మరోసారి దుమారం రేపుతున్న హీరోయిన్ ప్రత్యుష కేసు, ఆ టైమ్‌లో అసలేం జరిగిందంటే?
రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మరణం కేసు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరి అసలు ఆ టైమ్‌లో ఏం జరిగింది? ఆ కేసు ఏంటనేది చూస్తే.

హీరోయిన్‌గా విశేష గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష
తెలుగు హీరోయిన్‌గా అనతి కాలంలోనే విశేష ఆదరణ పొందింది నటి ప్రత్యూష. తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా రాణించడం కష్టమైన పరిస్థితుల్లో ప్రత్యూష అన్ని సవాళ్లని దాటుకుని హీరోయిన్‌గా నిలబడింది. తెలంగాణలోని భువనగిరికి చెందిన ప్రత్యూష 1998లో `రాయుడు` చిత్రంతో నటిగా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇందులో మోహన్ బాబుకి కూతురుగా నటించడం విశేషం. ఆ తర్వాత `శ్రీరాములయ్య`లోనూ నటించి ఆకట్టుకుంది. ఈ రెండు చిత్రాలతో మంచి విజయాలు అందుకుంది. అందరి దృష్టిని ఆకట్టుకుంది. అనంతరం `స్నేహమంటే ఇదేరా`, `కలుసుకోవాలని` వంటి చిత్రాలు చేసింది. `కలుసుకోవాలని`లో ఉదయ్ కిరణ్‌కి జోడీగా నటించడం విశేషం. అప్పుడప్పుడే ప్రత్యూష స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుంది.
తమిళంలోనూ సక్సెస్ అయిన ప్రత్యూష
తెలుగులోనే కాదు, తమిళంలోనూ సినిమాలు చేసి మెప్పించింది ప్రత్యూస. అక్కడ దాదాపు ఆరు సినిమాలు చేసింది. అవి కూడా విశేష ఆదరణ పొందాయి. కోలీవుడ్‌లోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా కెరీర్ పుంజుకుంటోంది, బిజీ అవుతున్న సమయలోనే ఆమె మరణం అందరిని షాక్‌కి గురి చేసింది. ప్రత్యూష మరణం టాలీవుడ్‌నే కాదు, తెలుగు స్టేట్‌ని కూడా షేక్ చేసింది. మొదట ఆమెది హత్య అని భావించారు. ప్రేమించినవాడే హత్య చేశాడని, తన ఫ్రెండ్స్ తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, దీని కారణంగానే ఆమె మరణించిందన్నారు. ఇది ఇంకా హాట్ టాపిక్‌గా మారింది. కానీ తర్వాత ప్రియుడు సిద్ధార్థరెడ్డితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం నియమించిన వైద్యుల బృందం తేల్చింది.
నటి ప్రత్యూష మరణం కేసు వివరాలు
ప్రత్యూష మరణానికి సంబంధించిన కేసు వివరాలు చూస్తే, ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి కలిసి హైదరాబాద్‌లో ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆ టైమ్‌లోనే ఇద్దరు ప్రేమలో ఉన్నారట. ఆ తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి వచ్చింది. సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్ చేశారు. ప్రత్యూష హీరోయిన్ అయినప్పటికీ కూడా ఈ ఇద్దరు కలిసే తిరిగేవారు. చాలా సందర్భాల్లో షూటింగ్‌లకు కూడా కలిసే వచ్చేవారట. ఆమెని తన బైక్‌పైనే షూటింగ్‌లకు తీసుకెళ్లేవాడట సిద్ధార్థ రెడ్డి. కానీ అనూహ్యంగా 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం ఏడు, ఎనిమిది గంటల సమయంలో ఈ ఇద్దరు విషం తాగి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూ ప్రత్యూష మరుసటి రోజు(ఫిబ్రవరి 24న)న మరణించింది. కానీ దాదాపు రెండు వారాల తర్వాత మార్చి 9న సిద్ధార్థ రెడ్డి కోలుకొని డిశ్చార్జి అయ్యాడు.
ప్రత్యూష మరణానికి కారణం
అనంతరం ఈ కేసుని సీబీఐ దర్యాప్తు జరిపింది. వారు కూల్ డ్రింక్‌లో పురుగులమందు కలుపుకుని తాగినట్టు పరీక్షల్లో గురించారు. అయితే ఆ సమయంలో ప్రత్యూషని అత్యాచారం చేసినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. లైంగిక దాడి చేసి హత్య చేసినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు వైద్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయగా, అలాంటిది ఏం జరగలేదని తెలిపింది. ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించలేదు. అయితే ఆత్మహత్యకు పురికోల్పాడని నిర్థారించి నిందితుడు సిద్ధార్థరెడ్డిపై 306, 309 సెక్షన్ల కింద ఛార్జిషీట్‌ని దాఖలు చేసింది సీబీఐ. ఈ కేసుని విచారించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధించారు. 2004 ఫిబ్రవరి 23న, అంటే ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత ఈ తీర్పుని వెలువరించారు.
హైకోర్ట్ నుంచి సుప్రీంకోర్ట్ కి ప్రత్యూష మరణం కేసు
ఆ తర్వాత దీనిపై సిద్ధార్థ రెడ్డి హైకోర్ట్ ని ఆశ్రయించారు. దీంతో జైలుశిక్షని రెండేళ్లకి తగ్గిస్తూ, రూ.50 వే జరిమానా విధిస్తూ 2011 డిసెంబర్ 28న తీర్పు వెలువరించింది హైకోర్ట్. అనంతరం 2012లో ప్రత్యూష తల్లి సరోజినిదేవి, నిందితుడు సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించారు. సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది నచికేత జోషి ఈ కేసుని వాదిస్తూ ఇందులో సాక్ష్యాధారాలన్నీ నిరూపితమయ్యాయని తెలిపారు. ప్రత్యూషని ఆత్యహత్య చేసుకునేలా సిద్ధార్థ రెడ్డి ఉసిగొల్పినందుకు సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, అది సాధ్యం కాకపోతే సెక్షన్ 306 కింద గరిష్ఠంగా శిక్ష విధించాలని తెలిపారు. ఇదిలా ఉంటే మృతురాలు, నిందితుడు ఇద్దరు పురుగుల మందు తాగిన నేపథ్యంలో అది ఆత్మహత్యకు ఉసిగొల్పాడన్న అంశం ఉత్పన్నం కాదని నిందితుడి తరపున న్యాయవాదులు నాగముత్తు, ఎస్ నరసింహారెడ్డి వాదించారు.
ప్రత్యూష కేసు సుప్రీంకోర్ట్ రిజర్వ్
ఈ కేసు ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు బుధవారం(నవంబర్ 19)న విచారణకు వచ్చింది. నిందితుడి శిక్షని పెంచాలని ప్రత్యూష తల్లి సరోజినిదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై, అదే సమయంలో హైకోర్ట్ తీర్పుని సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి చేసిన అప్పీల్ పై జస్జిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్ట్ ధర్మాసనం బుధవారం తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్ట్ ఇప్పుడు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది అందరినిలోనూ ఆసక్తి నెలకొంది.

