బిగ్ బాస్ ఫేమ్ దివ్య సురేష్ పై హిట్ అండ్ రన్ కేసు, కారు ఆపకుండా పారిపోయిన నటి
బిగ్‌బాస్ ఫేమ్ , నటి దివ్య సురేష్‌పై బెంగళూరులోని బ్యాటరాయనపురలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. యాక్సిడెంట్ చేసి, కారు ఆపకుండా పారిపోయిందని ఆమెపై ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, నటి దివ్య సురేష్‌పై బెంగళూరు నగరంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. అక్టోబర్ 4న రాత్రి కారుతో ఢీకొట్టి, ఆపకుండా పారిపోయింది. సీసీటీవీలో దివ్య కారు నడుపుతున్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటన లేటుగా వెలుగులోకి రావడంతో ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యింది.
దివ్యపై హిట్ అండ్ రన్ కేసు
అక్టోబర్ 4న బెంగళూరుకు చెందిన అనిత, అనుష, కిరణ్ ముగ్గురూ బైక్‌పై వెళ్తున్నారు. అప్పుడే దివ్య సురేష్ కారు ఢీకొనడంతో ముగ్గురూ కిందపడ్డారు. అనుష, కిరణ్‌కు స్వల్ప గాయాలవగా, అనిత కాలికి తీవ్ర గాయమైంది. ప్రమాదం జరిగినా నటి దివ్య సురేష్ కారు ఆపకుండా వెళ్లిపోయింది.
ఫిర్యాదు చేసిన కిరణ్
గాయపడిన అనితను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి సర్జరీ చేశారు. ఈ ఆపరేషన్ కు దాదాపు 2 లక్షలు ఖర్చయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదం తర్వాత దివ్య సురేష్ బాధితులను సంప్రదించలేదు. అక్టోబర్ 7న కిరణ్ అనే వ్యక్తి బ్యాటరాయనపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
డీసీపీ అనూప్ ప్రకటన
దీనిపై బెంగళూరు నగరానికి చెందిన డీసీపీ అనూప్ స్పందిస్తూ, అక్టోబర్ 4న బ్యాటరాయనపుర పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎంఎం రోడ్డులో ప్రమాదం జరిగింది. రెండు రోజుల వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అక్టోబర్ 7న కిరణ్ ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో దివ్య అనే మహిళ కారుతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు.
కారు ఆపకుండా వెళ్లిన దివ్య సురేష్
ప్రమాదానికి గురైన కిరణ్ ఏషియానెట్ తో మాట్టాడారు. ‘’మా కజిన్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో రాత్రి ఆసుపత్రికి వెళ్తున్నాము, టర్నింగ్‌లో ఒక నల్ల కారు ఢీకొట్టింది. ఒక మహిళ కారు నడుపుతున్నట్లు కనిపించింది. ఫిర్యాదు చేశాక, కారులో ఉన్నది దివ్య సురేష్ అని పోలీసులు చెప్పారు. గాయపడిన అనిత చికిత్స పొందుతోంది'' అని కిరణ్ తెలిపారు.