కుక్క ఎవరిని కరిచినా నన్నే తిడుతున్నారు, అమల అక్కినేని ఆవేదన
Amala Akkineni upset : ప్రముఖ నటి.. నాగార్జున భార్య, అమలా అక్కినేని షాకింగ్ కామెంట్స్ చేశారు. జంతువులను ప్రేమించండి అని చెప్పినందుకు తనను తిడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అమల జంతుప్రేమికురాలు
ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసి.. నాగార్జునతో పెళ్లితరువాత ఫ్యామిలీకే పరిమితం అయ్యింది అక్కినేని అమల. ప్రస్తుతం అడపాదడపా.. క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. సందడిచేస్తోంది అమల. సినిమాలతో పాటు సమాజాసేవ కూడా చేస్తుంది. మరీ ముఖ్యంగా రెడ్ క్రాస్ ద్వారా జంతువులను రక్షింకే కార్యక్రమంలో ఆమె భాగం అయ్యారు. వీధి కుక్కలను రక్షించాలంటూ ఆమె తన వాయిస్ ను అందిస్తుంటారు. ఇక ఈ క్రమంలో రీసెంట్ గా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అమల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఎక్కడ కుక్క కరిచినా.. నన్నే తిడుతున్నారు
దేశంలో ఎవరిని, ఎక్కడైనా వీధికుక్క కరిచిన ఘటన జరిగితే ..చాలామంది తన పేరును తీస్తూ విమర్శలు చేయడం తీవ్రంగా బాధిస్తోందని అమల అన్నారు. ఎవరిని కుక్క కరిచినా నన్నే తిడతారా అని ఆమె ఎమోషనల్ అయ్యారు. తాను చిన్నప్పటి నుంచే జంతువులను ప్రేమిస్తూ, వాటికి హింస చేయకూడదని మాత్రమే చెప్పే వ్యక్తినని అమల స్పష్టం చేశారు. కానీ ఈ ఒక్క కారణంతోనే, వీధికుక్కల సమస్యలకు తనలాంటి జంతు ప్రేమికులే కారణమంటూ కొందరు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తుండటం బాధాకరమణి ఆమె అన్నారు. ఎక్కడ కుక్కల దాడి జరిగినా తన పేరును ట్రెండ్ చేస్తూ విమర్శలు రావడం తనను మానసికంగా కలవరపెడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వీధికుక్కల సమస్య..
గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా వీధికుక్కల సమస్య పెరిగిపోయింది. ఎంతో మంది కుక్కల దాడిలో మరణించారు. చిన్నారులను కుక్కలు దారుణంగా కరిచి చంపేసిన సంఘటలను చాలా ఉన్నాయి. ఈ దాడులపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జంతు హక్కుల కార్యకర్తలపై, జంతు ప్రేమికులపై సోషల్ మీడియాల్లో తరచూ విమర్శలు వస్తుంటాయి. మనుషుల ప్రాణాలు పోతున్నా.. మీకు కుక్కలే కావాలా అంటూ వారు సూటిగాప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అమల తో పాటు మరికొంత మంది జంతుప్రేమికులపై సోషల్ మీడియాలో విమర్శలు రావడం కామన్ అయిపోయింది.
అమల మాట్లాడుతూ..
''జంతువుల పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరాన్ని మాత్రమే తాను ఎప్పుడూ చెప్పానని, కానీ వీధికుక్కల నియంత్రణ బాధ్యతలు ప్రభుత్వ యంత్రాంగానికి, మునిసిపాలిటీలకు సంబంధించినవని స్పష్టంగా తెలిపారు. దీనిలో తన పాత్రను తప్పుగా అర్థం చేసుకోవడం తగదని, అనవసర విమర్శలు బాధిస్తున్నాయని'' అమల తెలిపారు.ఇంటర్వ్యూలో అమల వ్యక్తిగత జీవితంపై కూడా మాట్లాడారు. ప్రస్తుతం తాను కుటుంబ బాధ్యతలు, ఇతర పనులను బ్యాలన్స్ చేస్తూ.. బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ విషయంలో అమలను వ్యతిరేకిస్తూ.. కొన్ని కామెంట్లు రాగా.. కొంత మంది అమల వాదనతో సపోర్ట్ చేస్తున్నారు.

