‘పుష్ప 2 ది రూల్’ OTT రిలీజ్ డేట్, చిన్న మెలిక
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం ఓటిటి విడుదల తేదీ గురించి ఆసక్తి నెలకొంది.
Allu Arjun, Pushpa 2, OTT release date
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule). రష్మిక (Rashmika) హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం భాక్సాఫీస్ దగ్గర రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది.
2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్’కు కొనసాగింపుగా ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule) రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై దీనిని నిర్మించారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు.ఇప్పుడీ చిత్రం ఓటిటి రిలీజ్ కు సిద్దమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఓటిటిలో ఏ తేదీ విడుదల కానుంది అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.
ఈ సినిమాలో పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. అతి తక్కువ సమయంలో రూ.1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన సినిమాగా ఖ్యాతి గడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల వల్లే ఈ రికార్డు సాధ్యమైందని చిత్ర టీమ్ ఇటీవల తెలిపింది.
ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే...పుష్ప 2 ది రూల్ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 9వ తేదీన స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
మామూలుగా ఇలాంటి పెద్ద సినిమా ఏదైనా థియేటర్లలో వచ్చిన 40-50 రోజులకు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంటుంది. ఈ సినిమా సౌత్ ఇండియన్ వెర్షన్ ముందుగా ఓటిటి లో రిలీజ్ చేసి, ఆ తర్వాత హిందీ వెర్షన్ ని వదులుతారని తెలుస్తోంది. నార్త్ లో సినిమా హవా బాగుండటంతో అక్కడ లేటు చేస్తున్నారని, అలాగే అక్కడ సినిమా పరిశ్రమ రూల్స్ ప్రకారం కూడా ఓటిటి డేట్ ని ఫిక్స్ చేసి ముందుకు వెళ్తారని వినికిడి.
దాదాపు పది రోజుల్లోనే హిందీ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.507.50 కోట్ల (కేవలం హిందీ మార్కెట్) నెట్ కలెక్షన్స్ వసూలు చేసిందని సమాచారం.హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేసింది. ‘పుష్ప 2 ది రూల్’ రికార్డుల పరంపర కొనసాగుతుందని ఆనందం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ 3డీ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో ఈ వెర్షన్‌లో సినిమా చూడొచ్చని టీమ్ తెలిపింది. త్వరలోనే దేశవ్యాప్తంగా దీనిని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పింది. పుష్ప 2 ది రూల్ సినిమా ఇప్పటికే అన్ని హిట్ సినిమా కలెక్షన్లను వెనక్కి నెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే గ్రాస్ 13 వందల కోట్లు వసూలు చేసింది. ఇంకా కలెక్షన్ల హోరు తగ్గలేదు. కలెక్షన్లలో ఎక్కడా తగ్గేదే లే అంటోంది.