- Home
- Entertainment
- కన్నీటి మయంగా 'బలగం' విజయలక్ష్మి జీవితం.. భర్త లేరు, కోడలు గర్భవతిగా ఉండగా కొడుకు కూడా..
కన్నీటి మయంగా 'బలగం' విజయలక్ష్మి జీవితం.. భర్త లేరు, కోడలు గర్భవతిగా ఉండగా కొడుకు కూడా..
టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ బలగం చిత్రం సంచలన విజయం అందుకుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన బలగం చిత్రం ఇప్పటికి రికార్డులు సృష్టిస్తూనే ఉంది.

టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ బలగం చిత్రం సంచలన విజయం అందుకుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన బలగం చిత్రం ఇప్పటికి రికార్డులు సృష్టిస్తూనే ఉంది. జబర్దస్త్ కమెడియన్ గా ఉన్న వేణు ఎల్దండి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మనసుని హత్తుకునే భావోద్వేగాలతో వేణు ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించారు.
తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో సైతం ఈ చిత్రాన్ని ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ భాష, యాస, పల్లెటూరి సంప్రదాయాలు, మనుషుల మధ్య బంధాలని వేణు కళ్ళకి కట్టినట్లు చూపించారు.ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి విశేషమైన గుర్తింపు దక్కుతోంది.
ఈ చిత్రంలో కొమరయ్య చెల్లి పోశవ్వ పాత్రలో నటించిన విజయలక్ష్మిని ప్రేక్షకులు అంత తొందరగా మరచిపోలేరు. పల్లెటూరిలో ఆ వయసులో ఉన్న మహిళల ఎలా ప్రవర్తిస్తారో అచ్చం అలాగే విజయలక్ష్మి పోశవ్వ పాత్రలో ఒదిగిపోయింది. ఆ వయసు వృద్ధుల్లో మనసులో భావోద్వేగాల్ని అదుపుచేసుకోలేరు. ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తారు. ఒకవైపు తన అన్న చనిపోయాడని బాధతో కుమిలిపోతూనే.. సూటిపోటి మాటలతో పెద్ద గొడవ సృష్టించి కథలో మలుపుకి కారణం అవుతుంది.
సినిమా మొత్తం పోశవ్వ పాత్రలో విజయలక్ష్మి చేసిన సందడి బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఇంటర్వ్యూలో విజయలక్ష్మి తన జీవితంలో ఎదురైన విషాదాలు వివరించింది. విజయలక్ష్మి అనుభవించిన విషాదాలు తెలిస్తే ఎవరికైనా హృదయం బరువెక్కాల్సిందే.
నా పిల్లలకు పెళ్లిళ్లు కాకముందే నా భర్త మరణించారు. నా కొడుకులు ఇద్దరూ కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేశాను. నా కోడలు నిండు గర్భంతో ఉన్నప్పుడు చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ విషాదం నుంచి నేను ఇప్పటి వరకు తేరుకోలేదు.
చేతికందిన కొడుకు మరణించడంతో ఆ భాద తనని జీవితాంతం వెంటాడుతోందని విజయలక్ష్మి తాజాగా ఇంటర్వ్యూలో తెలిపారు. నేను నాటకాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నా. నంది సహా పలు అవార్డులు వచ్చాయి. హరికథలు కూడా చెబుతుంటా అని విజయలక్ష్మి తెలిపారు. నేను నటించిన మొదటి చిత్రం బలగం మాత్రమే. నాకు ఈ రోజు ఇంత మంచి గుర్తింపు దక్కింది అంటే అందుకు కారణం దర్శకుడు వేణు గారు మాత్రమే అని విజయలక్ష్మి తెలిపారు.