Bigg Boss : రెండోసారి సగంలోనే ఆగిపోయిన బిగ్‌బాస్ షో.. ఫస్ట్ ఎప్పుడో తెలుసా?
Bigg Boss: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ రెండోసారి సగంలోనే ఆగిపోయింది. 12వ ఎడిషన్ బిగ్ బాస్ ప్రారంభమైన వారం రోజులకే నిలిచిపోయింది. అంతకుముందు కూడా ఒకసారి బిగ్ బాస్ షో సగంలోనే ఆగిపోయింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Bigg Boss: బిగ్ బాస్ కు బిగ్ షాక్
Bigg Boss: హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా చేస్తున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ ఇబ్బందుల్లో పడింది. బిగ్ బాస్ 12వ ఎడిషన్ సెప్టెంబర్ 28న ప్రారంభం అయింది. అయితే, నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో అధికారులు బిగ్ బాస్ ఇంటికి తాళం వేశారు. కంటెస్టెంట్లు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.
రెవెన్యూ, పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ఉల్లంఘన కారణంగా బిగ్ బాస్ 12 షో హౌస్ కు సీల్ వేసినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన అధికారులు ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి గేట్ లాక్ చేశారు. దీంతో బిగ్ బాస్ కన్నడ రెండో సారి నిలిచిపోయింది.
నిలిచిపోయిన బిగ్ బాస్ షో.. కంటెస్టెంట్లకు కీలక ఆదేశాలు
బిగ్ బాస్ కన్నడ రెండోసారి ఆగిపోయింది. ప్రభుత్వ చర్యలతో ఇప్పుడు బిగ్ బాస్ షో ఇబ్బందుల్లో పడింది. అలాగే, హౌల్ లో ఉన్న కంటెస్టెంట్లు కూడా ఇబ్బందుల్లో పడ్డారు. కంటెస్టెంట్లు మంగళవారం (ఆగస్టు 7) సాయంత్రం 7 గంటలలోపు హౌస్ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. కాబట్టి ఈసారి షో తాత్కాలికంగా నిలిచిపోనుంది. అయితే, బిగ్ బాస్ షో సగంలో నిలిచిపోవడం ఇదే మొదటిసారి కాదు.
Bigg Boss: బిగ్ బాస్ మొదటిసారి ఎప్పుడు నిలిచిపోయింది?
బిగ్ బాస్ కన్నడ 8వ సీజన్ కూడా సగంలో ఆగిపోయింది. అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ కన్నడ 8వ సీజన్ సరిగ్గా 71 రోజులు కొనసాగింది. బిగ్ బాస్ షో పూర్తికావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే, అప్పటికే కోవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా వ్యాపించింది. అనేక కఠినమైన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో బిగ్ బాస్ షో నిలిపివేయాల్సి వచ్చింది. అలాగే, బిగ్ బాస్ కన్నడ షోపై కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారనే తీవ్రమైన ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రభుత్వ హెచ్చరికల తర్వాత బిగ్ బాస్ 8వ సీజన్ సగంలో ఆగిపోయింది.
బిగ్ బాస్ 8 సీజన్ కు మస్తు పాపులారిటీ !
బిగ్ బాస్ 8వ సీజన్ చాలా ప్రజాదరణ పొందిన రియాలిటీ షో గా నిలిచింది. ఎందుకంటే ఈ సీజన్‌లో హౌస్ లోకి వివిధ ప్రాంతాల నుండి కంటెస్టెంట్లు వచ్చారు. హాస్యనటుడు మంజు పావగడ్, బైక్ రేసర్ అరవింద్, శాండల్‌వుడ్ నటి శుభ పూంజా, నటి దివ్య ఉరుదుగ, శమంత గౌడ, ప్రముఖ నటుడు శంకర్ అశ్వత్, నటి నిధి సుబ్బయ్య సహా ఇతర ప్రముఖ కంటెస్టెంట్లు ఈ సీజన్‌లో పోటీ పడ్డారు. కోవిడ్ ప్రభావం తగ్గి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత, కన్నడ బిగ్ బాస్ 8వ సీజన్ మళ్లీ ప్రారంభమైంది. బిగ్ బాస్ సెకండ్ ఇన్నింగ్స్ పేరుతో మళ్లీ ప్రారంభమైన ఈ సీజన్‌లో మంజు పావగడ్ విజేతగా ట్రోఫీని గెలుచుకుంది.
Bigg Boss: జోలీవుడ్ స్టూడియోను ఖాళీ చేయాలంటూ నోటీసులు
బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్ ప్రారంభమై 9 రోజులు అయింది. లోపలికి బయట నుంచి ఎవరు రాకుండా తాళం వేశారు. తీవ్ర ఆరోపణల తర్వాత బిగ్ బాస్ హౌస్ ప్రధాన తలుపు తెరవాలని అధికారులు నిర్వాహకులను ఆదేశించారు. కానీ నిర్వాహకులు తలుపు తెరవడానికి నిరాకరించారు. దీంతో ఇరువురి మధ్య వాదనలు జరిగాయి. హౌస్ తలుపులు తెరవకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే మంగళవారం పోలీసులు, అధికారులు బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించి అందరినీ బయటకు పంపించారు.
రామనగర జిల్లా మేజిస్ట్రేట్ తేజస్విని నేతృత్వంలో అధికారులు లోపలికి ప్రవేశించారు. అధికారులు ఇప్పటికే ప్రధాన గేటుకు తాళం వేశారు. బిగ్ బాస్ హౌస్ ను ఖాళీ చేయాలని కంటెస్టెంట్లు ఆదేశాలు ఇచ్చారు.