తెలుగులో విజయ్ మరో సినిమా.. నిర్మాత ఎవరు? ఎవరి దర్శకత్వంలో..?
తమిళ స్టార్ విజయ్ ఇప్పటికే నేరుగా తెలుగులో ‘వారసుడు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుగులోనే మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

‘బాహుబలి’,‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ఫ’ వంటి చిత్రాల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో రూపుదిద్దుకుంటున్న చిత్రాలపై దేశ వ్యాప్తంగా ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇతర భాషాలకు చెందిన స్టార్స్ కూడా డైరెక్ట్ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ముఖ్యంగా తమిళ హీరోలు టాలీవుడ్ లో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో విజయ్ తళపతి (Vijay Thalapathy)కూడా తెలుగు సినిమాలపై మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటికే డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ‘వారసుడు’(Varisu)లో నటిస్తున్నారు. ఇప్పటికే విజయ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) విజయ్ సరసన నటిస్తోంది. ప్రస్తుతం తుది దశ షూటింగ్ లో ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో విజయ్ మరో తెలుగు సినిమాకు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో విజయ్ 68వ సినిమా తెలుగులో రూపుదిద్దుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నెట్టింట గట్టిగానే ప్రచారం జరుగుతోంది. నిర్మాతలు నవీన్ ఎర్రేని, వై రవి శంకర్ విజయ్ తో భారీ స్థాయిలో సినిమాను రూపొందాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రానికి దర్శకుడిగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీని ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విజయ్ 68వ సినిమాకు సంబంధించిన కథను కూడా మేకర్స్ కు వినిపించారంట. ‘వారసుడు’ రిలీజ్ తర్వాత ఇందుకు సంబంధించిన డిటేల్స్ పూర్తి స్థాయిలో బయటికి రానున్నాయని అంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలోనే అల్లు అర్జున్ నటిస్తున్న‘పుష్ప : ది రూల్’ తెరకెక్కుతోంది. అలాగే బాలయ్య ‘ఎన్బీకే 107’, మెగా స్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ కూడా రూపుదిద్దుకుంటోంది. అతితక్కువ సమయంలోనే బ్లాక్ బాస్టర్ చిత్రాలను నిర్మించి టాప్ పొజిషన్ లో నిలిచిందీ సంస్థ. ప్రస్తుతం రాబోతున్న సినిమాలతో మరింత బలమైన సంస్థగా మారనుంది.