భగవద్గీత వివాదంలో బిత్తిరి సత్తి.. పోలీసులకు ఫిర్యాదు.. తన ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నమంటూ నటుడు ఆవేదన..
ప్రముఖ హాస్య నటుడు, తెలంగాణ యాసతో అలరిస్తున్న బిత్తిరి సత్తి వివాదంలో ఇరుక్కున్నాడు. భగవద్గీతని కించపరిచేలా వీడియో చేశారంటూ కేసు నమోదైంది..
ప్రముఖ హాస్యనటుడు బిత్తిరి సత్తి వివాదంలో ఇరుక్కున్నాడు. `భగవద్గీత`కి సంబంధించిన వివాదం ఆయనకు చుట్టుకుంది. స్నేహం గురించి చెబుతూ చేసిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు వివాదంగా మారింది. రాష్ట్రీయ వానర సేన అనే హిందూ సంఘం దీన్ని రాద్దాంతం చేస్తుంది. ఏకంగా బిత్తిరి సత్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిత్తిరి సత్తి వీడియో హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, భగవద్గీతని కించ పరిచేలా ఉందని చెబుతూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు వానర సేన సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతుంది. మరోవైపు బిత్తిరి సత్తికి ఫోన్ చేసి బెదిరించడం పెద్ద చర్చనీయాంశం అవుతుంది.
మరి ఇంతకి ఏం జరిగిందంటే.. బిత్తిరి సత్తి తన సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ జనాలను అలరిస్తున్నారు. వ్యవసాయం, రైతులు, పేదలు, ఎడ్యూకేషన్, ఇలా విభిన్న రంగాలకు సంబంధించిన విషయాలను ఆయన ఫన్నీగా వెల్లడిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన స్నేహంపై ఓ వీడియో చేశారు. స్నేహితుల రోజుని పురస్కరించుకుని బిత్తిరి సత్తి ఓ చిన్న వీడియో క్లిప్ చేశాడు. ఇందులో స్నేహం ఎలా మారిపోయింది. ఇప్పుడు ఎలాంటి పోకడలు ఉన్నాయనేది, స్నేహితులు ఎలా ఉంటున్నారనేది వాస్తవాన్ని కళ్లకి కట్టేలా చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఈ వీడియోలో భగవద్గీతని తలపించేలా, అదే మాడ్యూలేషన్‌తో ఆయన ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం.
ఇందులో చెబుతూ, మొదట ఆయన ఓ శ్లోకాన్ని చెప్పి ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం కాదని, కేవలం ఫన్ కోసమే అని మెన్షన్ చేస్తూ `ఎట్లయితే తెప్పలుగా నిండిన చెరువులో కప్పలు పదివేలుగా వచ్చి చేరుతాయో, ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో వాని చుట్టే దోస్తులు గుంపులుగా చేరతారు` అంటూ దాని మీనింగ్‌ని వాస్తవికీతను అద్దం పట్టేలా చెప్పారు బిత్తిరి సత్తి. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. అయితే ఇందులో భగవద్గీత స్టయిల్‌ని ఫాలో కావడం, `బిల్లు గీత` అంటూ క్యాప్షన్ మెన్షన్ చేయడమే ఇప్పుడు వివాదానికి కారణమయ్యింది. దీన్ని రాష్ట్రీయ వానర సేన హిందూ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకు భగవద్గీతని కామెడీగా చేశావంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ మేరకు రాష్ట్రీయ వానరసేన సంఘానికి చెందిన ఓ నాయకుడు బిత్తిరి సత్తికి ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నం చేశారు. `బిల్లు గీత` అని ఎందుకు పెట్టారు, భగవద్గీతని ఎందుకు కించపరిచారు, గతంలో మీరు చాలా వీడియోలు చేశారు, ఎప్పుడై కాల్ చేశామా? ఇప్పుడు హిందువులను కించపరిచారని, అందుకే మాట్లాడుతున్నామని తెలిపారు. మీరు పార్టీ తరఫున మాట్లాడుతున్నారని, కంప్లెయింట్ చేసుకోమని సత్తి తెలియజేయగా, కంప్లెయింట్ ఇచ్చాం. మీకు ఎలా బుద్ది చెప్పాలో అలా చెబుతాం అంటూ వాళ్లు బెదిరించారు. మీరు హిందువులు అయితే నేనేంటి అని ప్రశ్నించారు సత్తి, దానికి నువ్వు హిందూ అయితే `బిల్లు గీత` ఎలా పెడతావంటూ ప్రశ్నించారు వానరసేనకి చెందిన నాయకుడు. నువ్వు సబ్ స్క్రైబ్ చేయకు, బ్లాక్ చేయి, చూడకు అంటూ సత్తి తెలిపారు. వాళ్లకి సత్తి సైతం ధీటుగా సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఈ ఆడియో సైతం వైరల్ అవుతుంది.
అయితే సత్తి పెట్టిన వీడియో కేవలం సరదాగానే ఉందిగానీ, అందులో ఎవరినీ కించపరిచేలా అనిపించడం లేదు. చూడబోతుంటే ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని సత్తి ఇమేజ్‌ని డ్యామేజ్ చేయబోతున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సత్తి చేసిన దాంట్లో తప్పేం లేదని వాళ్లు ఆయనకు సపోర్ట్ గా నిలవడం విశేషం. అయితే దీనిపై బిత్తిరి సత్తి స్పందిస్తూ తాను కేవలం వినోదం కోసమే ఆ వీడియ చేశానని, ఎవరినీ కించపర్చడం నా ఉద్దేశ్యం కాదని, తనకు ఆ అవసరం లేదని తెలిపారు. కొందరు కావాలని దీన్ని రాద్దాంతం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.