Prema Entha Madhuram: మాన్సీ చెంప పగలగొట్టిన అను.. ఆర్య తన వారసులను కలవనున్నాడా?
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ఇంటికి దూరమైన తోటి కోడల్ని ఇంకా సాధించాలని చూస్తున్న ఒక మూర్ఖురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నీకు ఆశ్రయమిచ్చినందుకు ఈరోజు నా పరువు కాపాడవు నీది ఎంత మంచి మనసు అలాంటి నీకు భగవంతుడు ఎందుకు ఇలాంటి శిక్ష విధించాడో? ఎప్పటికైనా నీ కష్టాలన్ని దూరం చేసి నీ సంతోషాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తాడు అంటుంది బామ్మ. మనలో మనకి ఇలాంటివన్నీ ఏంటి బామ్మ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అను.
బామ్మ భగవంతుడిని తలచుకుంటూ ఏమి నాటకాలు ఆడుతున్నావయ్యా.. ఆ పిల్లలకి తండ్రిని దూరం చేసావు. ఆ భార్యాభర్తలని దూరం చేసావు అన్ని బంధాలని దూరం చేసి ఏ బంధము లేని నాతో సంబంధం కలిపావు. ఈ కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనుకుంటుంది బామ్మ. సీన్ కట్ చేస్తే బామ్మ ఇంటికి విద్య, స్కూల్ మాస్టారు ఇద్దరూ వస్తారు.
అప్పటికే అను చేతిలో ఉన్న బాబు ఏడుస్తూ ఉంటాడు. అను బయటకు వచ్చి మీరు ఎవరు.. బామ్మ లేరు బయటకు వెళ్లారు అని చెప్తుంది. తనని పరిచయం చేసుకుని బామ్మకి పళ్ళు ఇద్దామని వచ్చాను అక్క అయినా బాబు ఎందుకు అలా ఏడుస్తున్నాడు అని అంటుంది విద్య. ఎందుకో తెలియటం లేదు ఇందాకట్నుంచి ఏడుస్తున్నాడు అంటుంది అను. వేడి చేసి ఉంటుంది అక్క. పాలు అరగకపోయినా కూడా పిల్లలు ఏడుస్తారు.
ఇంట్లో ఆముదం ఉంటే తీసుకురా అంటుంది విద్య. ఇంతలో మాస్టారు కి ఏదో ఫోన్ రావటంతో పక్కకు వెళ్లి మాట్లాడుతుంటారు. అను లోపలికి వెళ్లి ఆముదం తో పాటు పాపని కూడా తీసుకువస్తుంది. మీకు కవల పిల్లలా భలే ముద్దుగా ఉన్నారు అంటుంది విద్య. బాబుకి ఆముదం రాసేసరికి కొంచెం రిలాక్స్ అయ్యి ఏడుపు ఆపేస్తాడు. నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటుంది అను.
చిన్నప్పుడే అమ్మ పోయింది చెల్లిని తమ్ముడిని నేనే తల్లినై పెంచాను. బాధ్యతలు అన్ని నేర్పించాయి అంటుంది విద్య. నువ్వు ఎంత వరకు చదువుకున్నావు అంటుంది అను. బాధ్యతల వల్ల చదువుకోలేకపోయాను ఎప్పటికైనా చదువుకోవాలని అది నాకు ఇష్టం. అందుకే చదువు చెప్పే మాస్టర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటుంది విద్య.
ఆ మాస్టారు ఈ మాస్టారే ఎందుకు కాకూడదు ఫోన్ మాట్లాడుతున్న మాస్టర్ ని చూపిస్తుంది అను. నాకు అంత అదృష్టం ఉందో లేదో అక్క. ఆయనకి నాకు కూడా రేపు పెళ్లి చూపులు అంటుంది విద్య. ఏమో ఎవరికి తెలుసు ఆ పెళ్లి చూపులకి వచ్చేవాడు ఈ మాస్టర్ అవ్వొచ్చు కదా అని విద్యకి ఆల్ ద బెస్ట్ చెప్తుంది అను. వెళ్ళిపోతున్న వాళ్ళిద్దర్నీ చూస్తూ వాళ్ళిద్దరూ కలవాలని కోరుకుంటుంది అను.
సీన్ కట్ చేస్తే పిల్లలు తీసుకుని హాస్పిటల్ కి వెళ్తారు బామ్మ, అను. అక్కడికి ముసుగేసుకుని తన పని మీద వస్తుంది మాన్సీ. డాక్టర్ తో మాట్లాడి తన పని సక్సెస్ అవుతుందో లేదో కనుక్కుంటుంది. కచ్చితంగా మీరు అనుకున్నది అవుతుంది అంటుంది డాక్టర్. తర్వాత రిపోర్ట్స్ తీసుకుని బయటకు వచ్చేస్తుంటే రిపోర్టులు కిందన పడిపోతాయి. కొన్ని పేపర్స్ అను కాళ్ళ దగ్గరికి రావడంతో వాటిని తీసుకొని మాన్సీ కి ఇస్తుంది.
అప్పుడే మాన్సీ ముసుగు తొలగిపోవడంతో ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని షాక్ అవుతారు. మాన్సీ ని చూసిన అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆమెని ఆపి ఎక్కడున్నావు ఏంటి అంటూ విసిగిస్తుంది మాన్సీ. నన్ను వదలండి నేను వెళ్ళాలి అని అను చెప్పినా వినిపించుకోదు. ఇంతలో అనుకోకుండా అక్కడికి ఆర్య వస్తాడు.అది చూసిన మాన్సీ అదిగో బ్రో ఇన్ లా వస్తున్నారు పిలుస్తా ఉండు అని మాన్సీ అనటంతో కంగారుపడి పక్కకి తప్పుకుంటుంది అను. తను వెళ్ళిపోయిన తర్వాత మాన్సీ కూడా కంగారుగా పక్కకి తప్పుకుంటుంది. ఆర్య తన కంపెనీలో పని చేసే వ్యక్తికి బాగోకపోవటంతో అతనిని పలకరించడానికి వస్తాడు. శాలరీ గురించి మీ బాబు భవిష్యత్తు గురించి బాధపడొద్దు అని ధైర్యం చెప్తాడు.
ఆర్య లోపలికి వెళ్ళటం చూసిన మాన్సీ మళ్ళీ అను దగ్గరికి వచ్చి నీకు ఇద్దరు పిల్లలు కదా ఒక్కడే కనిపిస్తున్నాడేంటి ఇంకొకరిని తినటానికి లేక అమ్మేశావా అంటుంది. పిల్లల్ని అమ్ముకోవటానికి నేను నీకు లాగా కడుపు తీపి లేని దానిని కాదు. అమ్మని.. ఎలాగైనా పోషించుకుంటాను అంటుంది అను. ఎలా పోషించుకుంటావ్? వర్ధన్ వారసులు ముష్టెత్తుకొని బ్రతకడం తలుచుకుంటే చాలా బాధగా ఉంది అంటుంది మాన్సీ. మాన్సీ చెంప పగలగొడుతుంది అను. నన్ను చులకన చేస్తే ఊరుకుంటాను కానీ నా పిల్లల జోలికి రావద్దు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
బామ్మ దగ్గరికి వెళ్లి త్వరగా వెళ్ళిపోదాం పద అంటుంది అను. ఇప్పుడే బాబుని చుక్కల మందు వేయడానికి తీసుకువెళ్లారు కాసేపు ఆగు అంటుంది బామ్మ. ఇంతలోనే సిస్టర్ వచ్చి పాపని ఇవ్వండి మందు వెయ్యాలి అంటుంది. ఇప్పుడేమీ వద్దు మా బాబుని మాకు ఇచ్చేయండి అని కంగారు పడుతుంది అను. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఈ మందు తప్పనిసరిగా వేయాలి అంటుంది సిస్టర్. బామ్మ కూడా అనుని మందలించడంతో పాపని తీసుకుని సిస్టర్ వెనుక వెళ్తుంది అను. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.