట్ చేసుకుంటూ ఫోటోలు పెడుతోంది. త్వరలో హన్సిక, సోహైల్ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వివాదంలో హన్సిక ఫ్యామిలీ
హన్సిక ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకున్నారు. హన్సిక సోదరుడు ప్రశాంత్ మొత్వానీ 2020లో బుల్లితెర నటి ముస్కాన్ జేమ్స్ ని వివాహం చేసుకున్నారు. రెండేళ్లకే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. 2022లో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ముస్కాన్ కి తన భర్త ప్రశాంత్ తో మాత్రమే కాదు అతడి తల్లి, సోదరి హన్సికతో కూడా విభేదాలు ఏర్పడ్డాయి.
గృహ హింస కేసు
ఈ క్రమంలో ముస్కాన్.. ప్రశాంత్ తో పాటు అతడి తల్లి, సోదరి హన్సిక పై గృహ హింస కేసు నమోదు చేసింది. గృహ హింస వివాదంలో ఫ్యామిలీ మొత్తం ఇరుక్కుపోయారు. ఈ కేసులో హన్సిక, ఆమె తల్లి ఇద్దరూ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
హై కోర్టులో చుక్కెదురు
అయితే ఇటీవల హన్సిక, ఆమె తల్లి తమపై ఉన్న గృహ హింస కేసుని కొట్టివేయాలని కోరుతూ బాంబే హై కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కోర్టు ముందు విచారణకు వచ్చింది. కానీ కేసు కొట్టివేయడం కుదరదని హన్సిక వేసిన క్వాష్ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. దీనితో హన్సిక, ఆమె తల్లి ఇద్దరికీ కోర్టులో చుక్కెదురు అయింది. ఒక వైపు తన భర్తో దూరంగా ఉంటున్న హన్సికకి.. ఈ గృహ హింస కేసు మరో షాక్ అనే చెప్పాలి.